Home » ‘పెద్ది’ సమీక్ష: ఇంత గొప్ప ఆటగాడిని మళ్ళీ చూడగలమా ఏంటీ.?

‘పెద్ది’ సమీక్ష: ఇంత గొప్ప ఆటగాడిని మళ్ళీ చూడగలమా ఏంటీ.?

by hellomudra
0 comments
Peddi Ram Charan Review

Peddi Review.. ‘పెద్ది’ అనే టైటిల్ ఏంటసలు.? ఇదేం పేరు.? చాలామంది ‘పెద్ది’ సినిమా టైటిల్ గురించి చేసిన కామెంట్ ఇది.!

గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే విలక్షణ దర్శకుడనిపించుకున్న బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పెద్ది’.

సినిమా విడుదలకు ముందు, సహజంగానే ‘పెద్ది’ పెద్దయెత్తున నెగెటివిటీని ఎదుర్కొంది. నానా రకాల విమర్శలూ, షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కి గాయాలవడం.. ఇదంతా ఓ పెద్ద కథ.

ఎలాగైతేనేం, థియేటర్లలోకి వచ్చేసింది సినిమా. నిజానికి, ‘పెద్ది’ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ దగ్గర్నుంచి, ప్రతీ కంటెంట్.. అంతకు మించిన ‘హైప్’ని క్రియేట్ చేసింది సినిమా మీద.

ఇంతకీ, ‘పెద్ది’ కథా కమామిషు ఏంటి.? ‘పెద్ది’ పాత్రలో రామ్ చరణ్ ఎంతలా ఒదిగిపోయాడు.? సెకెండ్ సినిమా సెంటిమెంట్‌ని దర్శకుడు బుచ్చిబాబు సన అధిగమించాడా.? లేదా.?

ఆట కూలీ కథ

ఈ ప్రశ్నలకు తెలియాలంటే, కథలోకి వెళ్ళిపోదాం. ఇదొక ఊరి కథ. విజయనగరం జిల్లాలో ఓ చిన్న ఊరికి చెందిన ఓ ఆటగాడి కథ. ఆటగాడు అంటే, నిజానికి అతనొక ‘ఆట కూలీ’.

ఆ ఊరికి అసలు పేరుండదు, గుర్తింపు కూడా వుండదు. ఊళ్ళో జనాల్ని ఇతర ఊళ్ళకు చెందినవాళ్ళు అసలు లెక్కే చేయరు. సెకెండ్ గ్రేడ్ సిటిజన్స్‌లా చూస్తారు.

ఊరి మీదుగా ఓ రైల్వే లైన్ వుంటుంది. కానీ, రైల్వే స్టేషన్ వుండదు. ఏ సౌకర్యాలూ వుండవు ఆ ఊరిలో. ఆ రైలు పట్టాలకీ, కథకీ బలమైన సంబంధం వుంటుంది.

Peddi Ram Charan
Peddi Ram Charan

అలాంటి ఊరికి చెందిన ఆట కూలీని, తమ అవసరాల కోసం ‘వేలం పాట ద్వారా’ తీసుకుంటుంటారు రెండు ఊళ్ళకు చెందినవాళ్ళు.

క్రికెట్‌లో ‘పెద్ది’ సత్తా అలాంటిది. కానీ, ఎన్నాళ్ళిలా.? ఊరి కోసం ఏదన్నా చెయ్యాలి.? ఊరికి గుర్తింపు తీసుకురావాలి.? ఇదే తపనతో వున్న అప్పల సూరి, ‘పెద్ది’ కథని మలుపు తిప్పుతాడు.

అసలంటూ క్రికెటర్ ఆటగాడు అయిన ‘పెద్ది’ కుస్తీ పోటీల్లోకి వెళ్ళాడు.? ఈ క్రాస్ ఓవర్ అథ్లెట్ ట్యాగ్ ఏంటి.? ఇవన్నీ తెలియాలంటే, వెండితెరపై సినిమా చూడాల్సిందే.

Peddi Review.. ‘పెద్ది’.. చాలా పెద్ద సినిమా..

దర్శకుడు కథ రాసుకున్నప్పుడు, ఆట కంటే ఆటగాడు గొప్ప.. అనే పాయింట్ ఎత్తుకున్నాడు. ఇది నిజంగానే చాలా పెద్ద సాహసం. రాసే దర్శకుడికే కాదు, ఒప్పుకున్న నటుడికి కూడా.

క్రికెట్‌లో ప్రావీణ్యం సంపాదించాలి, క్రాస్ ఓవర్ అథ్లెట్ కాబట్టి.. ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలి. అందుకు తగ్గట్టుగా శరీరాన్ని మలచుకోవాలి.

అబ్బే, నటన మాత్రమే కదా.. అనుకుంటే సరిపోదు. ఆ పాత్రలో జీవించాలి. ఆట కంటే గొప్పవాడైన ఆటగాడి పాత్రలో జీవించాలంటే, శరీరాన్ని కష్టపెట్టక తప్పదు.

Peddi Ramcharan Janhvi
Peddi Ramcharan Janhvi

ఇక్కడే, దర్శకుడు బుచ్చిబాబుకి రామ్ చరణ్ రూపంలో నిఖార్సయిన కథానాయకుడు దొరికాడు. రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టమంతా ఆల్రెడీ ప్రోమోస్‌లో కనిపించేసింది.

తెరపై, అంతకు మించిన కష్టాన్ని రామ్ చరణ్ చూపించాడు. బిగ్ స్క్రీన్ మీద, రామ్ చరణ్ బీస్ట్‌లా కనిపిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ ‘న భూతో న భవిష్యతి’ అనిపిస్తాడు.

ఎమోషనల్ సీన్స్‌లోనూ నటుడిగా రామ్ చరణ్ ఇంకో మెట్టు పైకెక్కేశాడు. విమర్శకుల ప్రశంసలు, అవార్డులు, రివార్డులు.. ఇవన్నీ రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రకి అభిషేకం చేస్తాయనడం నిస్సందేహం.

చరణ్ నటనా ప్రతిభకి అక్షరాలు సరిపోవేమో..

చెప్పుకుంటూ పోతే, ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి పేజీలకు పేజీలు రాసేసినా తక్కువే అవుతుందేమో.

హీరోయిన్ జాన్వీ కపూర్, కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుంది సినిమాలో. కానీ, ఈ తరహా సినిమాలకి ఆ తరహా ‘పెప్’ వుండాల్సిందేనేమో.

ఓ సీన్‌లో జాన్వీ కపూర్, తన నటనతో ఆకట్టుకుంటుంది. అప్పటిదాకా, జాన్వీ కపూర్ పాత్రలోని గ్లామర్ మాత్రమే చూసినవారికి, ఆ సన్నివేశంతో, ఆమె మీదున్న అభిప్రాయం మారిపోతుంది.

అప్పల సూరి పాత్రలో జగపతిబాబు నెక్స్‌ట్ లెవల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. సీనియర్ నటుడిగా, తన అనుభవాన్నంతా రంగరించారాయన. బలమైన పాత్ర ఆయనకు రాశాడు దర్శకుడు.

కన్నడ నటుడు శివరాజ్ కుమార్, గౌర్నాయుడు పాత్రలో కనిపించారు. సింప్లీ సూపర్బ్ అనిపిస్తుంది గౌర్నాయుడు పాత్ర.

మిగతా పాత్రలన్నీ, కథా గమనంలో ‘మమ’ అనిపిస్తాయి. స్క్రీన్ అంతా ‘పెద్ది’నే కనిపిస్తోంటే, ఇతర పాత్రల గురించి, ప్రేక్షకుడు పట్టించుకునే పరిస్థితే వుండదన్నది నిర్వివాదాంశం.

రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రతీ యాంగిల్ అద్భుతం. చాలా సీన్స్‌లో సినిమాటోగ్రఫీ ‘ఔరా’ అనిపిస్తుంది.

ఎడిటింగ్ బావుంది. అయితే, కొన్ని సీన్స్‌కి కత్తెర వేసే ఛాన్స్‌ని ఎడిటర్ వాడుకోలేదేమో. ఇంకాస్త నిడివి తగ్గించడానికి సమర్థవంతంగా ‘ఎడిటింగ్’ ఉపయోగపడి వుంటే బావుండేది.

అదే సమయంలో, కొన్ని సీన్స్‌లో ఎడిటింగ్, ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. రైల్వే ట్రాక్ ఎపిసోడ్‌లో ‘వావ్’ అనిపించకమానదు ఎడిటింగ్.

ప్రాణం పెట్టేసిన రెహమాన్..

సంగీతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, పాటల వరకు రెహ్మాన్ ప్రాణం పెట్టేశాడని, ఆల్రెడీ మనకి తెలుసు కదా.! స్క్రీన్ మీద పాటలు ఇంకా అందంగా కుదిరాయి.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆయా సన్నివేశాలు సినిమాకి ప్రాణం. అలా ప్రాణం పోయడంలో, ప్రాణం పెట్టేశాడు మ్యూజిక్ మాంత్రికుడు రెహమాన్.

Also Read: ‘పెద్ది’లో జగపతిబాబు: ‘అప్పలసూరి’కి అవార్డులు ఖాయమైపోయాయ్!

నిర్మాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకట సతీష్ కిలారు, సినిమా కోసం అవసరమైనంత మాత్రమే కాదు, అవసరానికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడలేదు.

ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఎంత ఖర్చు చేసినా సరే, పైసా వసూల్.. అనిపిస్తుంది సినిమా చూసిన ప్రేక్షకుడికి. చాలా అరుదుగా ఎక్స్‌పీరియన్స్ అయ్యే అంశమిది.

Peddi Review.. ఆట కంటే గొప్పోడు ఈ ఆటగాడు..

ముందే చెప్పుకున్నట్లు, ఆట కంటే ఆటగాడు గొప్పోడనిపించేలా కథ రాసుకోవడం గొప్పేమీ కాదు. కథానాయకుడి పాత్రను అంత బలంగా తీర్చిదిద్దడం గొప్ప.

ఆ కథానాయకుడు, దర్శకుడిచ్చిన పాత్రలో ఒదిగిపోయేందుకు కష్టపడటం ఇంకా గొప్ప. నటుడిగా రామ్ చరణ్ వేరే లెవల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. చాలా ఏళ్ళ గుర్తుండిపోతాడు సినీ అభిమానులకి ‘పెద్ది’.

ఒకట్రెండు డైలాగులు ఓవర్ ది బోర్డ్ వెళ్ళినా, జాన్వీ కపూర్ గ్లామర్ ఒకింత ‘అతి’ అనిపించినా, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది.

యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రం ‘పెద్ది’.! ఓ మంచి కథని, కమర్షియల్ అంశాలు జోడించి చెప్పే క్రమంలో, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలన్న దర్శకుడి తపనకి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.

ముద్ర 369 బాటమ్ లైన్: మళ్ళీ చూస్తామా ఏంటి ఇంత గొప్ప సినిమాని.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group