Annapurna Devi Vijayadasami.. సాక్షాత్తూ పరమ శివుడే లక్ష్మీ కటాక్షం కోసం, ఆహారం కోసం జగన్మాత ముందు జోలె పట్టి నిలిచిన అద్భుతమైన కథ.
అందుకే, విజయ దశమి ఉత్సవాల్లో అమ్మవారి అన్నపూర్ణా దేవి అలంకరణ గురించి ప్రముఖంగా చెబుతారు పురాణాల్లో.
ఒకరోజు కైలాసంలో పరమ శివుడు, పార్వతీ దేవితో ఈ సృష్టి తత్వం గురించి ఒక లోతైన చర్చ లేవదీస్తాడు.
ఈ కనిపించే ప్రకృతి, భౌతిక ప్రపంచం, ఆహారం, శరీరం అంతా కేవలం భ్రమ. ఆత్మ మాత్రమే సత్యం అని పార్వతితో అంటాడు.
అయితే, పరమ శివుని మాటలతో పార్వతీ దేవి ఏకీభవించదు. భౌతిక అవసరాలను, ఆకలిని కేవలం మాయ, భ్రమ అని కొట్టి పారేయడం తగదని వాదిస్తుంది. కానీ, పరమేశ్వరుడు అందుకు ఒప్పుకోడు.
దాంతో, ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీ దేవి పరమ శివుడిపై కోపగించి తన ప్రాముఖ్యతను పరమేశ్వరుడికి నిరూపించాలని తలంచింది. అకస్మాత్తుగా సమస్త భువనాల నుంచి అంతర్ధానమైంది.
Annapurna Devi Vijayadasami.. ప్రకృతి కకావికలం..
జగన్మాత అదృశ్యం కావడంతో ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయింది. లోకమంతా ఆహారం, నీరు దొరకక భయంకరమైన కరువు తాండవించింది.
మానవులు, పశు పక్ష్యాదులు, చివరకు మునులు, దేవతలు సైతం ఆకలితో అల్లాడిపోతూ హాహాకారాలు చేశారు. సమస్త ప్రాణి కోటి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది.
లోకుల ఆర్త నాదాలు చూసిన జగన్మాత హృదయం తల్లడిల్లిపోయింది. వెంటనే భూలోకంలోని పరమ పవిత్రమైన కాశీ క్షేత్రంలో దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైంది.
అమ్మవారు తన దివ్య రూపంలో ఒక చేతిలో నవరత్నాలు పొదిగిన అమృత పాత్రను మరొక చేతిలో బంగారు గరిటెను ధరించి కాశీ నగరంలో సమస్త జీవులకూ అన్నదానం చేయడం ప్రారంభించింది.
క్షణాల వ్యవధిలో లోకంలోని జీవులందరి ఆకలిని తీర్చేసింది అన్నపూర్ణగా అమ్మవారు. దాంతో ప్రకృతి, భౌతిక ఆహారం అవసరం లేదని వాదించిన పరమ శివుడు దాని ప్రాముఖ్యతను గ్రహించాడు.
ఇందుకు ప్రతిగా భౌతిక – ఆధ్యాత్మిక సమతుల్యతను లోకానికి చాటి చెప్పడానికి స్వయంగా పరమ శివుడే చేతిలో కపాల పాత్ర (భిక్షా పాత్ర)ను పట్టుకుని సామాన్య భిక్షగాడి వేషంలో కాశీకి బయలుదేరాడు.
సాాక్షాత్తూ పరమ శివుడే జగజ్జనని ముందు చేయి చాచి జోలె పట్టి..
‘భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..’ అంటూ జగజ్జనని ముందు చేతులు చాచి భిక్ష వేయమని వేడుకున్నాడు.
మాతృమూర్తి అయిన పరమేశ్వరి మందహాసంతో పరమేశ్వరుడి పాత్రలో తన బంగారు గరిటెతో దివ్యాన్నాన్ని వడ్డించింది. ఆ అన్నాన్ని స్వీకరించిన పరమ శివుడు పార్వతిని ‘అన్నపూర్ణాదేవి’గా కీర్తించాడు.
అందుకే కాశీ క్షేత్రానికి అంతటి పవిత్రత నెలకొంది. అమ్మవారి అన్నపూర్ణ అవతారంలో తాత్విక అంతరార్ధం కూడా దాగి వుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
అన్నాన్ని పాడు చేయకూడదు. విదిలించకూడదు. ఎంతటి జ్ఞానం సిద్ధించాలన్నా మొదటగా శరీరానికి తగిన సత్తువ కావాలి. అది ఆహారంతోనే సంభవిస్తుంది.
అందుకే నవరాత్రుల్లో మొదటి రోజు సాధన, రెండో రోజు వివేకం పొందిన భక్తుడు మూడో రోజు అన్నపూర్ణ అనుగ్రహంతో సకల జీవుల పట్ల దయ, కనికరంతో మెలగాలి.
అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని గుర్తించాలి.. అని ఈ అవతారం సందేశమిస్తుంది.