Table of Contents
Ys Jagan Pulivendula Helicopter.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది, ఆయనిష్టం.!
బాగా డబ్బులున్నాయ్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో వెళుతున్నారు. ఇందులో తప్పు పట్టడానికేముంది.? బహుశా భద్రతా కారణాల రీత్యా హెలికాప్టర్ సేఫ్ అని అనుకుని వుండొచ్చు కూడా.!
కానీ, స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా వుండటానికి.. అని చెప్పి మరీ వెళుతున్నప్పుడు, వ్యవహారం వేరేలా వుండాలి.
సొంత నియోజకవర్గమే కదా.. పులివెందులకు ముందే వెళ్లి వుండొచ్చు. రెండు మూడు రోజులపాటు సొంతూరిలో వుండి, పార్టీ ముఖ్య నేతల్ని కలిసి, నియోజకవర్గ ప్రజల్నీ కలిసి వుండొచ్చు.
Ys Jagan Pulivendula Helicopter.. పోలింగ్ రోజున హెలికాప్టర్ డ్రామా.!
కానీ, వైఎస్ జగన్ అలా చేయలేదు. హెలికాప్టర్‌లో వెళ్ళే ప్రయత్నం చేశారు.. అదీ, స్థానిక ఎన్నికల పోలింగ్ రోజున.. ఓటెయ్యడానికి.!
వెళ్ళే ప్రయత్నం చేయడమేంటి.? వెళ్ళారు కూడా.! హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది, వైఎస్ జగన్ మాత్రం ఓటెయ్యలేదు.!
మీడియాతో మాట్లాడుతూ, హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనుమతివ్వలేదంటూ రాజకీయ ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
హెలికాప్టర్‌లో ఇంధనం సరిపడా లేదని చెప్పాకనే, ల్యాండింగ్‌కి అనుమతినిచ్చారంటూ వైెఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారిపోయింది.
వీఐపీ హెలికాప్టర్ చుట్టూ హైడ్రామా..
వీవీఐపీ హెలికాప్టర్ అంటే, దానికి సంబంధించిన భద్రతాపరమైన తనిఖీలు వుంటాయ్.. అది ఎంత ప్రైవేటు హెలికాప్టర్ అయినా సరే.!
సరిపడా ఇంధనం లేకుండా హెలికాప్టర్ గాల్లోకి ఎగురుతుందా.? ఛాన్సే లేదు. మరెందుకు, ఇంధనం సరిపడా లేదని వైఎస్ జగన్ చెప్పినట్లు.?
ఇంధనం సరిపడా లేకపోతే, వెళ్ళి మళ్ళీ తిరిగి రావడమెలా సాధ్యమవుతుందన్న ఇంగితం, హెలికాప్టర్ సర్వీస్ అంధిస్తున్న సంస్థ చూసుకోదా.?
మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం అత్యంత హాస్యాస్పదం. నవ్వులపాలైపోయారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ హెలికాప్టర్ వ్యవహారంతో.
స్థానిక ఎన్నికల వేళ, పులివెందులలో అలజడి సృష్టించడానికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ‘హెలికాప్టర్’ ఆరోపణలు చేశారన్నది నిస్సందేహం.
ఏం సందేశమిస్తున్నారో.?
ఈ తరహా రాజకీయాలతో వైఎస్ జగన్, పులివెందుల నియోజకవర్గ ప్రజలకీ, రాష్ట్ర ప్రజలకీ ఏం సంకేతాలు పంపినట్లు.? ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనూ ఒకింత అయోమయం కనిపిస్తోంది.
నిజమే, స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంలేదు. దాడులు.. ప్రతిదాడులు జరుగుతున్నాయి పాలక పక్షం – విపక్షం మధ్య.! స్థానిక ఎన్నికలంటే, ఎప్పుడూ ఇలానే తగలడుతున్నాయ్.
వైసీపీ హయాంలో ఇంతకంటే దారుణంగా స్థానిక ఎన్నికలు జరిగాయి. దాడులు, ప్రతిదాడులతో హోరెత్తిపోయింది అప్పట్లో స్థానిక ఎన్నికల వ్యవహారం.
ఏదిఏమైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓటెయ్యడానికి హెలికాప్టర్‌ని ఆశ్రయించడం వెనుక, కుట్రపూరిత ఆలోచనలు సుస్పష్టం.
ఇలాంటి వ్యూహాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అస్సలేమాత్రం పొలిటికల్ మైలేజ్ ఇవ్వవు.