Andhra Pradesh Ramoji Festival.. అధికారం చేతిలో వుంటే, ఎలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాలైనా తీసుకోవచ్చు.! అంతేనేమో, ఇదేనేమో ప్రజాస్వామ్యమంటే.!
అడ్డగోలుగా సంక్షేమ పథకాలకి తమకు తోచిన పేర్లు పెట్టుకోవడం దగ్గర్నుంచి, పేర్లు మార్చడం వరకూ.. ఇదొక ప్రసహనం.!
ఎవరు అధికారంలో వున్నా జరిగేది ఇదే.! పెద్దగా తేడా ఏం లేదు.
ఓ అడుగు ముందుకేసి, ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు పేరుతో ఓ అధికారిక పండగ నిర్వహించబోతున్నారు ఇకపై, ఇదొక హేయమైన నిర్ణయం. దారుణమైన రాజకీయం.!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజు తలచుకుంటే, ఏదైనా సాధ్యమే రాచరిక వ్యవస్థలో. కానీ, ఇది ప్రజాస్వామ్యం కదా.!
నాన్సెన్స్.. ఇది ప్రజాస్వామ్యమని ఎవరు చెప్పారు.? ఇదీ, రాచరికమే.! లేకపోతే, రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడమేంటి.?
రామోజీరావు ప్రముఖ జర్నలిస్ట్ కావొచ్చు.! సినీ నిర్మాత కూడా కావొచ్చు.! పచ్చళ్ళ వ్యాపారం, మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలు నిర్వహించి వుండొచ్చు.!
ఏకంగా, రామోజీ ఓ ఫిలింసిటీని నిర్మించి, నిర్వహించి వుండొచ్చు.! అయినాగానీ, రాష్ట్ర పండుగగా ఆయన జయంతిని నిర్వహించేందుకు, ఆయనేమీ సంఘసంస్కర్త కాదు.
మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.! దాని వెనుక, రాజకీయ పరమైన కోణాలెలా వున్నా, కోర్టు చీవాట్లతో తప్పు ఒప్పుకోక తప్పలేదు రామోజీ.
బతికి వుంటే, ఏనాటికైనా ఆయన జైలుపాలయ్యేవారేమో.! రామోజీరావు చేసిన తప్పిదం అలాంటిది.! ఇక, రామోజీ మీద ‘కుల ముద్ర’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి రామోజీరావు ‘రాజగురువు’ అయితే కావొచ్చుగాక.! కుల గురువుగా రామోజీని ఓ వర్గం తమ భుజాన మోయొచ్చుగాక.!
రాష్ట్ర ప్రజలకి, రామోజీ జయంతిని పండుగలా భరించే ‘శిక్ష’ విధించడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలేమాత్రం సబబు కాదు.!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసి వుండాలి. ఆయనా దుదృష్టవశాత్తూ, ఈ నిర్ణయం వెనుక నేరుగా కాకపోయినా, పరోక్షంగా ‘జవాబుదారీ’ అయి వున్నారు.
రామోజీ పండగతో సరిపెడతారా.? ఏదన్న జిల్లాకి రామోజీ పేరుని పెడతారా.? ఏమో, ఆ దారుణాల్ని కూడా ముందు ముందు చూడబోతున్నామేమో.!
మీడియా రంగంలో, సినిమా రంగంలో రామోజీ పేరు ప్రఖ్యాతుల గురించిన చర్చ కాదిక్కడ.! రాష్ట్ర ప్రభుత్వం, ఓ వ్యక్తి జయంతి పేరుతో ‘పండగ’ నిర్వహిస్తుండడమే శోచనీయం.
పింగలి వెంకయ్య జయంతికి పండగ వుందా.? కోడి రామ్మూర్తి జయంతిని పండుగలా జరుపుకుంటున్నామా.? ఎందరో మహనీయులున్నారు.. వాళ్ళకి లేని, ‘జయంతి పండగ’ రామోజీకి ఎందుకు.?
టీడీపీ తరఫున ‘పార్టీ పండుగ’ రామోజీ పేరుతో చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదు.! కానీ, ఇలా రాష్ట్ర పండుగ.. అంటే, నాన్సెన్స్.! ముమ్మాటికీ నాన్సెన్స్.! ఎవడబ్బ సొమ్మనీ.!