Table of Contents
ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రం ‘నోటా’ ఫ్లాప్ అయిన విషయాన్ని అంగీకరించాడు. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పాడు. తమిళంలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొంటూ, నేషనల్ మీడియాలో సినిమాకి పాజిటివ్‌గా రివ్యూస్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాదు, సినిమా ఫ్లాపయినందుకు ఆనందపడేవారు ఇప్పుడే ఆనందపడాలంటూ చురకలంటించాడు. అదే విజయ్ దేవరకొండ ప్రత్యేకత.
అందుకే ‘రౌడీ’ అయ్యాడు
విజయ్ దేవరకొండ శైలి మొదటి నుంచీ చాలా భిన్నమైనది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో అతని ఆటిట్యూడ్ చాలామందికి షాక్ ఇచ్చింది. అయినాగానీ, విజయ్ దేవరకొండ తగ్గలేదు. ‘నా ఆటిట్యూడ్ ఇదే.. నన్ను నన్నుగానే ఇష్టపడేవారుంటారు.. వారితోనే నాకు పని..’ అన్నట్లుగా వ్యవహరించాడు. అలా ఆయనకి ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ ఫ్యాన్ బేస్‌ని ఉద్దేశించి విజయ్ దేవరకొండ ముద్దుగా ‘రౌడీస్’ అని పిలుస్తుంటాడు. తాను స్టార్ట్ చేసిన మర్చండైజ్ బ్రాండ్‌కి కూడా ‘రౌడీ’ అని పేరు పెట్టాడంటే, విజయ్ ఆటిట్యూడ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాపై ఎన్ని వివాదాలొచ్చిన లెక్క చేయలేదు.
‘నోటా’ రియల్ స్టేటస్ ఏంటి?
విజయ్ దేవరకొండ హీరోగా, ఆనంద్ శంకర్ (Anand Shankar) దర్శకత్వంలో తెలుగు – తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందినప్పటికీ ‘నోటా’ (NOTA Movie) సినిమా కేవలం తమిళ సినిమా అన్న భావన కలిగింది. తెలుగు హీరో అయిన విజయ్ దేవరకొండతో పూర్తి తమిళ ఫ్లేవర్ సినిమాని తెరకెక్కించడం ద్వారా ఆనంద్ శంకర్ ఏం చేయాలనుకున్నాడోగానీ, తెలుగులో పెద్ద డిజాస్టర్ విజయ్ దేవరకొండకి ఇచ్చేశాడు. దాంతో విజయ్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ డే టాక్ చాలా దారుణంగా వుండడంతో రెండో రోజే థియేటర్లలో ‘నోటా’ (NOTA Telugu) వెలవెలబోయింది. అయితే తమిళంలో మాత్రం కొంతమేర ‘నోటా’ ఫర్వాలేదన్పించింది. దానికి కారణం, అక్కడి రాజకీయాల్ని సినిమాలో పరోక్షంగా ప్రస్తావించడమే.
ఫ్లాపులతో కుంగిపోతే ఎలా?
హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా.. ఆటిట్యూడ్ మాత్రం మారదని ‘రౌడీస్’ (Rowdies) ని ఉద్దేశించి చేసిన ప్రకటనలో విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఇదీ ఫైటింగ్ స్పిరిట్ అంటే. విజయ్ (Vijay Deverakonda) ని ‘రౌడీస్’ ఎందుకు ఇష్టపడతారో ఈ మెసేజ్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ ఇలా మెసేజ్ పోస్ట్ చేశాడో లేదో, అలా అది వైరల్ అయిపోయింది. ‘నీ వెంటే మేముంటాం..’ అంటూ విజయ్‌కి అతని అభిమానులు భరోసా ఇచ్చారు. ఓ స్టార్ హీరోకి వున్నంత ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ సాధించడం చిన్న విషయం కాదు. నిజానికి, ‘నోటా’ హిట్టయి వుంటే, తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ప్రభంజనంగా విజయ్ దేవరకొండ ఈ పాటికి కితాబులు అందుకునేవాడే.
రాంగ్ టైమ్‌లో రైట్ మెసేజ్
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అభిమానుల్ని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ని తప్పుపట్టలేం. కానీ, ఫెయిల్యూర్ చూసి సంతోషపడుతున్నవారు ఇప్పుడే సంతోషపడండి.. అంటూ ఒకింత ‘అతి నమ్మకాన్ని’ ప్రదర్శించడం సబబుగా అన్పించడంలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ప్రతి శుక్రవారం స్టార్డమ్ లెక్కలు మారిపోతున్న రోజులివి. సినిమా హిట్టయితే ఇమేజ్ పెరిగిపోతుంది, ఫ్లాపయితే పడిపోతుంది. స్టార్ హీరోలే ఈ వాస్తవాన్ని తెలుసుకుని, అందుకు తగ్గట్టు తమను తాము మలచుకుంటున్నారు. విజయ్, ఒక్క సినిమా పరాజయంతోనే ఇంత అసహానికి గురైతే ఎలాగని అతనికి శ్రేయోభిలాషులైన కొందరు అభిమానులే సూచిస్తున్నప్పటికీ, ‘రౌడీస్’ మాత్రం అలాంటివారిపై ఎదురుదాడికి దిగుతున్నారు.