Table of Contents
Medicines Challans Supreme Debate.. సర్వోన్నత న్యాయస్థానం ఓ వైపు మెడిసిన్స్ ధరలపైనా, ఇంకో వైపు ట్రాఫిక్స్ చలాన్స్ విషయంలోనూ స్పందించిన తీరు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందుల ధరలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తక్కువ ధరలో అందాల్సిన మెడిసిన్స్, అత్యంత ఎక్కువ ధరకు ఎలా విక్రయిస్తున్నారన్నది సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన ప్రశ్న.
రెండు వేల ఏడు వందల రూపాయలకీ, ఇరవై ఏడు వేల రూపాయలకీ.. అస్సలేమన్నా పొంతన వుందా.? అని కడిగి పారేసింది సర్వోన్నత న్యాయస్థానం.
మంచి విషయమే కదా ఇది.! రోగం వచ్చి మనిషి చనిపోవడం వేరు.. ఆ రోగానికి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల చనిపోవడం వేరు.!
పైగా, వాస్తవ ధరకు ఎన్నో రెట్లు ధర పెంచేసి, రోగుల్ని పీల్చి పిప్పి చేస్తోంది మెడికల్ మాఫియా. క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, గుండెకి అమర్చే స్టెంట్లు.. వీటి విషయంలో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు.
Medicines Challans Supreme Debate.. కోవిడ్ దోపిడీ..
కోవిడ్ సమయంలో, కొన్ని రకాలైన మందుల మీద మెడికల్ మాఫియా ఏ స్థాయిలో వందల కోట్లు, వేల కోట్లు వెనకేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, గుండె సమస్యకి వినియోగించే స్టెంట్లపై.. నిత్య దోపిడీ జరుగుతూనే వుంది. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో, మెడిసిన్స్ ధరలు అందుబాటులోకి వస్తాయా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇక, ట్రాఫిక్ చలాన్ల వ్యవహారానికి వస్తే, ట్రాఫిక్ చలాన్లను ఎలక్ట్రిసిటీ బిల్లులకు అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
దేశవ్యాప్తంగా 45 వేల కోట్ల రూపాయల ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి 20 వేల కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్‌లో వున్నాయట.
వాహనదారుల ఉల్లంఘన.. ప్రభుత్వానికి కాసుల పంట..
వామ్మో.. ఇంతలా ట్రాఫిక్ చలాన్ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తోందా.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.
వాహనదారుల నిబంధనల ఉల్లంఘన అంటే, ప్రభుత్వానికి కాసుల పంట అన్నమాట.! ఓ చిన్న రాష్ట్రం తాలూకు వార్షిక బడ్జెట్, ఈ నలభై ఐదు వేల కోట్ల రూపాయలంటే.
విద్యుత్ బిల్లుని చెల్లించకపోతే, కనెక్షన్ కట్ అయిపోతుంది గనుక, ఆ విద్యుత్ బిల్లుకి, ట్రాఫిక్ చలాన్ అనుసంధానం చేయాలన్నది సర్వోన్నత న్యాయస్థానం సూచన.
ఐడియా అదిరింది కదా.! ఇకపై, అత్యంత వేగంగా సామాన్యుల ముక్కు పిండి మరీ చలాన్ల సొమ్ముని వసూలు చేసేస్తుందేమో ట్రాఫిక్ విభాగం.
మందుల మాఫియాకి అడ్డుకట్ట ఎలా.?
మరి, మొదటి విషయం.. అదే, మెడిసిన్స్ ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.
మెడికల్ మాఫియా, ప్రభుత్వానికి మోకాలడ్డుతుంది. ఇదైతే పక్కా.! లాభాల్ని ఎవరి మాత్రం వదులుకుంటారు.? ఆ మాటకొస్తే, అక్రమ సంపాదన పోతుందంటే, మెడికల్ మాఫియా అస్సలు ఊరుకోదు.
వైద్య చికిత్స ముసుగులో నడుస్తున్న దోపిడీ జగమెరిగిన సత్యం.! చికిత్స పొందుతూ వ్యక్తి చనిపోతే, ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని, ఆసుపత్రులు, మృతుల బంధువుల్ని పీక్కు తినడం చూస్తున్నాం.
ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా, ప్రైవేటు ఆసుపత్రులపై.. అందునా కార్పొరేట్ ఆసుపత్రులపై ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవడం చూశామా.? ఛాన్సే లేదు.
– yeSBee
