Table of Contents
Comrade Kalyan Review.. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.. అంటూ, ఓ ట్యాగ్ తగిలించుకున్నాడు నటుడు శ్రీవిష్ణు.! శ్రీవిష్ణు అంటే, నిజంగానే చాలా మంచి నటుడు.!
కానీ, ఈ మధ్య డైలాగులు మింగేస్తున్నాడు. ఒకప్పుడు శ్రీవిష్ణు డైలాగులు చాలా స్పష్టంగా వినిపించేవి. ఇప్పుడు ‘నస’లా తయారైంది.
‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో నవ్వులు పూయించాడంటూ, సినిమా రిలీజ్‌కి ముందూ.. రిలీజ్ తర్వాతా బోల్డంత పబ్లిసిటీ చేశారు.
సినిమా హిట్టేనంటూ.. ఊదరగొట్టేశారు. థియేటర్లలో సినిమాల్ని చూడటం తగ్గించేశారు జనం.. జరుగుతున్న ‘అతి’ పబ్లిసిటీ కారణంగా.
తీరా, థియేటర్లకు వెళితే.. కథ, కాకరకాయ్.. ఏవీ వుండటం లేదు. పెద్ద హీరోలకే మార్కెట్ పడిపోయింది. శ్రీవిష్ణు లాంటోళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇంతకీ, ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథా కమామిషు ఏంటి.? పబ్లిసిటీ చేసుకున్నట్లు, ఈ సినిమా నిజంగానే హిట్టయ్యిందా.? జనం ఈ సినిమాని నిజంగానే మెచ్చారా.?
Comrade Kalyan Review.. కథేంటంటే..
ఓ థియేటర్లో పని చేస్తుంటాడు మన హీరో కళ్యాణ్. స్నేహితుడితో కలిసి థియేటర్‌కి ప్రేక్షకుల్ని రప్పించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తుంటాడు.
హీరోగారికి హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమెకేమో తెలుగు రాదు. హీరోకేమో తెలుగు కూడా సరిగ్గా రాదని హీరో ఫ్రెండ్ ఓ సందర్భంలో సెటైరేస్తాడు.
కట్ చేస్తే, హీరోయిన్‌కి తెలుగు వచ్చు. అది తెలిసే సమయానికి, హీరోయిన్‌ని ఎగరేసుకుపోవడానికి ఓ కామెడీ విలన్ వస్తాడు. హీరోయిన్‌ని సేవ్ చేయడానికి, హీరో నక్సలైట్ ముద్ర వేయించుకోవడానికి సిద్ధమవుతాడు.
అక్కడ మళ్లీ ఓ పోలీస్ అధికారికి అడ్డంగా దొరికేస్తాడు హీరో. అనుకోని పరిస్థితుల్లో నక్సలైట్లలో కలిసిపోతాడు. అందులోంచి బయటకు రావడానికి హీరో చేసే ప్రయత్నాలు మిగతా కథ.
ఫైనల్‌గా హీరోయిన్‌ని సొంతం చేసుకోవడం.. నక్సలిజం మీదా, పోలీస్ వ్యవస్థ మీదా నాలుగు డైలాగులు చెప్పేసి, ‘శుభం కార్డు’ వేసేయడం.. ఇదో ప్రసహనం.
ఎవరెలా చేశారు.?
శ్రీవిష్ణు సంగతి తెలిసిందే కదా.. కథలో విషయం వున్నా, లేకపోయినా.. ఈజ్‌తో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. కాకపోతే, అతని పూర్తి స్టామినా బయటకు రాదంతే.
ఇక్కడ, ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఎంత చెయ్యగలడో అంతా చేశాడు. సుదర్శన్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. సత్య బానే నవ్వించాడు.
సీనియర్ నటి రాధిక, మమ అనిపించారు. హీరోయిన్ మహిమ నంబియార్ గురించి ఏం మాట్లాడుకోవడానికి లేదు. ఆమె చక్కని నటి. కానీ, సరిగ్గా వాడుకోలేదు ఆమెని. బ్రహ్మాజీ కూడా తేలిపోయాడు.
ఏదో అనుకుని, ఇంకోటేదో చేసినట్లనిపిస్తుంటుంది సినిమా అంతా.! ఇష్టమొచ్చినట్లు సినిమా కథని, అటూ ఇటూ తిప్పేసుకుని.. ముగించేశారు.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. అన్నీ సినిమాకి తగ్గట్టే వున్నాయి. పెద్దగా ఆకట్టుకోలేదు. అతుకుల బొంతలా అనిపిస్తుంది సినిమా.. అంటే, ఎడిటింగ్ సరిగ్గా కుదరలేదా.? తీసిన సినిమాని చాలా కష్టపడి ఇక్కడిదాకా ఎడిటర్ తీసుకొచ్చాడా.?
నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అందించే సాయం చుట్టూ కథ అల్లుకున్నారా.? లేదంటే, ఇంకేదన్నా పాయింట్ చుట్టూ కథ అల్లుకున్నారా.? అన్న డౌట్ వస్తే, అది మీ తప్పు కాదు.
ఎటు నచ్చితే అటు తిప్పేశారు..
ముందే చెప్పుకున్నాం కదా.. నచ్చినట్టు సినిమా కథని తిప్పుకుంటూ పోయారంతే. బోల్డంత కామెడీ పండించే అవకాశం వున్నా.. అదీ, ఫోర్స్‌డ్ కామెడీ అయిపోయింది.
కాసిన్ని నవ్వుల కోసం సినిమా వరకూ వెళ్ళి, మిగతా టార్చర్ అంతా భరించాల్సిన అవసరం లేదు. ఓటీటీలో అయితే ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకుంటూ సినిమాలు చూసెయ్యచ్చని ప్రేక్షకులు అనుకుంటున్న రోజులివి.
టేకిట్ గ్రాంటెడ్.. అన్నట్లుగా ప్రేక్షకుల్ని దర్శక నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. హీరోలదీ అదే ఆలోచనలా కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా శ్రీవిష్ణు లాంటి టాలెంటెడ్ నటుడి నుంచి ఇలాంటి సినిమాల్ని అస్సలు ఆశించలేం. ఓటీటీలో ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకుంటూ పోతే, జస్ట్ పదిహేను నిమిషాల్లో పూర్తి చేసెయ్యొచ్చు.
మిగతాదంతా చెత్త కంటెంట్.. అని నిస్సందేహంగా అనేయొచ్చు.