YSRCP Kapu Politics.. ఓ సామాజిక వర్గం, ఓ రాజకీయ పార్టీకి గంప గుత్తగా మద్దతు ప్రకటించే అవకాశమే వుండదు.
కాకపోతే, ఆ సామాజిక వర్గంలో, మెజార్టీ ఓటు బ్యాంకు, ఆ పార్టీకి పడి వుండొచ్చు.. అనే అంచనాల్ని మాత్రమే చూస్తుంటాం.
ఇది, అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. కేవలం కుల రాజకీయమే కాదు, మత రాజకీయం కూడా ఇంతే. ఫలానా మతం ఓట్లు పూర్తిగా, ఓ రాజకీయ పార్టీకి పడతాయని అనుకోవడం మూర్ఖత్వం.
రాజకీయ పార్టీల గెలుపోటములకు అనేక కారణాలుంటాయి. అందులో, కుల సమీకరణాలు, మత సమీకరణాలు.. ఇలా చాలానే వుంటాయ్.
కులమతాలకతీతంగా, అభివృద్ధి అనేది కూడా అత్యంత కీలకం రాజకీయ పార్టీల గెలుపోటములకు సంబంధించింది. ఇది జగమెరిగిన సత్యం.
అయినా, కుల రాజకీయాలకు.. మత రాజకీయాలకు రాజకీయ పార్టీలు ఎందుకు నిస్సిగ్గుగా తెరలేపుతాయి.? అంటే, కాదేదీ రాజకీయానికి అనర్హం కాబట్టి.
ఇంతకీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గం, 2029 ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది.? అసలంటూ కాపు సామాజిక వర్గం గురించిన ప్రస్తావనే పదే పదే ఎందుకు వస్తోంది.?
2024 ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ జన సేనాని పవన్ కళ్యాణ్. కాపు ఓటు బ్యాంకు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ మొబిలైజ్ అయ్యింది, అదే కూటమి గెలుపుకి కారణమనే చర్చ జరిగింది.
ఇందులో కొంత నిజం లేకపోలేదు. కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ తరఫున నిలబడటానికి చాలా కారణాలున్నాయి.
కాపు సామాజిక వర్గం మాత్రమే కాదు, అన్ని సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ వైసీపీకి వ్యతిరేకంగా పడింది.
2019 ఎన్నికల్లో చూశాం… వైఎస్సార్సీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఈ ఎన్నికల్లోనే కుల, మత రాజకీయాలు పని చెయ్యవనే విషయం తేటతెల్లమయ్యింది.
ఇంకోసారి 2ే024 ఎన్నికల్లో ఇదే విషయం నిరూపితమయ్యింది. పరిపాలన సజావుగా లేకపోతే, రాజకీయ పార్టీల్ని ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని 2019, 2024 ఎన్నికలు నిరూపించాయి.
కానీ, ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి రాజకీయ పార్టీలు ఇష్టపడవు. తమ వైఫల్యాల్ని అస్సలు అంగీకరించవు. అదే అసలు సమస్య.
సగటు ఓటరు ఏ పార్టీకి అయినా ‘కాపు’ కాయాలంటే, ప్రజలకు మేలు జరగాలి. ఇంకో మూడేళ్ళ సమయముంది కూటమి ప్రభుత్వానికి.
కాపు సామాజిక వర్గం కూటమికి దూరమయ్యిందన్న రాజకీయ విశ్లేషణలు కేవలం మైండ్ గేమ్ అంతే. వైసీపీ ఇలాంటి మైండ్ గేమ్స్ పక్కన పెట్టి, ప్రజలకు ఎలా చేరువవ్వాలనేది ఆలోచించుకోవాలి.
చివరగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ముందుకు ఎగదోసి, పవన్ కళ్యాణ్‌ని తిట్టించే ‘కార్యక్రమం’ జగన్ మానుకోవడం మంచిది.
కేవలం కాపు సామాజిక వర్గమే కాదు, సామాజిక వర్గాలకతీతంగా ప్రజలంతా ఈ వైసీపీ నీఛ రాజకీయాన్ని అసహ్యించుకుంటున్నారు.
