క్రికెట్ విషయానికొస్తే, వయసు చాలా ముఖ్యం. అత్యంత చిన్న వయసులో క్రికెట్ ఆడితే, అదో రికార్డు.. వయసు మీద పడ్డాక క్రికెట్ ఆటలో రాణిస్తే, అదీ రికార్డే. కానీ, తక్కువ వయసులో రాణించడం తేలిక. వయసు మీద పడ్డాక చాలా చాలాకష్టం. కానీ, తనకింకా 38 ఏళ్ళ వయసు మాత్రమేననీ, అవకాశం తనకు తప్పకుండా వస్తుందనీ అంటున్నాడు క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth Cricket Politics).
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదేళ్ళపాటు శ్రీశాంత్ క్రికెట్ ఆడలేకపోయాడు.. మైదానానికి దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆలోచన అయితే శ్రీశాంత్ ఎప్పుడో వదిలేసుకుని వుంటాడు.
కానీ, ఐపీఎల్ ఆశలు మాత్రం ఇంకా అతనికి అలాగే వున్నాయి. ఈ సీజన్ విషయానికస్తే, శ్రీశాంత్ షరామామూలుగానే నిరాశపడాల్సి వచ్చింది. అతన్ని ఎవరూ ఈసారి వేలం కోసం పరిగణనలోకి తీసుకోలేదు.
‘నేను పోరాట యోధుడ్ని.. నాకు నిరాశ వుండదు. చిన్నపాటి బాధ మాత్రం కలుగుతుంది. వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తాను. ఏమో, ఈ సీజన్ కూడా నన్ను అక్కున చేర్చుకుంటుందేమో.. అలాంటి అద్భుతం జరుగుతుందేమో..’ అని శ్రీశాంత్ (Sreesanth Cricket Politics) ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ కారణంగానే శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్ అవకాశాల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు శ్రీశాంత్ అంటే, క్రికెట్ అభిమానుల్లో ఆ క్రేజ్ వేరు. కానీ, ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అతనిపై వచ్చాయో.. ఆ తర్వాత సీన్ మారిపోయింది. కానీ, ఇప్పటికీ అతనికి అభిమానులున్నారు. అతని ఆటతీరుకు ఫిదా అయ్యేవాళ్ళున్నారు.
క్రికెట్ రాజకీయాలకు శ్రీశాంత్ (Sreesanth Cricket Politics) బలైపోయాడన్న భావన చాలామందిలో వుంది. అది నిజమేనా.? అంటే, ‘కాదు’ అని మాత్రం చెప్పలేం.