Table of Contents
Ramayana Movie Review.. రెండే కథలున్నాయ్.. ఒకటి రామాయణం అయితే, ఇంకోటి మహాభారతం.. అంటుంటారు చాలామంది.!
ఆ రామాయణ, మహాభారతాల్లోని అనేక పాత్రలు, సన్నివేశాల చుట్టూనే వందలాది వేలాది సినిమాలు పుట్టుకొచ్చాయ్.. పుట్టుకొస్తూనే వున్నాయ్.
పూర్తిగా రామాయణాన్ని సినిమాగా తీయాలంటే, ఒక్క భాగం సరిపోదు.! ఎన్ని భాగాలు తీసినా సరిపోదు నిజానికి.! రామాయణం అంటే, అదొక జీవన విధానం.!
టీవీ సిరీస్ చూశాం.. చాలా సినిమాల్లోనూ రామాయణం చూశాం. ఎన్నిసార్లు చూసినా, రామాయణం అద్భుతంగానే వుంటుంది. కానీ, ‘ఆదిపురుష్’ లాంటి ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఇంతకీ, రణ్‌బీర్ కపూర్ – సాయి పల్లవి నటించిన ‘రామాయణ’ ఎలా వుంది.? రావణుడిగా యష్ ఎలా వున్నాడు.? శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ఎలా చేసింది.? తెలుసుకుందాం పదండిక..
Ramayana Movie Review.. కథేంటంటే..
అయినా, ‘రామాయణ’ గురించి మాట్లాడుతూ, కథేంటి.? అని ప్రశ్నించుకోవడమేంటి.? తెలిసిన కథే.! కాకపోతే, తొలి భాగంలో పూర్తిగా రావణుడి కోణంలో సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తుంది.
స్క్రీన్ స్పేస్ యష్ (రావణుడు)కి దర్శకుడు ఎందుకు ఇచ్చాడో ఏమో.! రావణుడు లంకాధిపతిగా ఎదిగే క్రమం, అతని పరాక్రమం.. ఇవన్నీ ఎక్కువగా తొలి భాగంలో చూపించారు.
అలాగని, రాముడినీ.. సీతనీ.. చూపించలేదని కాదు.! రాముడు, వానరుడిలా ఎగిరి దూకేస్తుంటాడు కొన్ని సన్నివేశాల్లో. అదే అస్సలేమాత్రం నచ్చదు సగటు ప్రేక్షకుడికి.
సీత కూడా ఓ యాక్షన్ ఎపిసోడ్లో కనిపించింది.. ఇది ఇంకాస్త చిత్రమైన విషయం. శూర్పణఖ ముక్కుని లక్ష్మణుడు కోసేస్తే, (చిన్న గీటు పెడతాడు), సీతకు కోపమొస్తుంది.
మహిళను అలా చేస్తావా.? అని లక్ష్మణుడికి క్లాస్ పీకుతుంది సీత. బహుశా, స్టోరీ రాసుకున్నప్పుడు.. ‘ఫెమినిజం’ గుర్తుకొచ్చి వుంటుంది.!
నటీనటుల్లో ముందుగా యష్ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే, అతనికే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది కాబట్టి.
పనిగట్టుకుని, చాలా పుస్తకాలు వెతికి, రావణుడిలో ఇంకో యాంగిల్‌ని ప్రేక్షకులకి పరిచయం చేయాలనే ప్రయత్నం చేయడం గమనార్హం. ‘రావణుడి’ పాత్రలో యష్ ఒదిగిపోయాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్‌ని తెరపై చూడ్డానికి కాస్తంత ఇబ్బందిగానే వుంటుంది. మంచి నటుడు కావడంతో, బాగానే మేనేజ్ చేశాడు.
సీత పాత్రలో సాయి పల్లవిని చూడటమూ సగటు ప్రేక్షకుడికి కష్టంగానే అనిపిస్తుంది. సినిమా నడుస్తున్న కొద్దీ, కాస్త అలవాటవుతుందామె సీత పాత్రలో.
శూర్పణఖ పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ బాగా సూటయ్యింది. ఆమె పాత్రే ఈ సినిమాలో గ్లామరస్.. శూర్పణఖ పాత్రలో రకుల్ బాగానే చేసింది.
వీఎఫ్ఎక్స్.. బావున్నాయ్.! సంగీతం.. ప్చ్.!
సినిమా నిండా విపరీతమైన వీఎఫ్ఎక్స్ వున్నాయ్. తెరపై ఆ బీభత్సం ఒకింత అద్భుతంగానే అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కంటికింపుగానూ వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనే, ఒకింత నిరాశ.! పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అన్నట్టు, తెలుగులో డబ్బింగ్ బానే వుంది.. లిప్ సింక్ ఎలా సెట్టయ్యిందో!
బహుశా, ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్’ వాడేసి, మేనేజ్ చేసినట్లున్నారు. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
రిచ్‌నెస్ విషయంలో ఢోకా ఏం లేదు. సినిమా నిడివి ఎక్కువైనా ఫర్వాలేదు. కాకపోతే, కొంత నిడివి తగ్గించొచ్చు.. ఎడిటర్ ఈ విషయంలో, కాస్త రిస్క్ తీసుకుని వుండొచ్చు.
నిజానికి, ‘రామాయణాన్ని’ అందంగా చెప్పాలి. అంత అందంగా చెప్పగలిగినప్పుడు మాత్రమే, అదనపు హంగులు కలిసొస్తాయ్.!
హంగులు.. సినిమాటిక్ లిబర్టీ..
కానీ, ఈ ‘రామాయణ’కి హంగులెక్కువయ్యాయి. పైన చెప్పుకున్నట్లు కొన్ని సీన్స్, దర్శకుడు ‘సినిమాటిక్ లిబర్టీ’ తీసుకుని, ఇష్టమొచ్చినట్లు తెరకెక్కించేశాడు.
ఈ తరానికి ఎలాగోలా కనెక్ట్ అయిపోతాం లే.. అని బహుశా దర్శక నిర్మాతలు అనుకున్నారేమో.. అలాంటి సన్నివేశాలకు సంబంధించి.
‘రావణుడు మరీ అంత చెడ్డోడేం కాదు..’ అని ‘సీత’ పాత్రలో నటించిన సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పడానికి కారణం, ఇందులో ‘రావణుడి’ పాత్రకి వున్న నిడివి, ప్రాధాన్యత కావొచ్చు.
యష్ అంటే, పాన్ ఇండియా హీరో కదా.! బహుశా ఆ యాంగిల్లో నెగెటివ్ రోల్ అయినా, రావణుడ్ని కాస్త పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేసినట్లున్నారు.
వాస్తవానికి, ‘రామాయణాన్ని’ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసేసుకున్నారు అనేక పుస్తకాల్లో. ఆ లెక్కన, ఈ సినిమాని దర్శక నిర్మాతలు తమకిష్టమొచ్చినట్లు తెరకెక్కించడంలో వింతేముంది.?
ఇది మొదటి పార్ట్.! రావణుడు, సీతని ఎత్తుకెళ్ళడంతో కథ ముగుస్తుంది. హనుమంతుడి రాక, రామ – రావణ యుద్ధం.. ఇవన్నీ రెండో భాగంలో చూడాలి. దానికోసం చాలా కాలం ఎదురుచూడాల్సిందే.
రెండు పార్టులు అనవసరం.. ఒకే పార్టుగా సినిమాని తెరకెక్కించి వుంటే బావుండేది.!
చివరగా: రావణుడి పాత్ర విషయమై రీసెర్చ్ చేసిన ‘రామాయణ’ టీమ్, శ్రీరాముడు అలా సీతా దేవి.. ఈ ఇద్దరినీ చూపించాల్సిన రీతిలో చూపించలేకపోయింది.