Jagan Sharmila Saitan Sakshi.. తన కుమార్తె వివాహ వేడుకకి కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించే క్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా బిజీగా వున్నారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసి శుభలేఖను స్వయంగా అందించి, వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా కోరారు.
సరే, చంద్రబాబు ఈ వివాహ వేడుకకి హాజరవుతారా.? లేదా.? అన్నది వేరే చర్చ.! పెళ్ళి వేడుక కాబట్టి, రాజకీయాలకతీతంగా ఆహ్వానాలు వెళుతుంటాయి. ఇదొక పద్ధతి.
సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆస్తుల పంపకాల విషయమై విభేదాలున్నా, రాజకీయ పరమైన విభేదాలున్నా, ఆయనకీ శుభలేఖ అందించనున్నారు షర్మిల.
ఈ విషయమై షర్మిల ఇప్పటికే స్పష్టతనిచ్చారు కూడా. సరే, షర్మిల కుమార్తె అంజలి వివాహ వేడుకని బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌లో నిర్వహించాల్సి వున్నా, జగన్ అనుమతి నిరాకరించడంతో, వేదిక మారింది. అది వేచే చర్చ.
Jagan Sharmila Saitan Sakshi.. జగన్‌కి నచ్చలేదా.? సాక్షికి నచ్చలేదా.?
కాగా, చంద్రబాబుని షర్మిల కలిసి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడం సాక్షి మీడియాకి అస్సలు నచ్చలేదు. వైసీపీ నేతలు, కార్యకర్తల సంగతి సరే సరి.!
వైఎస్ షర్మిలని సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు తూలనాడుతూనే వున్నారు. చిత్రంగా, సాక్షి మీడియా షర్మిలకి వ్యతిరేకంగా ఓ వార్తా కథనాన్నే ప్రచురించింది.. చంద్రబాబుకి ఆహ్వాన పత్రిక ఇవ్వడంపై.
‘చంద్రబాబుతో చెట్టాపట్టాల్’ అంటూ షర్మిలపై సాక్షిలో రాసిన కథనం, షర్మిలకు ఆగ్రహం తెప్పించింది. ‘అక్రమ సంబంధాలు అంటగడతారా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారామె.
‘‘జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు’’
‘‘అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు..’’ ఇదీ షర్మిల స్పందన.
అంతే కాదు, ‘ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?’ అంటూ షర్మిల ప్రశ్నించడం గమనార్హం.
‘‘వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు?’’
‘‘ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
‘‘ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.’’ అంటూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా ట్వీటేశారు షర్మిల.
సాక్షి వార్తా కథనంపై వైఎస్ షర్మిల పరువు నష్టం దావా వేసే ఆలోచనలో వున్నారా.? అన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో, జగన్ సోదరి షర్మిలకి వ్యతిరేకంగా జుగుప్సాకరమైన వార్తా కథనం రావడం శోచనీయం.!
ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వివరణ ఇవ్వడం మంచిది.!