Table of Contents
Vishwanath And Sons Review.. అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే.! కొన్నేమో దెయ్యాల కథలు.! ఇంకొన్ని పాత కాలంలోకి మనల్ని తీసుకెళ్ళే సినిమాలు. మరికొన్ని, భవిష్యత్తులోకి తీసుకెళ్ళేవి.!
సినిమాల టోన్ చూస్తే, ఒకింత జుగుప్సాకరంగా మారిపోయింది పరిస్థితి. రెగ్యులర్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి.
ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఏ కోవలోకి వస్తుంది.? టైటిల్ చూశాక, అర్థమయిపోయే వుంటుంది.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.
టైటిల్ మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్స్ చూసినా, చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోందన్న అభిప్రాయం చాలామందికి కలిగింది.
మరి, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఎలా వుంది.? నటీనటులు సూర్య, మమిత బైజు ఎలా చేశారు.? దర్శకుడు వెంకీ అట్లూరి మళ్ళీ మ్యాజిక్ చేశాడా.? తెలుసుకుందాం పదండిక.!
Vishwanath And Sons Review.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథేంటంటే..
‘గజిని’ సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రని ఎలా మర్చిపోగలం.? బాగా రిచ్చు కదా.! ఇందులో కూడా, హీరో బాగా రిచ్చు.!
పెళ్ళంటే నచ్చదు.. తల్లి పోరు పడలేక, సరోగసీ ద్వారా ఓ బిడ్డకి తండ్రవుతాడు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ‘అద్దె గర్భం’ ఇచ్చిన యువతిని వెతకాల్సి వస్తుంది.
ఆ యువతి, హీరో ఇంటికి వచ్చాక, హీరో మీద ఆమెకు ప్రేమ మొదలయ్యాక.. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మిగతా కథ.! అది తెరపైనే చూడాలి.
వెబ్ సిరీస్‌లు చూసేవారికి, ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్, దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ ఎక్కడో ఓ చోట తగిలినట్లే అనిపిస్తాయి. చాలా సినిమాల రిఫరెన్స్‌లు కూడా కనిపిస్తాయ్ ఇందులో.
అయితే, దర్శకుడు కొన్ని సన్నివేశాల్ని చాలా బాగా డీల్ చేశాడు. కొన్నిటిలో చేతులెత్తేశాడు. కొన్ని డైలాగ్స్ బాగా రాసుకున్నాడు.. కొన్ని పేలవంగా అనిపిస్తాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల చాలా బావుందనిపిస్తుంది. కొన్ని చోట్ల డల్‌గా అనిపిస్తుంది. పాటల విషయంలోనూ ఇదే భావన కలుగుతుంది.
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా, ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి వుంటే బావుండేది. సినిమాలో హీరో రిచ్ కదా, దానికి తగ్గట్టుగానే, సినిమాని ఇంకా రిచ్‌గా తెరకెక్కించారు.
నటీనటుల విషయానికొస్తే..
నటుడిగా సూర్య గురించి కొత్తగా చెప్పేదేముంది.? కేక్ వాక్.. అన్నట్లుగా, ఈ సినిమాలో తన కోసం దర్శకుడు రాసిచ్చిన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు సూర్య.
ఎక్కడ ఎలాంటి ఎమోషన్స్ అవసరమో, అలాంటి ఎమోషన్స్‌లో జీవించేశాడు. చాలా స్టైలిష్ లుక్‌తో సూర్య, ఈ సినిమాకి నిండుదనాన్నిచ్చాడు.
ఫార్టీ ప్లస్.. అని, దర్శకుడు హీరోకి మేకప్‌మెన్ ద్వారా నాలుగు తెల్ల వెంట్రుకలు కనిపించేలా చేశాడుగానీ, పాతికేళ్ళ కుర్రాడిలానే కనిపిస్తాడు హీరో.
పెర్‌ఫెక్ట్.. సూర్య వైపు నుంచి. తెరపై సూర్యని చూస్తున్నంతసేపూ మెస్మరైజింగ్ అనిపిస్తుంది. అన్ని సీన్స్‌లోనూ టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు సూర్య.
హీరోయిన్ మమిత బైజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె కూడా, తన పాత్రలో ఒదిగిపోయింది. ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేదు మమిత బైజు నటన విషయంలో.
అక్కడక్కడా ఒకింత హైపర్ యాక్టివ్ అనిపించినా, మమిత బైజుకి దర్శకుడు, రచయిత కూడా అయిన వెంకీ అట్లూరి రాసిచ్చిన పాత్ర అలాంటిది.
సీనియర్ నటి రాధిక, చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేసిన అతి కొద్ది సినిమాల్లో ఇది కూడా ఒకటి. తన పాత్రకు నిండుదనాన్ని తెచ్చారామె. తన సీనియర్టీకి పూర్తి న్యాయం చేశారామె.
మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. కాస్ట్యూమ్స్, ఆర్ట్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్, సినిమాకి ఏం కావాలో, అన్నీ చేశాయ్.
ప్లస్సులు.. మైనస్సులు..
సూర్య, మమిత బైజు, రాధిక.. ఈ ముగ్గురి నటన, సినిమాకి పెద్ద మైనస్. నిర్మాణపు విలువలు.. కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్.. ఇలా ప్లస్సులు బానే వున్నాయ్. పాటలూ, మ్యూజిక్ కూడా అంతే.
మైనస్సుల విషయానికొస్తే, సెకెండాఫ్‌లో కొంత సాగతీత అనిపిస్తుంది. కొంత ఆక్వార్డ్ మూమెంట్ కూడా వుంది. దాన్ని ఇంకాస్త బెటర్‌గా డీల్ చేసి వుండాల్సింది. హీరో పాత్ర తాలూకు గ్రాఫ్ పడిపోతుందక్కడ.
మ్యూజిక్ కూడా, బావుందనిపిస్తుంది.. అంతలోనే, ఇంకాస్త బెటర్‌గా వుండి వుంటేనా.. అనిపిస్తుంది.
కొత్త పాయింట్ అయినా, తెలిసిన సన్నివేశాలే అన్నీ.. అనిపిస్తాయ్. అది కాస్త మైనస్ ఈ సినిమాకి. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాని తెరకెక్కించడంలో వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.
క్లాస్ సినిమాకి భారీ యాక్షన్ సీన్ అవసరం లేదేమో అనిపిస్తుంది. సూర్య మాస్ ఫ్యాన్స్ కోసం రెండు ఫైట్స్ బలవంతంగా ఇరికించాడేమో దర్శకుడు వెంకీ అట్లూరి.
బీభత్సమైన, భయానకమైన, జుగుప్సాకరమైన సినిమాల నడుమ.. ఓ క్లీన్ అండ్ క్లాస్ మూవీ వస్తే, దాని గురించి ఇలాగే మాట్లాడుకుంటాం. అంతిమంగా, ప్రేక్షకులే సినిమా జయాపజయాల్ని నిర్ణయించాలి.
– yeSBee
