Table of Contents
విజయ్ దేవరకొండ.. (Vijay Devarakonda) తెలుగు సినిమాకి సంబంధించి నయా సూపర్ స్టార్‌గా ఈ యంగ్ హీరోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలనేంత కసి, అతని ప్రతి సినిమా విషయంలోనూ చూస్తున్నాం. సినిమా సినిమాకీ విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది. ‘పెళ్ళిచూపులు’ ఓ సాధారణ విజయాన్ని అందుకున్న సినిమా అయితే, ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ సంచలనం. ‘గీత గోవిందం’ అంతకు మించిన వసూళ్ళ అద్భుతం. ఇప్పటికే 60 కోట్ల వసూళ్ళ (షేర్) మార్కెట్ తన సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, తన కొత్త సినిమా ‘నోటా’ (NOTA) తో 100 కోట్ల మార్కెట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. విజయ్ గట్టిగా చెప్పాడంటే, అది జరిగి తీరుతుందన్న భావన సినీ పరిశ్రమలో నెలకొంది. అందుక్కారణం, అతను సాధిస్తున్న విజయాలే. ఒకదాన్ని మించిన విజయం ఇంకోటి సాధిస్తుండడం, చెప్పి మరీ హిట్స్ కొడుతుండడంతో విజయ్ దేవరకొండపై ‘నమ్మకం’ దర్శక నిర్మాతల్లో రోజురోజుకీ మరింత బలపడిపోతోంది.
ఆషామాషీ ‘నోటా’ కాదిది
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు భాషల్లో ‘నోటా’ సినిమా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని ‘నోటా’ పలకరించబోతోంది. నిజానికి సినిమా రిలీజ్ డేట్‌పై నిన్న మొన్నటిదాకా రకరకాల గాసిప్స్ విన్పించాయి. అయితే అభిమానుల్ని అడిగి మరీ, విజయ్ దేవరకొండ ‘నోటా’ రిలీజ్ డేట్‌ని ఫైనల్ చేశాడు. అక్టోబర్ మొదటి వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజయ్యాక, దసరా సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి, ఓ మోస్తరు టాక్ రాబడితే చాలు, విజయ్ దేవరకొండ ‘రౌడీస్’ ఆ సినిమా విజయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అదే హిట్ టాక్ వస్తే.. ఇక, విజయ్‌ని ఆపడం ఎవరి తరమూ కాదు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy), ‘గీతగోవిందం’ (Geetha Govindam) సినిమాల్లా సూపర్ హిట్ టాక్ అందుకుందంటే.. 100 కోట్లు చాలా తేలిగ్గా రాలతాయ్ ఈ సినిమాకి.
ప్రతి రాజకీయ నాయకుడూ చూడాల్సిన సినిమా
‘నోటా’ సినిమా గురించి విజయ్ దేవరకొండ చెబుతూ, ప్రతి రాజకీయ నాయకుడూ ఈ సినిమా చూడాలని చెప్పాడు. దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే, రాజకీయాల్లో కింది స్థాయి నుంచే మార్పులు తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. ‘నేనూ సమాజంలో భాగమే. నాకూ రాజకీయాల పట్ల అవగాహన వుంది. ఇది సినిమా మాత్రమే కాదు, సామాజిక బాధ్యతతో కూడిన అంశం..’ అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు. పొలిటికల్ నేపథ్యమున్న సినిమా కావడంతో రీచ్ ఎక్కువైందని విజయ్ చెబుతున్నాడు. యంగ్ హీరోలు పొలిటికల్ నేపథ్యమున్న సినిమాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. కానీ, విజయ్ డేరింగ్ స్టెప్ వేసేశాడు.
ఇమేజ్ చట్రంలో ఇరుక్కోడట
ఫలానా ఇమేజ్ కోసం తానెప్పుడూ ప్రయత్నించబోనని చెబుతున్న విజయ్ దేవరకొండ, తన సినిమాల సక్సెస్‌లే మాట్లాడతాయనీ.. ఆ సినిమాల సక్సెస్‌ల గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదని చెప్పాడు. ‘నోటా’ సినిమా నా ఇమేజ్‌ని పూర్తిగా మార్చేస్తుందంటున్న విజయ్ దేవరకొండ, ఇప్పటిదాకా చేసిన సినిమాల్ని తీసుకుంటే, ప్రతి సినిమాలోనూ కొత్తదనం వుండడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నాడు. సక్సెస్‌లను చూసి ఉప్పొంగిపోననీ, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోననీ, చేసే పనిని చిత్తశుద్ధితో చేస్తే సక్సెస్‌లు తమంతట తామే వస్తాయని తాను నమ్ముతానని చెప్పాడు విజయ్ దేవరకొండ.
‘నోటా’ వసూళ్ళు ఎంత వరకు.?
విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్ (Mehreen Kaur Pirzada) జంటగా నటిస్తోన్న ‘నోటా’ సినిమాలో హీరో ఓ సగటు కుర్రాడు మాత్రమేనట. పరిస్థితులు ఆ సగటు కుర్రాడ్ని ఎలా మార్చాయన్నది తెరపై చూడాల్సిందేనట. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ‘గీత గోవిందం’ కారణంగా అనూహ్యమైన రీతిలో జరిగినమాట వాస్తవం. 100 కోట్ల వసూళ్ళ టార్గెట్‌తో ‘నోటా’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోపాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని ఇప్పటికే తన సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండని ఇప్పుడు ఆయా భాషల్లో ‘స్టార్ హీరో’ అనదగ్గ స్థాయిలో ఇమేజ్ బిల్డప్ చేసేశారు. అక్కడా విజయ్‌కి అభిమాన సంఘాలు వెలిశాయి. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు విజయ్ దేవరకొండ.