చరిత్ర ఆ హీరోని మర్చిపోయింది. ఆ చరిత్రని (Sye Raa Teaser Mega History) ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంకో హీరో నడుం బిగించాడు. నిజమే, తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర 10, 12 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో నానుతూనే వచ్చింది. పరుచూరి బ్రదర్స్ ఈ జీవిత చరిత్రపై చాలా కసరత్తులు చేశారు.
చిరంజీవి మాత్రమే ఈ చరిత్రకు సరైన హీరో అని భావించారు. వినాయక్ దర్శకత్వంలో రూపొందాల్సింది.. సురేందర్ రెడ్డి చేతుల్లోకి వచ్చింది. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మించడానికి చాలా నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి.
అయితే, డబ్బుల కోసం కాకుండా, ఓ గొప్ప చరిత్రని తెలుగు ప్రజల ముందుకు తీసుకు రావాలన్న సదుద్దేశ్యంతో లాభాపేక్ష లేకుండా, నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా బాధ్యతల్ని తీసుకున్నాడు. చిరంజీవి మార్కెట్ వేల్యూ ఎంత.? అని ఆలోచిస్తే, రామ్ చరణ్ ‘ఖైదీ నెంబర్ 150’ చేసి ఉండడు.
ఈ ‘సైరా నరసింహారెడ్డి’ అసలే తెరకెక్కేది కాదు. దాదాపు 300 కోట్ల దాకా ఈ సినిమా కోసం ఖర్చయ్యిందన్నది ఓ అంచనా. చిరంజీవి వయసుకీ, ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌కీ పోల్చి చూస్తే ఎవ్వరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది.
అక్కడే గూస్‌బంప్స్ వచ్చేశాయి. ఇక అక్కడి నుండీ టీజర్ ఎండ్ అయ్యే వరకూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోతాం. ఆ తర్వాత కూడా చాలా సేపు టీజర్‌లోని విజువల్స్ వెంటాడతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మన చుట్టూనే గిర గిరా తిరుగుతోంది. చిరంజీవి ఏంటీ.? ఈ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ చేయడమేంటీ.? ఎలా సాధ్యమైందిది.? అని ఆశ్చర్యపోకుండా ఉండలేం.
‘చాలా ఖర్చయ్యింది.. నాన్నగారితో ఓ మంచి సినిమా చేయాలన్న ఉద్దేశ్యం, చరిత్రను ప్రజల ముందుంచాలన్న ఆలోచన తప్ప, డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. లాభ, నష్టాల లెక్కలేసుకోలేదు..’ అని రామ్ చరణ్ చెప్పిన మాటలు అక్షర సత్యం అనిపించాయి టీజర్ చూస్తే.
‘చరిత్ర మనల్ని మర్చిపోయినా ఆ చరిత్ర మాత్రం మనతోనే మొదలవ్వాలి..’ అని ‘సైరా నరసింహారెడ్డి’ రగిల్చిన స్పూర్తి ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగేలా చేస్తుంది. అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్.. ఇలా ఈ సినిమా కోసం చాలా మంది ప్రముఖ నటీనటులు కష్టపడ్డారు. ఆ కష్టమంతా త్వరలో వెండితెరపై చూడబోతున్నాం.
మళ్లీ మళ్లీ చెప్పుకోవల్సిన మాట ఇది కమర్షియల్ సినిమా కాదు. కేవలం ఇది సినిమా మాత్రమే కాదు. అంతకు మించి.. ఇది చరిత్ర (Sye Raa Teaser Mega History).. మనం మర్చిపోయిన ఓ మహనీయుడి అసలు కథ.. ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్ర. ‘సైరా నరసింహారెడ్డి.. సై సై రా.!