Home » తెలంగాణ ‘ప్యారడైజ్’.! సినిమాకి గులాబీ గ్లామరొచ్చిందహో.!

తెలంగాణ ‘ప్యారడైజ్’.! సినిమాకి గులాబీ గ్లామరొచ్చిందహో.!

by Mudra369 Editorial Desk
0 comments
The Paradise Telangana BRS

The Paradise Telangana Politics.. ప్రీమియర్స్ నుంచి వచ్చిన ‘నెగెటివ్ టాక్’ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ సినిమాకి మొదటి రోజు ఉదయం ఆటకే సరిగ్గా టిక్కెట్లు తెగే పరిస్థితి వుండకూడదు.

కానీ, ఆల్రెడీ వంద కోట్ల మార్క్ దాటేసింది ‘ది ప్యారడైజ్’ వసూళ్ళ పరంగా. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా, బ్రేక్ ఈవెన్‌కి దగ్గర పడుతున్నట్లే కనిపిస్తోంది.

డిజాస్టర్ టాక్ నుంచి, యావరేజ్.. ఎబౌ యావరేజ్.. హిట్.. ఇలా మారుతోంది పరిస్థితి. సగటు సినీ విశ్లేషకుడికి అందని విధంగా తయారైంది ‘ది ప్యారడైజ్’ వ్యవహారం.

‘ఇరుముడి’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో తెలుసు కదా.? ఓటీటీలో వచ్చాక, తీవ్ర విమర్శలు ‘ఇరుముడి’ మీద వినిపిస్తున్నాయి. ఇదో రకం కేస్ స్టడీ.!

ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమాని కూడా ఇంకో రకం కేస్ స్టడీలా చెప్పుకోవాలేమో. హీరో నాని చెప్పినట్లు, టాక్‌తో సంబంధం లేకుండా ‘ది ప్యారడైజ్’ సినిమాకి వసూళ్లు వస్తున్నాయి.

మంచి, చెడూ లేదు.. సౌండింగ్ మాత్రం, చాలా గట్టిగా వినిపిస్తోందంటూ నాని, నిన్న చెప్పిన మాట నిజం.! కాకపోతే, ఈ సౌండింగ్‌కి కారణమేంటి.?

The Paradise Telangana Politics.. తెలంగాణలో గులాబీ పొలిటికల్ ప్యారడైజ్..

ఔను, ‘ది ప్యారడైజ్’ సినిమాకి ‘గులాబీ గ్లామర్’ అద్దడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ‘ది ప్యారడైజ్’ సినిమాని ‘ఇది మా సినిమా’ అని ఫిక్సయిపోయాయి.

‘ఇది మా అస్తిత్వ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా’ అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అణచివేత నుంచే ఉద్యమం మొదలవుతుంది.. అంటూ నినదిస్తున్నారు.

నటుడు ప్రియదర్శి ఈ సినిమాలో చేసిన ‘ఎమ్మెల్యే శంకరన్న పాత్ర’, ఏకంగా కేసీయార్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది.

‘చావు నోట్లో తలకాయ పెట్టి అయినా సరే..’ అంటూ సినిమాలో ప్రియదర్శి చెప్పిన డైలాగ్, గతంలో కేసీయార్ చెప్పిందే.

‘ది ప్యారడైజ్’ కథకీ, తెలంగాణ ఉద్యమానికీ అసలు లింకే లేదు. కానీ, దీన్నీ దాన్నీ.. ఒకటిగానే చూస్తోందిప్పుడు గులాబీ దళం.

‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’.. పాటలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయ్ ప్రేక్షకులకి. ప్రత్యేకించి తెలంగాణ సినీ అభిమానులకి.

నెగెటివ్.. అనుకున్నదే పాజిటివ్..

ఇంకోపక్క, ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరం చూసిందో.. ఆ మితిమీరిన హింస.. రక్తపాతం.. మాస్ ఆడియన్స్‌కి బాగా ఎక్కేయడం గమనార్హం.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, ‘ది ప్యారడైజ్’ సినిమాని థియేటర్లో చూశారు. సినిమాకి వెళుతున్నట్లు ముందుగానే ట్వీటేశారు కూడా.

సినిమా చూశారు, సినిమా చూసొచ్చి తనదైన రివ్యూ కూడా కేటీయార్ ఇచ్చారు. దాంతో, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సినిమాని మరింతగా ‘ఓన్’ చేసుకుంటున్నాయి.

అన్నట్టు, సినిమాని థియేటర్లో చూసేందుకు అనుమతివ్వాలని సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరో నాని కోరినా, పర్మిషన్ ఇవ్వలేదు.

చిత్రంగా మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, తన అనుచరగణాన్ని వేసుకుని సినిమా చూసొచ్చారు.

ఎలాగైతేనేం, ‘ది ప్యారడైజ్’ సినిమా నష్టాల బారి నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. నష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, లాభాల బాట పట్టేలా వుంది.

ఒకప్పుడు, తెలుగు సినిమాలకు తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ నుంచి ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అదే గులాబీ పార్టీ, తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తోంది.

‘మా తెలంగాణ సినిమాకి ఆంధ్రోళ్ళు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు.. సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆంధ్రోళ్ళు ట్రోల్ చేస్తున్నారు..’ అనే వివాదం తీవ్రస్థాయికి చేరుకుందిప్పుడు.

ఏదైతేనేం, ‘ది ప్యారడైజ్’ టీమ్ మాత్రం, సినిమా సౌండింగ్‌ని ఎంజాయ్ చేస్తోంది బీభత్సంగా.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group