మెగా ఇంపాక్ట్ (Sye Raa Making) అంటే ఏంటో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.. ‘మెగా మేకింగ్..’ అంటూ. కొంచెం లేట్‌గా వచ్చినా, మెగాస్టార్ చిరంజీవి సృష్టించే ప్రభంజనం అలా ఇలా కాదు. ఓ రేంజ్‌లో ఉంటుంది. అన్ డిస్‌ప్యూటెడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అభిమానుల ముందుకొచ్చేందుకు సర్వ రంగులూ అద్దుకుంటోంది.
దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మెగా మూవీ త్వరలో విడుదల కాబోతోంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, ‘సైరా’ టీమ్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ‘సైరా’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మనం మర్చిపోయిన, మన రియల్ హీరో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని మనకి గుర్తు చేసేందుకు ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. మేకింగ్ వీడియో మీద ఓ పెద్ద రివ్యూ రాసేయొచ్చు. సినిమా కోసం పడ్డ కష్టం, మేకింగ్ వీడియోలోని ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది.
పదుల సంఖ్యలో నటీనటులు, కళ్లు చెదిరే యాక్షన్స్ సీక్వెన్స్, దద్దరిల్లిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఒకటేమిటీ అన్నీ అద్భుతమే. విజువల్స్ నభూతో న భవిష్యతి అనేలా ఉన్నాయి. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేయడంతో మొదలు పెట్టి, సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరుల పాత్రలను పరిచయం చేశారు. సురేందర్ రెడ్డి మేకింగ్ స్టయిల్.. ఈ మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. నిర్మాణపు విలువల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుందేమో.
చివరిలో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్ మేకింగ్ వీడియోని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ కనిపించడం మరో స్పెషల్ అట్రాక్షన్. షూటింగ్ స్పాట్‌లో అమితాబ్‌ని పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ విజువల్‌ని మేకింగ్ వీడియో కోసం వాడారు.
అన్నట్లు సినిమాలో మరో సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆ పాత్రలో నాగబాబు కుమార్తై నిహారిక, ప్రత్యర్ధిపై కత్తి దూస్తూ, వీర వనితలా కనిపించింది. హాలీవుడ్ స్థాయి సాంకేతిక హంగుల్ని ఈ సినిమాకి అద్దుతున్నారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. దానికి సంబంధించి కూడా మేకింగ్ వీడియోలో చిన్నపాటి ప్రస్థావన తీసుకొచ్చారు.
ఓవరాల్‌గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతం కాబోతున్న అద్భుతం ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Making) అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రికార్డులు మెగాస్టార్ చిరంజీవికి కొత్త కాదు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ‘ఖైదీ నెంబర్ 150’తో సత్తా చాటిన చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’తో ఇంకెలాంటి అద్భుతాలు చేయబోతున్నారో వేచి చూడాల్సిందే.
ఈ నెల 20న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ విడుదల కాబోతోంది.