Hrudhayam Murali Review Idhayam.. హీరోగారి పేరేమో మురళి.! ఇదయం మురళి.. అదేనండీ, తమిళ ఇదయం కాస్తా, తెలుగు హృదయం కాబట్టి, సినిమా పేరు ‘హృదయం మురళి’ అయ్యింది.
థియేటర్లలో సందడి చేసి, ఓటీటీలోకి కూడా వచ్చేశాడు ‘హృదయం మురళి’.! ఇంతకీ, ఈ మురళి హృదయ గాధ ఏంటి.? అంటే, గాధ కాదు.. గాధలు.. అనాలేమో.!
చిన్నప్పుడెప్పుడో పాఠాలు చెప్పిన టీచర్ని ప్రేమిస్తాడు మన హీరో.! ఏకంగా, ఆమె బిడ్డకు తండ్రయిపోతాడు. ఆగండాగండీ, ఇదేమీ అడల్ట్ కంటెంట్ కాదు.!
ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టేస్తారన్న పిచ్చి నమ్మకం వీడిది. ఆ ముద్దు ముచ్చట కాస్తా, టీచర్ గర్భం దాల్చి, ప్రసవ వేదన పడుతున్న సమయంలో, ఆమెను ఆసుపత్రికి చేర్చేలా చేస్తుంది.
ప్రసవం సమయంలో దరఖాస్తు మీద, భర్త.. అన్న స్థానంలో సంతకం చేసేస్తాడు మన హీరో మురళి.! అద్గదీ అసలు సంగతి.
Hrudhayam Murali Review Idhayam.. వీడు మామూలు ప్రేమికుడు కాదు..
ఆ తర్వాత టీచర్ మాయమైపోతుంది. స్కూలు నుంచి వ్యవహారం కాలేజీకి మారుతుంది. అక్కడో అమ్మాయిని ప్రేమిస్తాడు. కట్ చేస్తే, ఆ ప్రేమ కూడా అంతే సంగతులు.!
ఇంకా పై కాలేజీకి వెళ్ళాక, అక్కడో డాక్టరుతో ప్రేమలో పడతాడు మురళి. కానీ, ఏం లాభం.? ప్రేమిస్తున్న విషయాన్ని, ప్రేమికురాలితో చెప్పలేడు మన హీరో.
ఇక, ఇలా కాదని.. మేనమామ ఓ సంబంధం చూసి, పెళ్ళి చేసెయ్యడానికి సిద్ధపడతాడు. దాంతో, హీరో ఆ పెళ్ళి చేసుకోవడానికి వస్తాడు. ఇంతలోనే పెద్ద ట్విస్టు.! అదేంటన్నది తెరపై చూడాలంతే.
ఫహాద్ ఫాజిల్ వున్నాడు, ప్రీతి ముకుందన్ వుంది, కాయదు లోహార్ వుంది. మాళవిక మోహనన్ కూడా వుందండోయ్.! బోల్డంతమంది హీరోయిన్లు.. తెరపై కళకళ్ళాడారు.
అన్నట్టు, ప్రీతి ముకుందన్ ఇందులో డబుల్ రోల్.! అది ఈ సినిమాలోని కీలకమైన ట్విస్టుల్లో ఒకటి.! ఓటీటీలో వచ్చేసింది కదా, ట్విస్టులు దాయాల్సిన పనిలేదు.
కన్ఫ్యూజన్ ప్రేమికుడు మురళి..
చిన్నప్పటి ప్రేమతోనే మురళి కన్ఫ్యూజన్ ఏంటో అర్థమయిపోయింది కదా.! కానీ, సిన్సియర్గానే ప్రేమించేస్తాడు అందర్నీ.
సినిమా చూస్తున్నంతసేపూ మన జీవితంలో జరిగిన ఏదో ఒక రొమాంటిక్ సీన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
ఫన్ టోన్లో నడిచింది. కాస్తంత ఎమోషనల్ కంటెంట్ కూడా తక్కువ మోతాదులో దట్టించాడు దర్శకుడు. ఓవరాల్గా, ఇదొక పాసబుల్ ఎంటర్టైనర్.. అని చెప్పొచ్చు.
స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్క్ చేసి వుంటే, సినిమా వేగం పెరిగేది. అలా జరిగి వుంటే, సినిమాకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి వుండేదే.!
మురళి పాత్రలో అధర్వ మురళి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్లంతా ముద్దుగానే వున్నారు. బాగా చేశారు. ఫహాద్ ఫాజిల్ సినిమాకి సర్ప్రైజ్ ఎలిమెంట్.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. అన్నీ సినిమాకి బాగానే కుదిరాయి. క్రికెట్ మ్యాచ్ని మేడ మీద తిలకించే సమయంలో జరిగే ఓ యాక్షన్ ఎపిసోడ్, బాగా డిజైన్ చేశారు.
అన్నట్టు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాన్నాళ్ళ తర్వాత తెరపై కనిపించాడు.. లెంగ్తీ రోల్లో. తెలుగు డబ్బింగ్ తమన్ చెప్పుకుని వుంటే బావుండేదేమో.!
టైమ్ పాస్ కోసం ఓసారి ఈ ‘ఇదయం మురళి’ అదేనండీ, ‘హృదయం మురళి’ని ఎంచక్కా చూసెయ్యొచ్చు. పెద్దగా కంప్లయింట్స్ ఏమీ లేవు.!
– yeSBee
