రాజకీయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంట్లో సభ్యులతో (Rajnikanth Political Entry) కూడా చీవాట్లు తినాల్సి రావొచ్చు.. స్నేహితుల్ని దూరం చేసుకోవాల్సి రావొచ్చు. అప్పటిదాకా అభిమానించిన అభిమానుల చేత కూడా తిట్లు తినాల్సిన పరిస్థితి రావొచ్చు.
చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళి ‘మేం తప్పు చేశాం’ అనే భావనకు గురయ్యారు. ఔను, రాజకీయం అంటే.. అది వేరే. అప్పటిదాకా మంచోడు.. రాజకీయ నాయకుడయ్యాక చెడ్డోడు. ఇది చాలామంది సినీ ప్రముఖుల విషయంలో నిరూపితమయ్యింది.
అలాగని, వాళ్ళంతా చెడ్డోళ్ళుగా మారిపోలేదు. వాళ్ళు అలానే వున్నారు.. వాళ్ళని చూసే, చూపించే ‘రాజకీయం’ అలా చెడ్డగా మార్చేస్తుంటుంది. రజనీకాంత్.. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఆ పేరు ఓ అద్భుతం.
రజనీకాంత్ అంటే తెలియనివారెవరున్నారు.? ‘నువ్వేమన్నా రజనీకాంత్‌వా.?’ అని చిన్న పిల్లల్ని సరదాగా ఆటపట్టిస్తుంటాం.. అదీ రజనీకాంత్ స్టయిల్ అంటే. ఓ సామాన్యుడు సూపర్ స్టార్‌గా ఎదిగిన వైనం రజనీకాంత్.! సినీ పరిశ్రమలో రజనీకాంత్‌లా స్టార్లుగా మారిన నటులు చాలా తక్కువమందే వున్నారు. అందరిలోకీ మళ్ళీ రజనీకాంత్ చాలా చాలా స్పెషల్.
చాలాకాలం క్రితమే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సి వుంది. కానీ, సరైన సమయం రాలేదు. త్వరలో వచ్చేస్తోందట. డిసెంబర్ 31న ప్రకటన చేస్తానంటున్నారు రజనీకాంత్, రాజకీయాలపై. జనవరిలోనే రజనీకాంత్ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందట.
త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుందట. అయితే, రజనీకాంత్ సోలోగా రాజకీయం చేస్తారా.? ఇతర పార్టీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ పలు రాజకీయ పార్టీలు రజనీకాంత్‌కి ‘ఆఫర్లు’ ఇచ్చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లో బీజేపీ కూడా వుంది. ఇప్పుడు అంతే.. అలాగే వుంటాయ్ అన్నీ.
పరిస్థితి అంతా తమ కంట్రోల్‌లోనే వున్నట్లు అనిపిస్తుంది.. కానీ, ఒక్కసారి తేడా వచ్చాక.. మొత్తం మారిపోతుంది. రజనీకాంత్ ఇప్పుడు గొప్పోడు.. రేప్పొద్దున్న చెడ్డోడు. పైగా, తమిళనాడు అంటేనే రివెంజ్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. కరుణానిధి, జయలలిత లాంటి హేమాహేమీలే తమిళనాడు రాజకీయాల్ని తట్టుకోవడానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది.
ఇక, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చిరంజీవి అందరివాడు.. అయితే, ఆయన సినిమాల్లో వున్నంతవరకే అందరివాడు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో, సీన్ మారిపోయింది. చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌కి ఒకప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు, గౌరవం వున్నాయి.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక, ఆ బ్లడ్ బ్యాంక్ మీద కూడా నీఛ రాజకీయాలు చేశారు కొందరు. చిరంజీవి కుటుంబంలో చిచ్చుపెట్టారు. రజనీకాంత్ విషయంలోనూ ఇలాంటివి జరిగే అవకాశం వుంది. ఎందుకంటే, రాజకీయమంటేనే అంత. మరి, ‘బాబా’ రజనీకాంత్ అవన్నీ తట్టుకుని నిలబడతాడా.? నిలబడితే మాత్రం, ఇప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా అది పెను సంచలనమే అవుతుంది.