Couple Friendly Review.. దర్శకుడు శోభన్ (ప్రభాస్‌తో ‘వర్షం’ సినిమాని తెరకెక్కించాడు) పెద్ద కుమారుడు ‘సంతోష్ శోభన్’ గతంలో పలు సినిమాల్లో నటించాడు.
నటుడిగా మంచి పొటెన్షియాలిటీ వున్నోడు. కానీ, సరైన సక్సెస్ పడలేదు ఇప్పటిదాకా. ఆ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
థియేటర్లలో చూసేందుకు వీలు పడక, ఓటీటీలో విడుదలయ్యాక.. కాస్త తీరిక చూసుకుని ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాని చూడటం జరిగింది. మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్.
రాజీవ్ కనకాల ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించాడు. తమిళ కమెడియన్ యోగిబాబు మరో కీలక పాత్రలో కనిపించాడు.
Couple Friendly Review.. కథా కమామిషు ఏంటంటే..
ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది హీరోకి. ఇంటీరియర్ డిజైనర్ అవుదామనుకుంటాడు.. కానీ, అవకాశాలే రావు. దాంతో, చెన్నయ్ వెళ్ళిపోయి, బైక్ పూలింగ్.. అంటూ, ఉపాధి వెతుక్కుంటాడు.
అక్కడే, హీరోయిన్ పరిచయమవుతుంది హీరో గారికి. హీరో కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ అని కనిపెట్టిన హీరోయిన్, హీరోకి సాయపడుతుంది.
ఇద్దరూ కలిసి తొలి ప్రాజెక్ట్.. చిన్నదే అయినా, విజయవంతం చేస్తారు. నెమ్మదిగా, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఇంతలోనే, అనుకోని సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య ఏంటి.? అన్నది మిగతా కథ.
నటీనటులు ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తెరపై పాత్రలు తప్ప, ఆ పాత్రల్లో నటించిన నటీనటులు గుర్తుకురారు సినిమా చూస్తున్నంతసేపూ.
ఇటు సంతోష్ శోభన్.. అటు మానస వారణాసి.. ఇద్దరూ కళ్ళతోనే బోల్డన్ని భావాలు పలికించేశారు. నటన పరంగా ఎవరికీ వంకలు పెట్టడానికేమీ లేదు.
తమిళ కమెడియన్ యోగిబాబు ఓ కీలక పాత్రలో కనిపించాడు. కాస్తంత కామెడీ పండిస్తూనే, బలమైన పాత్రలో తనదైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు.
ప్రతి డైలాగ్ స్పష్టంగా వినిపించింది.. అర్థవంతంగా రాశారు, అంతే అర్థవంతంగా నటీనటులూ పలికించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ బావున్నాయి.
లీడ్ పెయిర్‌కి తోడు, మిగతా నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోవడం గమనార్హం. అందరి నుంచీ దర్శకుడు తనక్కావాల్సింది రాబట్టుకున్నాడు.
నిర్మాణపు విలువల పరంగా చూస్తే, సినిమాకి ఎంత అవసరమో అంత ఖర్చు చేశారు.. చాలా పద్ధతిగా సినిమాని పూర్తి చేశారనిపిస్తుంది.
సినిమాటోగ్రఫీ చాలా నీట్‌గా వుంది. ఎడిటింగ్ కూడా బావుంది. కాకపోతే, లిప్ లాక్ సీన్స్ అవసరమా.? అనిపిస్తుంది. క్లీన్ సినిమా అయితే, ఇంకా బావుండేదేమో.
కాకపోతే, ఆ ‘చిలిపితనం’ వల్లనే, యూత్ ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారనేదీ కాదనలేని వాస్తవం.
ఓవరాల్‌గా చూస్తే, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో, కపుల్ ఫ్రెండ్లీ ఒకింత డిఫరెంట్ ఫిలిం. చిత్తూరు, నెల్లూరు యాసల్లో నటీనటుల డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.
అక్కడక్కడా తమిళ డైలాగులు వినిపించాయి. కథ ఎక్కువ భాగం చెన్నయ్‌లో జరుగుతుంది గనుక.. ఆ నేటివిటీకి తగ్గట్టుగా తమిళ డైలాగులు పెట్టి వుంటారేమో.
