Break Fast Movie Review.. ఓ యువ జంట, విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. విడాకుల వ్యవహారంలో, ఆ జంట ‘కౌన్సిలింగ్’ కోసం వెళుతుంది.
కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో, ఓ కథ చెబుతుంది ఈ జంటకి ఆ కౌన్సిలర్. ఆ కథలో మళ్ళీ ఇంకో జంట. ఆ జంట కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది.
ఆ కథకీ, ఈ జంటకీ లింకేంటి.? కథ చెప్పిన కౌన్సిలర్‌కీ ఆ కథకీ సంబంధమేంటి.? ప్రేమ, పెళ్ళి, విడాకులు.. వీటి చుట్టూ చాలా సినిమాల్ని చూశాం.
మరి, ‘బ్రేక్ ఫాస్ట్’ కథేంటి.? మామూలుగా అయితే, బ్రేక్ ఫాస్ట్ అంటే అల్పాహారం. ఈ ‘బ్రేక్ ఫాస్ట్’ అంటే, వేగంగా విడిపోవడం.. అని ట్రూ ట్రాన్సిలేషన్ చేసుకోవాల్సిందేనా.?
ముందే చెప్పుకున్నట్లు, ఇలాంటి కథలు చాలానే చూశాం. చాలా ఏళ్ళుగా చూస్తూనే వున్నాం.. ఇకపైనా చూస్తాం. కొన్ని ఎమోషనల్‌గా టచ్ చేస్తాయి, కొన్ని చిరాకు తెప్పిస్తాయి.
Break Fast Movie Review.. ఈ బ్రేక్ ఫాస్ట్‌లో అసలేముంది.?
ఈ ‘బ్రేక్ ఫాస్ట్’ విషయానికొస్తే, రెండు క్యూట్ జంటలు కనిపిస్తుంటాయి.. రెండు కాలాల్లో నడుస్తుంటాయి ఈ కథలు. ఆ గ్యాప్ మనకి పెద్దగా కనిపించదనుకోండి.. అది వేరే సంగతి.
ఓ పేదింటి కుర్రాడు.. ఓ పెద్దింటి అమ్మాయి.. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, కుటుంబాలు ఒప్పుకోకపోవడం.. ఇవన్నీ మామూలే. ఇందులో కొత్తదనం ఏంటంటే, పైశాచికానందం.
తండ్రి, తన కూతుర్ని చితక్కొట్టేస్తాడు. భర్త, తన భార్యని చావగొడ్తాడు. ఆద్యంతం ఒకర్నొకరు అర్థం పర్థం లేకుండా హింసించేసుకోవడమే ఈ ‘బ్రేక్ ఫాస్ట్’ ప్రత్యేకత.
ఊరికే, ఆవేశంతో ఊగిపోతుంటారు నటీనటులంతా. ఆ ఆవేశకావేశాల చుట్టూనే కథ రాసుకున్నాడేమో దర్శకుడు. ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తుంటాయి పాత్రలు.

ఎందుకు.? ఏంటి.? అనేది ప్రేక్షకులకి అర్థమవ్వాలన్న కనీసపాటి ఇంగితాన్ని దర్శకుడు పాటించలేదు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యని చావగొట్టే భర్త.. ఆ భర్తని వేయించుకునే తినే భార్య.
నటీనటులంతా ఎవరికి వారు ‘బాగా చేసెయ్యాలి’ అనే కసితో, అడ్డదిడ్డంగా అరుచుకుంటూ, ప్రేమించుకుంటూ, పోట్లాడుకుంటూ ఏదేదో చేసేశారు.
సంపత్ రాజ్ ఒక్కడే మనకి తెలిసిన నటుడు. మిగతావాళ్ళంతా అస్సలేమాత్రం పరిచయం లేనివారే. ఎక్కడా ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ అవవు సినిమా చూసే ప్రేక్షకుడికి.
సినిమా మొత్తం పూర్తయ్యాక, ఎవరు బాధితురాలో, ఎవరు బాధితుడో అర్థం కాదు సినిమా చూసే ప్రేక్షకుడికి.
కౌన్సిలర్ పొట్ట మీద సిజేరియన్ తాలూకు గాటు కనిపించేసరికి, ఆమె తన తల్లి.. అని ఫిక్సయిపోతుంది కూతురు. ఇంతకన్నా వరస్ట్ సీన్ ఇంకోటి వుండదేమో.
సినిమాని మాత్రం రిచ్‌గా తీసేందుకే ప్రయత్నించారు. పాటల్నీ బాగానే చిత్రీకరించారు.. కాకపోతే, పాత తెలుగు సినిమాల్లోని లిరిక్స్‌లా అనిపిస్తాయి. డబ్బింగ్ సినిమా కదా, అదేమంత పెద్ద తప్పిదం కాదు.
నేటి యువత కోసం తీసిన సినిమానా.? సభ్య సమాజానికి ఏం సందేశమిద్దామని సినిమా తీసినట్టు.? ఓటీటీలోకి వచ్చింది కాబట్టి, టైమ్ పాస్ కోసం చూసెయ్యొచ్చు.
సినిమా చూశాక, హాయిగా తిట్టుకోవచ్చు. దర్శకుడు ఏదో పెయిన్ అనుభవించాడు.. లేదంటే, ఇంత పైశాచికత్వంతో క్యారెక్టర్లను డిజైన్ చేసి వుండేవాడు కాదు.
