ఏ క్షణాన అయినా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అరెస్ట్ తప్పదంటూ నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా దాకా కోడై కూసేసిన సంగతి తెలిసిందే. ఇలాంటివి చాలా చాలా సున్నితమైన అంశాలు (Sorry Rakul Preet Singh).
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం తర్వాత నటి రియా చక్రవర్తి అందరికీ ‘టార్గెట్’ అయ్యింది. డ్రగ్స్ కేసులో ఆమె ఇప్పటికే అరెస్టయిన విషయం విదితమే. రియా చక్రవర్తి విచారణ సందర్భంగా రకుల్ పేరు చెప్పిందన్నది మీడియా కథనాల సారాంశం.
అయితే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ కేసుతో సంబంధం లేదని తేల్చేశారు. డ్రగ్స్ కేసులో తాము కొత్తగా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు ఈ కేసుతో లింకప్ అయి వున్నట్లు తాము ఎక్కడా పేర్కొనలేదనీ చెప్పారు.
అంతే, అప్పటిదాకా రకుల్‌పై జరిగిన ప్రచారమంతా కేవలం దుష్ప్రచారమేనని తేలిపోయింది. హీరోయిన్ సమంత, ఈ వ్యవహారాలపై స్పందిస్తూ, రకుల్ ప్రీత్ సింగ్‌కీ అలాగే సారా అలీ ఖాన్‌కీ (Sara Ali Khan) క్షమాపణ చెప్పింది. ‘మీ పట్ల దుష్ప్రచారం జరిగింది..’ అని పేర్కొంటూ, ‘సారీ రకుల్ ప్రీత్ సింగ్, సారీ సారా అలీ ఖాన్’ అని సోషల్ మీడియాలో పేర్కొంది సమంత అక్కినేని (Samantha Akkineni).
నిజానికి, క్షమాపణ చెప్పాల్సింది సమంత కాదు. సమంతకి రకుల్ పట్ల వున్న అభిమానమది. మొత్తంగా మీడియా సంస్థలన్నీ రకుల్ ప్రీత్ సింగ్‌కి క్షమాపణ చెప్పాలేమో. ఎందుకంటే, గాలి వార్తల్ని పోగేసి.. సెలబ్రిటీలపై బురద చల్లడం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడున్న మీడియాకి.
సాధారణ గాసిప్స్ వేరు, జీవితాల్ని నాశనం చేసేసే గాసిప్స్ వేరు. బలవన్మరణానికి పాల్పడేందుకు ఒక్క క్షణం మానసిక వేదన కూడా కారణం కావొచ్చు. తనపై ‘డ్రగ్స్ కేసుకి సంబంధించిన’ ఆరోపణలు రావడంతో, రకుల్‌తోపాటు సారా అలీఖాన్ ఎంత ఆవేదన చెంది వుంటారో ఏమో.!
మీడియా ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా.? సంచలనాల కోసం అదే అత్యుత్సాహం ఇకపైనా కొనసాగుతుందా.? ఇప్పుడు రకుల్, సారా అలీ ఖాన్, రేప్పొద్దున్న ఇంకెవరు మీడియా కారణంగా అభాసుపాలవ్వాల్సి వస్తుందో.!