సిరాశ్రీ ‘వ్యూ’: ‘రంగమార్తాండ’.. ఓ జీవితం.. ఓ అద్భుతం.!

Krishnavamsi Rangamarthanda Sirasri View
Rangamarthanda Sirasri View.. ఓ సినిమా రిలీజ్ డేట్ ఇంకా రాకుండానే, ఆ సినిమాని అత్యంత సన్నిహితులకు చూపించారంటే, ఆ సినిమాపై ఎంత ప్రేమ, నమ్మకం వుండి వుండాలి.?
ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ.! ఆ సినిమా పేరు ‘రంగమార్తాండ’.! ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిందీ సినిమా. రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్.. తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ‘హాస్యబ్రహ్మ’ బ్రహ్మానందం.! ప్రకాష్ రాజ్‌తో పోటీ పడి బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు.!
సాధారణంగా సినిమా విడుదలయ్యాక రివ్యూస్ వస్తుంటాయ్.! సినిమా విడుదలకు ముందు ఎవరైనా సినిమా చూసినా, ‘రివ్యూ’ ఇవ్వడానికి ఇష్టపడరు.
‘రంగమార్తాండ’ ప్రత్యేకత అదే..
కానీ, ‘రంగమార్తాండ’ సినిమాకి ముందే రివ్యూస్ వచ్చేశాయ్.! నిజానికి అవి ‘వ్యూస్’.! ఔను, సినిమాలోని సెన్సిబిలిటీస్‌ని చూసినవాళ్ళంతా అర్థం చేసుకున్నారంటే, అంతలా వారి మనసుల్ని తాకింది సినిమా.
ప్రముఖ సినీ పాటల రచయిత సిరాశ్రీ ‘రంగమార్తాండ’ సినిమా చూసి, తన ‘వ్యూ’ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

కృష్ణవంశీ, ‘జీవితాన్ని’ తెరపై ఆవిష్కరిస్తే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్‌ని పదునైన మాటలతో తన ‘వ్యూ’లో ఆవిష్కరించారు సిరాశ్రీ.!
‘గురూజీ.. మీ వ్యూ చదువుతోంటే, సినిమా చూసినట్లుంది..’ అని చెప్పాలనిపించింది. చెప్పేశాను.!
ఇక్కడ ఇలా పోస్ట్ చేయడానికి సిరాశ్రీ ఆనందంగా అనుమతిచ్చారు.! ఆయన ‘వ్యూ’.. ఆయన మాటల్లోనే.. ఇదిగో ఇలా.!
Rangamarthanda Sirasri View.. నా “రంగమార్తాండ” అనుభూతి.. సిరాశ్రీ..
సినిమా అంటే ప్రధానంగా వినోదానికే చూస్తాం.
తెర మీద ఒక జీవితాన్ని చూస్తూ, అందులోని వ్యక్తుల కష్టాలతో, భావోద్వేగాలతో మమేకమౌతూ ఒక బరువైన కథనాన్ని మోయగలిగే గుండె ఇప్పటి జనానికి లేదన్నది బహుళంగా ప్రచారంలో ఉన్న అభిప్రాయం.
అయితే ప్రతి గుండె వెనుక తడి ఉంటుంది. ఆ తడిని అంటిపెట్టుకుని మట్టివాసన కూడా ఉంటుంది. దేని మీదా దృష్టి నిలపలేని ప్రస్తుత హడావిడి జీవితాల వల్ల మన గుండెలో తడి ఉందన్న ఎరుకే మనకి లేకుండా పోతోంది.
అయితే ఎవరో ఒకరు అప్పుడప్పుడు దానిని గుర్తు చేస్తుంటారు.
గుండె లోతులో ఉన్న ఆ ప్రదేశాన్ని తాకి అక్కడొక సరైన అంకురాన్ని నాటుతారు.
అది మొలకెత్తి పలకరిస్తుంది.
మరిచిపోయిన మనలోని కొన్ని భావాల తంత్రుల్ని మీటుతుంది.
కృష్ణవంశీ (Krishna Vamsi) గారు ఆ పని చేశారు. ఆయన తీసిన “రంగమార్తాండ” చూసాను. ఇద్దరు రంగస్థల నటుల జీవితాల్లోకి లాక్కుపోబడ్డాను.
ఏదో ఒక నేపథ్యం ఉండాలి కాబట్టి ఇది రంగస్థల నటుల కథ కానీ, నిజానికి ఇది సమాజం కథ. అందరి కథ.
ఎదిగిన పిల్లలు పెద్దవాళ్లైపొయిన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో చెప్పే కథ.
పెద్దవాళ్లైన తల్లిదండ్రులు పిల్లలను ఎంత వరకు నమ్మాలో తెలిపే కథ.
తోచినట్టు బ్రతికే స్వేచ్ఛ అయితే ఒంటరిగానో, మహా అయితే జీవితభాగస్వామితోనో ఉంటుంది తప్ప సొంత వాళ్లే కదా అనుకునే పిల్లలతో కూడా ఉండదని చాటే కథ.
భార్యని ఆశ్రయించుకుని బ్రతికే మగాడు ఆవిడ ఉన్నప్పుడు మహరాజులా ఎలా ఉంటాడో, ఆవిడ పోగానే బికారిలా ఎలా మారిపోతాడో చూపే కథ.
తెర మీద చూస్తున్నంత సేపూ నాకు తెలిసిన వాళ్లే ఎందరో గుర్తుకొస్తూ ఉన్నారు. ఆ పాత్రలన్నీ నాకు పరిచయమున్నవే అనిపించింది.
నాకు నాటకరంగ ప్రముఖులతో పరిచయాలు, ప్రయాణాలు, వారి నుంచి విన్న ఇతర నాటకరంగ ప్రముఖుల జీవితకథలు అన్నీ గుండెల్లో చప్పుడు చేసాయి.
నాటకరంగానికి సంబంధించకపోయినా ఇవే భావాలతో బతికి వెళ్లిపోయిన వాళ్లు కూడా నా మనోయవనికపైకి వచ్చి వెళ్లారు.
నేను “నటసమ్రాట్” చూసాను. అందులో ప్రధానపాత్ర మీద పూర్తిస్థాయి సింపతీ కలగదు. అతను చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయనిపిస్తుంది.
వ్యక్తిత్వపరంగా కూడా మరీ అంత ఆదర్శంగా కనపడడు. కానీ ఇక్కడ కృష్ణవంశీ మాతృకలో ఉన్న దానికి చాలా మార్పులు చేశారు. పాత్ర ఔచిత్యాల్ని నిలబెట్టారు.
ఓపెనింగ్ సీన్లోనే ఒక సత్యం కనిపిస్తుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సమాజం నిలబడి చోద్యం చూస్తుంటుంది తప్ప ఎవ్వరూ ఎవర్నీ ఆదుకోరు అనేది ఆ సన్నివేశంలో చెప్పిన విషయం.
అది ప్రధాన కథలో పాత్రధారులకి కూడా వర్తిస్తుంది.
ఎంత బతుకు బతికినా చివరికి ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. ఆత్మాభిమానాలుంటే మరింత బాధతో చావాల్సిందే.
వినడానికి ఇదంతా పెస్సిమిస్టిక్ ధోరణిలో ఉంటుంది కానీ నిజానికి ఎక్కువ శాతం మనుషుల్లో కనిపించేవి ఈ తరహా జీవితాలే.
కొందరిని చూస్తే ఇలా బతకాలనిపిస్తుంది, కొందరిని చూస్తే ఇలా చస్తే బతకకూడదనిపిస్తుంది. ఆయా జీవితాల్ని చూస్తే చాలు సందేశం అందేస్తుంది. అదే ఈ రంగమార్తాండ.
ప్రకాష్ రాజ్ అనగానే నాకు గుర్తుకొచ్చే మొదటి ఐదు పాత్రల్లో కచ్చితంగా “అంతఃపురం” ఉంటుంది. ఆ పాత్రది సింగిల్ డైమెన్షన్. అద్భుతంగా నటించాడు. మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టని పాత్ర అది.
మళ్లీ ఇన్నాళ్లకి అదే కృష్ణవంశీ దర్శకత్వంలో ఇక్కడ విజృంభించాడు. ఇది మల్టీ డైమెన్షనల్ పాత్ర. ఆద్యంతం రక్తి కట్టించే పర్ఫార్మెన్స్. ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ ని తప్ప మరొకర్ని ఊహించలేం.
ఇక సర్ప్రైజ్ ఎవరంటే బ్రహ్మానందం గారు. ఆయనని సహజంగా సీరియస్ గా చూసినా నవ్వొస్తుంది. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది.
కానీ ఆయనలోని మునుపెన్నడూ చూడని నటుడు కొంచెం కొంచెం గా కనిపిస్తూ చివరికి విశ్వరూపం చూపిస్తాడు. కంట తడి పెట్టిస్తాడు.

ప్రస్తుతం రమ్యకృష్ణ గారి పేరు చెప్పగానే శివగామి పాత్ర గుర్తొస్తుంది. “నా మాటే శాసనం” అంటూ మహిళాశక్తిని చాటే పాత్ర పోషించిన ఆమె ఇందులో పూర్తి కాంట్రాస్ట్ గా భర్తచాటు భార్యగా జీవించారు.
సగటు ముందు తరం గృహిణి. మనలోని ఎక్కువ శాతం ఇళ్లల్లో కనిపించే భర్తని బాధ్యతగా భరించే ఇల్లాలు. ఆమె నటన గురించి చెప్పాల్సిన పని లేదు..టూ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్.
కృష్ణవంశీ గారి సినిమాల్లో కనిపించే హీరోయిన్స్ అందరూ అల్లరి చేస్తూ, చలాకీగా ఉంటారు. శివాత్మిక ఆ ట్రెండ్ ని కొనసాగించింది.
ఒక సన్నివేశంలో అయితే మల్టిపుల్ ఎమోషన్స్ ని చాలా నేచురల్ గా అభివ్యక్తీకరించింది. ఈమెలో మంచి నటి ఉందన్న సంగతి ఈ సినిమాతో ఇండస్ట్రీకి తెలుస్తుంది.
ఆదర్శ్, అనసూయలు సగటు ఇళ్లల్లో కనిపించే నేటి తరం జంటగా కనిపించారు.
ఫైనల్ గా రాహుల్ సిప్లిగంజ్…రంగమార్తాండుడి అల్లుడు. మామా అల్లుళ్లు ఇంత అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.
ఇప్పటికే సినిమా చూసి నాలుగైదు రోజులవుతోంది. అయినా ఇంకా వెంటాడుతోంది. ఏదో ఒక సందర్భంలో ఆయా పాత్రలు మనసు తడుతున్నాయి.
ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమా విడుదలయ్యాక మనసుతడి ఉన్న తెలుగువాళ్లందరూ అత్యధిక సంఖ్యలో చూస్తారు, చర్చించుకుంటారు.
ఇంత సీరియస్ సినిమాలో కూడా ఒక చిన్న సరదా మేటరుంది.
“నీ పక్క గరికిపాటి కానా!!” అంటూ ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ మీద ఒక పాట వస్తుంది.
“నీ పక్కన గడ్డిపోచంత విలువకూడా చెయ్యనా!” అనే అర్థం అందులో ఉందనుకున్నా ఎందుకో నాకు మాత్రం సుప్రసిద్ధ ప్రవచనకారులే గుర్తొచ్చారు.
ఆయన పాపులారిటీ అలాంటిది మరి. ఆ పదాన్ని అలా వాడాలన్న ఆలోచనలో ఏమైనా కారణం ఉందా అని కృష్ణవంశీగారినే నేరుగా అడిగాను.
విషయమేంటంటే ఆ పాట రాసింది “అల వైకుంఠపురములో” లో ‘సిత్తరాల సిరపడు” రాసిన విజయ్ కుమార్ భల్లా గారు.
ఆయనకు ప్రాచీన జానపదాల మీద విశేషమైన పట్టు. “నీ పక్క గరికిపాటి కానా…” అనే ఎత్తుగడ ఒక ప్రాచీనమైన జానపదమనట.
దానిని పట్టుకుని ఎప్పుడో ఏడాది క్రితమే పాట రాయడం జరిగిందని చెప్పారు. ఈ మేటర్ తెలియకపోతే నాకులాగానే చాలామంది ఏవో కారణాలు ఊహించుకునే ప్రమాదముంది.

ఇక మిగిలిన పాటల గురించి చెప్పుకోవాలి. ముందుగా టైటిల్సప్పుడు వచ్చే లక్ష్మీభూపాల గారి సుదీర్ఘమైన పొయెటిక్ మోనోలాగ్.
మొదటిసారి విన్నప్పుడు మూడు నెలల క్రితమే “నేను నటుడ్ని… మూడవ పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని….” అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అని నా వాల్ మీద పోస్ట్ కూడా చేసాను.
ఒక జీవితంలో వందలాది జీవితాల్ని పోషించే వరం ఒక్క నటుడికే ఉంటుంది! అటువంటి నటులందరికీ ఈ ప్రవరలాంటి వచనాన్ని రాసిన ఘనత లక్ష్మీభూపాల్ గారిదే.
అలాగే మిత్రుడు కాసర్ల శ్యాం రాయగా ఆస్కార్ స్థాయి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాడిన “పొదల పొదల గట్ల నడుమ…”లో పల్లెపదాల పోహళింపు ఇంపుగా ఉంది.
ఇక మహానుభావుడు సీతారామశాస్త్రి గారి గురించి చెప్పేదేముంది? ఆయన కలం నుంచి జాలువారిన ఆత్మగీతం అలా చెవుల్లో మోగుతూనే ఉంది…
“నీ నిలయమే నర్తనశాలే కాదా! నీ కొలువు ఏది..విరాటపర్వం కాదా! ముగిసిందా నీ అజ్ఞాతవాసం…” అంటూ ఈ రంగమార్తాండుడి జీవితం మొత్తాన్ని నాలుగు వాక్యాల్లో మహభారతమంత గొప్పగా ఆవిష్కరించారు.
నమో నమః! ఒకానొక నోస్టాల్జియా తాలూకు సౌరభాన్ని గుండెల్లో నింపి ఓలలాడించిన ఇళయరాజాగారికి శతకోటి వందనాలు (Rangamarthanda Sirasri View).
Also Read: హాస్య బ్రహ్మాండం.! నవ్వుల రారాజు బ్రహ్మానందం.!
ఒక శంకరాభరణం శంకరశాస్త్రి, ఒక మిథునంలో అప్పదాశు ఒక్కటై అవతారమెత్తితే ఈ రంగమార్తాండుడు! సకుటుంబంగా చూడండి. మీ మనసులో తడి ఎంతుందో మీకే తెలుస్తుంది. 22న విడుదల!
అన్నట్టు ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ మొబైల్ రింగ్ టోన్ రూపంలో గుమ్మడిగోపాలకృష్ణ గారి గొంతులో నాటకపద్యాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ స్ఫూర్తితో ఔచిత్యమనిపించి ఒక సీసపద్యం:
చూడ ప్రకాశరాజు మది లోతులు తాకి రంగమార్తాండుడై రంగులీనె
మానవీయ గతి బ్రహ్మానందరీతిగా
మదితీగలు మీటి యెదురు నిలిచె
శాంతమే రమ్యకృష్ణాకృతిన వెలిగి
దాంపత్యమును చాటి దారి చూపె
వాత్సల్య సుధలు శివాత్మికా రూపమై
కనుల ముందుర చేరి కళలు చిలికెఅనగ ఆదర్శమౌ రీతి ఆత్మకథను
సిరాశ్రీ
కనగ అనసూయనే చేర్చి కళను నింపి
చక్కగా మరి చెప్పుచు సాద్భుతముగ
తృష్ణతీర్చెను మెండుగ కృష్ణవంశి
ఇలా సాగింది ‘రంగమార్తాండ’ సినిమా గురించి సిరాశ్రీ ‘వ్యూ’.! మీకూ చదువుతున్నట్టుగా కాకుండా, సినిమా చూస్తున్నట్టుగా వుంది కదూ.!
ఇకపోతే.. ‘రంగమార్తాండ’ సినిమా విడుదలకు ముందే.. చూసే అవకాశం వచ్చినా, కొన్ని అనివార్య కారణాల వల్ల చూడలేకపోయాను.!
ఖచ్చితంగా సినిమాని థియేటర్లో చూస్తాను.! కానీ, గురూజీ ‘సిరాశ్రీ’ (Rangamarthanda Sirasri View) దాదాపుగా అన్ని మాటలూ వాడేశారు.. సినిమా గొప్పతానన్నీ, కథలోని జీవితాన్నీ ఆవిష్కరిస్తూ.!
బహుశా, కొత్తగా అభివర్ణించడానికి ఇంకేమీ మాటలు దొరక్కపోవచ్చు. ఓ సినిమా గురించి విడుదలకు ముందు ఇంత పెద్ద చర్చ జరగడం అనేది బహుశా కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ విషయంలోనే జరుగుతోందేమో.! అదీ ‘జీవితం’ కోణంలో.!
– yeSBee
