బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మృతి కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇప్పటికే సీబీఐ ఆమెను కొద్ది రోజులుగా విచారిస్తూ వస్తోంది ఈ కేసు విషయమై. మరోపక్క, రియా చక్రవర్తికి మద్దతుగా (Vidya Balan Stands Support to Rhea Chakraborty) నిలిచింది ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్.
‘కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఓ వ్యక్తిని నేరస్తుడు లేదా నేరస్తురాలిగా చిత్రీకరించడం తగదు. రియా చక్రవర్తి ప్రస్తుతం మానసికంగా చాలా ఇబ్బంది పడుతోంది. ఆమెను వేధించడం మానెయ్యండి. విచారణ సరిగ్గా జరగనివ్వండి. విచారణపై మీ ఆరోపణల ప్రభావం వుంటుందని నేననుకోను. కానీ, ఒకవేళ రియా చక్రవర్తి ఎలాంటి తప్పూ చేయకపోతే, ఆమె పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి అత్యంత క్రూరమైనదని తేలుతుంది..’ అంటూ విద్యా బాలన్ (Vidya Balan Stands Support to Rhea Chakraborty) అభిప్రాయపడింది.
మరోపక్క, తెలుగమ్మాయ్ బిందు మాధవి కూడా ఈ విషయంలో రియా చక్రవర్తికి బాసటగా నిలిచింది. కొన్ని మీడియా సంస్థలు రియా చక్రవర్తిని నేరస్తురాలిగా చిత్రీకరించడం అస్సలేమాత్రం సబబుగా లేదని బిందు మాధవి ట్వీట్ చేసింది. ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అలాగే ‘జస్టిస్ ఫర్ రియా’ అంటూ తన ట్వీట్‌లో హ్యాష్ ట్యాగ్‌లను జత చేసింది బిందు మాధవి.
కాగా, టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా రియా విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన విషయం విదితమే. అయితే, సోషల్ మీడియాలో సుశాంత్ మద్దతుదారులు కొందరు, పనిగట్టుకుని రియాపై విమర్శలు చేస్తున్నారు. రియాని ఎవరన్నా సమర్థించినా వారిపై జుగుప్సాకరమైన భాష ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతానికి రియా చక్రవర్తి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమే. డ్రగ్స్ ఆరోపణలు కావొచ్చు, ఇతరత్రా ఆరోపణలు కావొచ్చు.. వీటిపై అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టిన దరిమిలా, ఇప్పుడే ఎలాంటి కంక్లూజన్స్ ఇచ్చేయడం అటు మీడియాకిగానీ, ఇటు సుశాంత్ అభిమానులకిగానీ తగదు.