Hushar Pittalu OTT Review.. చిన్న పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావమెలా వుంటుంది.? వాళ్ళ జీవితాలు ఎలా తారుమారైపోతాయ్.? ఈ కోణంలో చాలా సినిమాలు వచ్చాయ్.. వస్తూనే వున్నాయ్.!
స్కూల్ టాపర్ ఆ కుర్రాడు.. అతన్ని మోహిస్తుంది ఓ కుర్రది. కట్ చేస్తే, తెలిసీ తెలియని వయసులోనే శారీరకంగా ఒక్కటవుతారు. కుటుంబాల్ని ఎదిరించేస్తారు.
అంతేనా, తమకు పెళ్ళి చేసెయ్యమని ఏకంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కేస్తారు.! చిన్న పిల్లలకి పోలీస్ స్టేషన్లో పెళ్ళి జరిగిందా.? ఆ రెండు కుటుంబాల పరిస్థితేంటి.? ఇదంతా తెలియాలంటే, ‘హుషార్ పిట్టలు’ సినిమాని చూడాల్సిందే.
సినిమా ప్రోమోస్ చూశాక, థియేటర్లలో ఈ సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. అంత జుగుప్సాకరంగా డిజైన్ చేశారు ప్రమోషనల్ కంటెంట్‌ని.
‘హుషార్ పిట్టలు’ వచ్చింది, వెళ్ళిపోయింది థియేటర్ల నుంచి. తాజాగా, ఓటీటీలోకి దూసుకొచ్చింది ‘హుషార్ పిట్టలు’.! కాస్త తీరిక చూసుకుని, ‘హషార్ పిట్టలు’ తిలకించాల్సి వచ్చింది.
Hushar Pittalu OTT Review.. తల్లిదండ్రుల పడక గది వ్యవహారం..
తల్లిదండ్రుల ‘పడక గది’ వ్యవహారం పిల్లల కంట్లో పడకూడదు.! పడితే, ఏమవుతుందో, పిల్లలు ఎలా దారి తప్పేస్తారో హెచ్చరించే కథ ఇది.
ప్రమోషనల్ కంటెంట్ జుగుప్సాకరంగా డిజైన్ చేశారుగానీ, ఓటీటీలో సినిమా చూశాక.. ఇందులో వల్గారిటీ పెద్దగా ఏమీ కనిపించలేదు. ఏమో, వల్గర్ కంటెంట్‌ని ఓటీటీ వెర్షన్‌కి వచ్చేసరికి తొలగించారేమో.
బాగా చదువుకునే కుర్రాడిని, ఊళ్ళో పనీ పాటా లేని కుర్ర మంద చెడగొడుతుంది. పద్ధతిగా పెరిగిన అమ్మాయిని, బంధువుల అమ్మాయే చెడగొడుతుంది.
కథాగమనంలో హీరోయిన్, ఎందుకు పక్కదారి పట్టిందనే విషయం అర్థమవుతుంది. అప్పటిగాకా, ఆమె ‘కక్కుర్తి’ వ్యవహారాల్ని ఎవరైనా జీర్ణించుకోవడం కష్టమే.
హీరో మీదకి పదే పదే హీరోయిన్ ఎగబడిపోతున్న వైనం, చాలా చిరాకు తెప్పిస్తుంది. దర్శకుడు ఆ పాత్రని ఎందుకు అంత ‘లేకి’గా డిజైన్ చేశాడో, తర్వాత అర్థమవుతుంది.
పట్టుమని పదేళ్ళు కూడా లేని కుర్రకుంక..
పట్టుమని పదేళ్ళు కూడా లేని కుర్ర కుంక (హీరో తమ్ముడు), స్కూల్లో తోటి విద్యార్థి (ఆడపిల్ల) మీదకెక్కి.. ఏదో చేస్తున్నాడన్న విషయాన్ని స్కూల్ టీచర్, ఆ కుర్రగాడి తల్లికి చెప్పిన సీన్.. సింప్లీ సూపర్బ్.
ఆ తుంటరి కుర్రగాడికి బుద్ధి చెప్పే క్రమం కూడా బావుంది. తన అన్న ఘనకార్యాన్ని తండ్రికి ఆ చిచ్చరపిడుగు చెప్పే సన్నివేశం.. అదంతా దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడు.
కూతూరు చెయ్యిదాటిపోయిందని అర్థమయ్యాక తండ్రి పడే వేదన.. ఇవేవీ హద్దులు దాటలేదు. ముందే చెప్పా కదా, ఓటీటీ కంటెంట్ వరకూ ఎక్కడా పెద్దగా వల్గారిటీ లేదని.!
పోలీసులు అమ్మాయిని సంరక్షణ కోసం తరలిస్తే, అక్కడ ఆమెకు జ్ఞానోదయమవడం బానే వుంది. హీరో విషయాన్ని గాలికొదిలేశారేంటబ్బా.? అనిపిస్తుంది.
సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, హ్యాపీ ఎండింగ్ ఇచ్చెయ్యలేదు దర్శకుడు. హీరో హీరోయిన్ విడిపోవడం, బాగా చదువుకున్న కుర్రాడు చివర్లో గొర్రెలు కాసుకునే స్థాయికి దిగజారిపోవడం ఆలోచింపజేస్తుంది.
హీరోయిన్ కూడా, హీరో దీన స్థితిని చూసి బాధపడటం.. ఆ సన్నివేశాన్ని దర్శకుడు డిజైన్ చేసిన తీరుకి ప్రశంసలు దక్కుతాయి.
హీరో అన్ష్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ వాసవి గణేషన్ కూడా మంచి మార్కులు కొట్టేసింది. సినిమాకి ఎంత అవసరమో, అంత వరకు ఈ ఇద్దరి నుంచి దర్శకుడు రాబట్టుకున్నాడు నటన పరంగా.
సినిమాలో దాదాపు అన్ని పాత్రలూ చాలా బాగా డిజైన్ చేయబడ్డాయి. ఆయా పాత్రలు, సినిమా గమనంలో తమదైన ముద్ర వేశాయి. హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి, హీరో తమ్ముడు, హీరోయిన్‌కి బంధువైన ‘అక్క’.. ఇలా అందరూ చాలా బాగా చేశారు.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. సినిమాకి తగ్గట్టుగానే వున్నాయి. ఎడిటింగ్ ఓకే. సినిమాకి అవసరమైనమేర బాగానే ఖర్చు చేశారు. డైలాగ్స్ గురించి స్పెషల్‌గా ప్రస్తావించుకోవాలి. చాలా బాగా రాశారు డైలాగ్స్.
పిల్లలతో కలిసి చూడలేంగానీ.. ఓటీటీ ద్వారా ఇళ్ళల్లోకే ఈ సినిమా వచ్చేసింది కాబట్టి, పిల్లల్ని చూడకుండా ఆపలేం. సినిమాలో చూపించిన మంచి, పిల్లలకు అస్సలు ఎక్కదు. పక్కదారి పట్టించే కంటెంట్ మాత్రం వాళ్ళని ఆకట్టుకుంటుంది.
మంచి కంటే, చెడు పట్ల ఆకర్షణ ఆ వయసులో వుంటుంది కదా.!
సినిమాలో హీరోయిన్ బంధువు (అక్క) ఓ సన్నివేశంలో చెబుతుంది.. ‘మా అక్క ఇంకో వ్యక్తిని ప్రేమించడం వరకే నీకు తెలుసు.. అక్క లేచిపోయాక, ఆ బాధతో అమ్మ చనిపోవడం నీకు తెలియదా.? ఆ బాధ నీకు అర్థం కాదా.?’ అని.
‘హుషార్ పిట్టలు’ సినిమా చూసిన చాలామందికి (యువతకి) అర్థమవ్వాల్సిన విషయాలు అర్థం కావు. ఆకర్షణీయమైన అంశాలు మాత్రం, బాగా అలరిస్తాయ్.!
