హైద్రాబాద్ నగరానికి దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. ఇదేమీ పెద్ద దూరం కాదు. ఓ వీకెండ్‌లో అలా వరంగల్ వెళ్లి వచ్చేద్దాం అనుకునే నగరవాసికి అక్కడ్నించి కూత వేటు దూరంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని (Ramappa Temple UNESCO Telangana) చూసి రావాలంటే కొంచెం ఇబ్బందే. అదే, ఆ పక్కనే ఉన్న లక్నవరం చెరువు అందాల్ని తిలకించాలంటే మాత్రం ఉత్సాహం ఉప్పొంగుకొచ్చేస్తుంది. కారణం లక్నవరం చెరువులో తీగల వంతెన ఉంది మరి.
యునెస్కో గుర్తింపు దక్కడంతో ఇప్పుడు రామప్ప గురించి అంతా చర్చించుకుంటున్నారు. అయినా కానీ, లక్నవరం చెరువు వైపు వెళుతున్న వారిలో సగం మంది కూడా రామప్ప వైపు తొంగి చూడడం లేదు. ఎందుకిలా.? అప్పట్లో రామప్ప దేవాలయాన్ని ఎలా అందరం నిర్లక్ష్యం చేశామో.. ఇప్పుడూ అదే జరుగుతోంది.
Also Read: బిట్టూస్ ట్రావెల్ ముచ్చట్లు: శ్రీశైలం చూసొద్దాం
మనిషి మోయలేనంత బరువున్న రాళ్లు.. భారీ క్రేన్లు సైతం పైకి లేపలేనంత బరువైన రాళ్లతో వందల ఏళ్ల క్రితం నిర్మితమైన అద్భుత కట్టడం రామప్ప దేవాలయం. చుట్టూ ఎర్రటి రాళ్లు.. ఆ ఎర్రటి రాళ్లకు కాంట్రాస్ట్‌గా నల్లటి రాళ్లు.. ఆగండాగండి. అవి రాళ్లు కావు.. శిల్పాలు. ఒక్కో రాయినీ ఒక్కో రకంగా మలిచారు. ప్రతిదీ అద్భుతమే.
ఒక రాయి అద్భుతమైన స్థంభంగా మారితే, మరో రాయి అందమైన నాట్య గత్తెను పోలిన శిల్పంలా మారింది. వర్ణించడానికి బహుశా ఏ భాషలోనూ పదాలు సరిపోవేమో. అంతటి అద్భుతం రామప్ప దేవాలయంలోని ప్రతీ అంగుళం.
Also Read: శ్రీకూర్మం: కూర్మావతారంలో శ్రీ మహా విష్ణువు కొలువుదీరిందిక్కడే.!
శ్యాండ్ బాక్సు టెక్నాలజీతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. అదొక్కటే కాదు, తేలికైన ఇటుకలు మరో ఆకర్షణ. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవు. నిజంగానే అదొక అత్యద్భుత దృశ్యం. కాకతీయుల కాలంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో చదువుకుని చాలా తేలిగ్గా మర్చిపోయాం.
సంపద అంటే, మనం సంపాదించేది కాదు. మన పూర్వీకులు మనకు మిగిల్చింది. దాన్ని కాపాడుకోలేకపోతే, మనిషి మనుగడకే అర్ధం లేదు. ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లకు పరిమితం కాకుండా ఇన్ని దశాబ్ధాలుగా ప్రదర్శింపబడిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేసుకుని, రాజకీయాల జోలికి పోకుండా మన వారసత్వ సంపదను (Ramappa Temple UNESCO Telangana) కాపాడుకోవాలి.