Table of Contents
Prashant Kishor.. ఓ వ్యక్తి మీద ఆధారపడి దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయా.? ఆయన లేకపోతే దేశంలో రాజకీయాలేమైపోతాయ్.? దేశంలో రాజకీయ పార్టీలు ఏమైపోతాయ్.?
అసలంటూ ఆ మహానుభావుడు ఆడించే రాజకీయం లేకపోతే ప్రజలు ఏమైపోతారు.? మీడియా ఏమైపోతుంది.?
అసలెవరీ ప్రశాంత్ కిషోర్.! నిజానికి, ఈయన రాజకీయ నాయకుడు కాదు. కానీ, రాజకీయాల పట్ల అవగాహన వున్నోడు. కాదు కాదు, ఎలక్షనీరింగ్.. మీద పట్టున్నోడు. అదీ అసలు సంగతి.
ఏ పార్టీకి ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం, లోటు పాట్లను గుర్తించి.. వాటిని ఆయా పార్టీలకు తెలియజేసి, ఎలా వాటిని అధిగమించాలో చెప్పడం ప్రశాంత్ కిషోర్ పని.
Prashant Kishor.. పేరు కాదది ఓ బ్రాండ్.!
ఐ-ప్యాక్ పేరుతో దేశంలో ‘ఎలక్షనీరింగ్’ చేసే ఓ సంస్థను స్థాపించాడు ప్రశాంత్ కిషోర్.
పలు రాజకీయ పార్టీల కోసం సర్వేలు చేయడం, ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో సరిపోవడం.. వెరసి, ప్రశాంత్ కిషోర్ పేరు ప్రఖ్యాతులు పెరిగాయి.
వివిధ రాజకీయ పార్టీల కోసం ఆయన ‘ఎలక్షనీరింగ్‌లో సలహాలు’ ఇవ్వడం మొదలు పెట్టాక సీన్ పూర్తిగా మారింది. ప్రశాంత్ కిషోర్ వల్లనే కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయన్న భావన బలపడింది.
ఓటర్లను ఆకర్షించే ‘పీకే’ మాయాజాలమేంటి.?
జనం ఓట్లేస్తే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కాదు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్ని అనుసరిస్తే అధికారం దక్కుతుందనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి.
జనం మెదళ్ళలో ‘విషం’ నింపేయడం ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో ఒకటని అంటుంటారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని దువ్వుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరతారో, ఆ పార్టీ కోసం పని చేస్తారో.. ఎలాగైతేనేం, ఆయన ‘చెయ్యి’ కాంగ్రెస్ పార్టీ మీద పడితే.. ఆ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం వుంటుంది.
అది సరేగానీ, తెలంగాణలో టీఆర్ఎస్.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీతో కలిసి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్, జాతీయ స్థాయలో కాంగ్రెస్ పార్టీతో ఎలా పని చేయగలడు.?
సిద్ధాంతాలూ.. చింతకాయలూ ఆయనకు అనవసరం.!
సిద్ధాంతాలతో ఆయనకు పని లేదు. డబ్బుతోనే పని. వ్యవస్థల్ని నాశనం చేసెయ్యడమే ఆయన వ్యూహం.. అనే విమర్శల్లో నిజం లేకపోలేదని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది.
Also Read: Young Tiger NTR Politcs.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?
ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ప్రస్తావనలేని రాజకీయాన్ని దేశంలో ఊహించగలమా.? ఈ ఆలోచనే అత్యంత దారుణం.
ప్రజలు, పార్టీలు.. ఇవన్నీ తర్వాత. ముందైతే, ప్రశాంత్ కిషోర్ వుండాలి. దేశంలో ఎన్నికల వ్యవస్థని ప్రభావితం చేయగలిగే స్థాయికి ప్రశాంత్ కిషోర్ ఎదిగారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదు.. ప్రశాంత్ కిషోర్ స్వామ్యం.. అనడం తప్పెలా అవుతుంది.?
ఓ రాజకీయ పార్టీని నడపడానికి అవసరమైనంత సొమ్ము.. దాంతోపాటుగా, ప్రశాంత్ కిషోర్‌ని ఒప్పించడానికి అవసరమయ్యేంత సొమ్ము వుంటే.. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు.. అధికార పీఠమెక్కేయొచ్చు.! అంతేనా.?