Table of Contents
లైంగిక వేధింపుల అంశం కొత్తదేమీ కాదు.. కొత్త కొత్తగా వెలుగు చూస్తోందంతే. ఓ హాలీవుడ్ నటి, తన సినీ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల పరంపర గురించి ప్రకటించాక, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ‘మీ టూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా గళం విప్పడం మొదలు పెట్టారు. ప్రధానంగా సినీ రంగం నుంచి పెద్దయెత్తున అందాల భామలు ఈ ‘మీ టూ’ పేరుతో వార్తల్లోకెక్కారు. వారిలో కొంతమంది సోషల్ మీడియాకే పరిమితమైతే, ఇంకొంతమంది రోడ్డు మీదకెక్కి రచ్చ చేశారు. ‘నేనేమీ పతివ్రతను కాదుగానీ..’ అంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ నటి ‘లైంగిక వేధింపుల’పై గళం విప్పిన తీరు అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఆ ఘటనతో ఆమెకు దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు!
ఏమిటీ లైంగిక వేధింపులు?
ఓరకంట చూస్తే లైంగిక వేధింపు.. చెయ్యి పట్టుకుంటే లైంగిక వేధింపు.. ‘లైంగిక వాంచ’తో పట్టుకోవడం, చూడటం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకే వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి, సినిమాల్లో హీరో – హీరోయిన్ గాఢంగా ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడాన్ని ఏమనాలి? అది వేరు. అది నటన మాత్రమే. అది కళాత్మక కోణం. నటీనటులిద్దరూ ఓ సన్నివేశం పట్ల అవగాహన పెంచుకుని, దర్శకుడి సూచన మేరకు చేసే ఆన్ స్క్రీన్ శృంగారంగా దాన్ని అభివర్ణిస్తారు. అదే హీరో, హీరోయిన్‌ని ఇతర సమయాల్లో తాకాలని చూసినా, ఆమె పట్ల లైంగిక వాంఛను వ్యక్తం చేసినా ఆ వ్యవహారాన్ని తేడాగా చూడాల్సి వుంటుంది.
సినీ పరిశ్రమలోనే లైంగిక వేధింపులున్నాయా?
సినీ పరిశ్రమలోనే లైంగిక వేధింపులున్నాయనడం సబబు కాదు. ఎందుకంటే, సినీ పరిశ్రమలోనూ లైంగిక వేధింపులున్నాయి. ఇతర రంగాల్లోనూ లైంగిక వేధింపుల గురించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. స్కూళ్ళు, ఆఫీసులు, ఆఖరికి చట్ట సభలు సైతం తమకు సురక్షితం కావని సాక్షాత్తూ ఓ మహిళా ప్రజా ప్రతినిథి గళం విప్పడాన్ని ప్రస్తావించుకోవాలిక్కడ. వ్యవస్థలో లైంగిక వేధింపులనేవి ఓ భాగంగా మారిపోయాయి. ‘అది మామూలే..’ అనేవారు ఎంతోమంది వున్నారు. అలాగని, దీన్ని అందరూ స్వాగతిస్తున్నారని అనుకోవడానికీ వీల్లేదు.
అరికట్టలేని జాడ్యమిది
లైంగిక వేధింపుల్ని నిరోదించడం అంత తేలిక కాదు. అలాగని అసాధ్యమైన వ్యవహారం కూడా కాదు. ఎప్పుడో పదేళ్ళ క్రితం తాను లైంగిక వేధింపులకు గురైనట్లు బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా, తన సహచర నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సినిమా కెరీర్ నుంచి పక్కకు తప్పుకున్నాక ఈ ఆరోపణలు చేస్తున్న తనూశ్రీ, అప్పుడే గళం గట్టిగా విప్పి వుంటే ఆ లైంగిక వేధింపుల వ్యవహారానికి అప్పుడే ముగింపు పడేదేమో. అసలు ఈ కేసులో నానా పటేకర్ దోషి అని చెప్పేయడానికీ వీల్లేదు. శ్రీరెడ్డి సైతం, తాను లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని మొదట్లోనే చెప్పలేకపోయింది. ఇప్పుడు యాగీ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అనే ప్రశ్న రావడం సహజమే కదా.
సమస్య మూలాల్లోంచి కనుగొని, పెకెళించేయాలి
సినిమాల్లో అవకాశాలు.. ఉద్యోగాల్లో ప్రమోషన్లు.. ఏ రంగంలో అయినా ‘అవకాశం’ కోసం ‘సమర్పించుకోక తప్పదు’ అనే భావన నుంచి మహిళా లోకానికి విముక్తి కలగాలి. అలా జరగాలంటే, కింది స్థాయి నుంచి మార్పు రావాల్సి వుంటుంది. చట్టాలు లేక కాదు, ఆ చట్టాలను అనుసరించి నేరస్తులకు శిక్ష పడకపోవడంతోనే సమస్య తీవ్రత పెరుగుతోంది. మానసిక నిపుణులు చెబుతున్నదాన్నిబట్టి, లైంగిక వేధింపులకు గురైనవారు.. అది బయటపెడితే సమాజంలో తమ భవిష్యత్తు ఎలా వుంటుందోనన్న ఆందోళనతోనే వాటిని బయటపెట్టడంలేదని చెబుతుంటారు. ఇదీ కొంత నిజమే. అయితే, ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సామాజిక మాధ్యమాలు చాలా యాక్టివ్‌గా వున్నాయి. మహిళలు మరింత బలం పుంజుకున్నారు కూడా!
లైంగిక వేధింపులు మగాళ్ళకి కూడానట
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు మహిళలకే కాదు, బాధితుల్లో పురుషులు కూడా వున్నారని బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిలో రాధికా ఆప్టే కూడా లైంగిక వేధింపుల బాధితురాలే కావడం గమనార్హం. స్వలింగ సంపర్కం పాపులర్ అవడంతో, మగాళ్ళు సైతం ఇప్పుడు లైంగిక వేధింపుల్ని ఎదుర్కోక తప్పడంలేదు. చిత్రంగా సినీ పరిశ్రమలో కొందరు మహిళలు, సాటి మహిళల్ని లైంగిక వేధింపులకు గురిచేస్తుండడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ఇవి సినీ పరిశ్రమకే కాదు, అన్ని రంగాలకూ వర్తిస్తాయి. జాడ్యం పెరిగిపోయింది.. దాన్ని రూపమాపడం అంత తేలిక కాదు, అలాగని అసాధ్యమూ కాదు.!