Table of Contents
Dorothy Telugu Review.. సినిమా అంటే, అదొక బిజినెస్.! కళాత్మకమైన వ్యాపారం.! కథా వస్తువుగా దేన్ని ఎంచుకుంటే, ఎక్కువ సొమ్ములు చేసుకోవచ్చో.. ఆ కోణంలోనే ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు.
కొన్నిసార్లు, సామాజిక చైతన్యం కోసమూ సినిమాలు తెరకెక్కిస్తుంటారు. అయినా, అక్కడా ‘వ్యాపాత్మక ఆలోచనలు’ మామూలే.!
సామాజిక స్పృహ కలిగించే సినిమాలంటూ, సినీ జనాలు చేసే పబ్లిసిటీ స్టంట్లూ ఇందులో భాగమే. కానీ, కొన్నిసార్లు.. సమాజంపై కొన్ని విపరీత అంశాల్ని బలవంతంగా రుద్దేందుకు కూడా సినిమాలు తెరకెక్కుతుంటాయి.
‘ఎలజీబీటీ’ వ్యవహారం కూడా అంతే.! ఇటీవలి కాలంలో సినిమాల్లో దీన్ని బలవంతంగా జొప్పించడం అనేది చూస్తున్నాం. ఇదొక సక్సెస్ ఫార్ములా అయిపోయిందేమో.!
ఈ కోణంలో సినిమాలు వచ్చిపోతున్నాయ్.. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నా.. మళ్ళీ అదే కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయంటే అర్థమేంటి.?
అసలిక్కడ, మనం ఏ సినిమా గురించి చెప్పుకుంటున్నాం.? ఆ సినిమాలో కథాంశమేంటి.? ఆలస్యమెందుకు.. ‘డోరతీ’ అనే సినిమా కథలోకి వెళ్ళిపోదాం.
Dorothy Telugu Review.. కథేంటంటే..
థియేటర్లలో వచ్చేసింది.. ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోయింది.. సో, దాచిపెట్టడానికేమీ లేదు.! ఇద్దరు స్నేహితులు, అందులో ఒకడు పౌరుషమున్న మగాడిలా నటిస్తాడు.
ఆ పౌరుషమున్న మగాడిలా నటించే వ్యక్తి, తనలోని ఆడతానాన్ని చిన్నప్పుడే గుర్తిస్తాడుగానీ, స్నేహితుడికి ఆ విషయం చెప్పడు. స్నేహితురాలితో చెప్తాడు.
మరోపక్క, ఊర్లో పెద్దమనిషిగా చెలామణీ అయ్యే ఓ వ్యక్తి కుటుంబంలోకి ‘డోరతీ’ వస్తుంది కోడలిగా. అనూహ్యమైన రీతిలో ఆమె హత్యకు గురవుతుంది.
ఆ తర్వాత, మగాడిలా నటిస్తున్న వ్యక్తి.. తన గురించిన అసలు నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకీ, అతన్ని అతని స్నేహితుడు ఎలా డీల్ చేశాడన్నది మిగతా కథ.
నటీనటుల్లో మనకి తెలిసింది కీర్తి సురేష్ మాత్రమే. చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఆమెకి లభించింది. గెస్ట్ రోల్ అనుకోవచ్చు. సినిమా అంతా కనిపించేది సనంత్, రిషి కాంత్.
సుబ్బు పాత్రలో సనంత్ ఒదిగిపోయాడు. భావోద్వేగాల్ని బాగా పండించాడు. కార్తీ పాత్రలో రిషికాంత్ కూడా చాలా బాగా నటించాడు.
ఒకప్పటి స్నేహితుడే, స్నేహితురాలిగా మారిపోతే..
సుబ్బు అసలు స్నేహితుడు కాదు, స్నేహితురాలని తెలిశాక, కార్తీ ప్రదర్శించిన నటన చాలా బావుంటుంది. గెస్ట్ రోల్ లాంటిదని చెప్పుకున్నాం కదా.. కీర్తి సురేష్ తన పాత్రకు న్యాయం చేసింది.
మిగతా పాత్రలు చాలావరకు అరవ అతికి దగ్గరగా వున్నాయి. కానీ, నటన పరంగా చూస్తే, అందరూ బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవి సినిమాకి సహజత్వాన్ని ఇచ్చాయి.
నిర్మాణపు విలువలు బావున్నాయి. 90ల నాటి సెటప్‌ని బాగానే రీ-క్రియేట్ చేశారు. కొంత సాగతీత అనిపిస్తుంది.. ఎడిటింగ్ విభాగం, కాస్త కత్తెర బాగా వాడి వుండాల్సింది.
ఈ తరహా సినిమాల్లో వల్గారిటీకి స్కోప్ వుంటుందిగానీ.. ఆ అవకాశమేమీ పెద్దగా ఇవ్వలేదు. ఈ విషయంలో దర్శక నిర్మాతల్ని అభినందించి తీరాలి.
గత కొంతకాలంగా, సమాజంలో ఈ తరహా వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీన్నొక సామాజిక రుగ్మత.. అనేవారూ లేకపోలేదు.
న్యాయస్థానాల తీర్పులు, ఓ వర్గానికి అనుకూలంగా వుండడంతో.. ఆ వర్గం క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. కారణాలేవైతేనేం, లింగమార్పిడి.. అనేది విచ్చలవిడిగా జరుగుతోందిప్పుడు.
మత మార్పిడి.. లింగ మార్పిడి..
ఆ లింగమార్పిడికి ఈ తరహా సినిమాలు మరింత ఊతమిస్తాయి. మత మార్పిడి కంటే ప్రమాదకరంగా లింగమార్పిడి ఘటనలు పెరుగుతున్నాయన్న వాదనలు మామూలే.
కేవలం సినిమా, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, నటీనటుల నటనా ప్రతిభ, దర్శకుడి ప్రతిభ… ఇలా చూస్తే మాత్రం ‘డోరోతీ’ అకట్టుకుంటుంది.
మనం, జీర్ణించుకోలేని వాస్తవాలు.. కఠినంగానే వుంటాయన్న వాదన ఓ వైపు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు.. పాశ్చాత్య పెట్టుబడిదారులు, ఇలాంటివాటికి తెరవెనుకాల ఫండింగ్ చేస్తుంటారనే వాదన మరో వైపు.
ఇదో డిబేటబుల్ కాంటెక్స్‌ట్.! ఎవరి అభిప్రాయాలు వారివి. సినిమాని సినిమాగానే చూస్తే, ‘డోరోతీ’ ఓకే.! సామాజిక చైతన్యం.. అనే కోణంలో చూస్తే, ఖచ్చితంగా అట్నుంచి కౌంటర్ ఎటాక్ వాదనలూ సమర్థనీయమే.
సుబ్బు కాస్తా డోరోతీగా మారిపోయాక, కార్తీ తన చిన్నప్పటి స్నేహితుడు (డోరోతీ అలియాస్ సుబ్బు)తో ప్రేమలో పడటం, ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడటమనే క్లయిమాక్స్.. ఒకింత జుగుప్సాకరంగా అనిపిస్తే, అది మీ తప్పు కాదు.