Table of Contents
Korean Kanakaraju Review.. అనగనగా ఓ దెయ్యం.. ఓ యువకుడు శరీరంలోకి వస్తుంది.!
ఆ శరీరాన్ని తన శాశ్వత ఆవాసంగా చేసుకోవాలనుకుంటుంది.! మరి, ఆ యువకుడు, ఆ దెయ్యం బారి నుంచి ఎలా బయటపడ్డాడు.?
ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్.! హీరోయిన్ శరీరంలోకో, హీరో శరీరంలోకో.. దెయ్యాలు రావడం చాలా సినిమాల్లో చూశాం.. చూస్తూనే వున్నాం.
కొన్ని కామెడీ దెయ్యాలు, కొన్ని సీరియస్ దెయ్యాలు.. ఏదైతేనేం, దెయ్యం మాత్రం భలే కాసుల పంట పండించేస్తుంటుంది వెండి తెరపైన.
అఫ్‌కోర్స్, కొన్ని దెయ్యాలు నిర్మాతల్ని నిండా ముంచేసిన సందర్భాలూ లేకపోలేదు. సరిగ్గా తీస్తే మాత్రం, దెయ్యం సినిమాలు ఎప్పటికీ బాక్సాఫీస్ విన్నర్లే.
ఇంతకీ, ఈ కొరియన్ కొరివి దెయ్యం సంగతేంటి.? వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.
Korean Kanakaraju Review.. కథేంటంటే..
ఓ కుర్రాడు.. కోపమెక్కువ. ప్రేమ కూడా ఎక్కువే.! ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంతలోనే, అతనికి ఓ సమస్య. తనకు తెలియకుండానే ఏవేవో జరిగిపోతుంటాయ్.
హీరోయిన్‌తో కలిసి సమస్య పరిష్కారం కోసం కొరియాకి వెళతాడు హీరో. తన శరీరంలో వున్న కొరియన్ దెయ్యం అసలు కథేంటో, అక్కడ తెలుస్తుంది.
కొరియన్ దెయ్యానికి అడ్డంగా దొరికిపోయిన కనకరాజు, ఆ దెయ్యం బారి నుంచి ఎలా తప్పించుకున్నాడన్నదే క్లయిమాక్స్.! మొత్తం కథంతా చెప్పేసుకున్నాం కదా.!
చాలా దెయ్యం సినిమాల్లో ఇలాంటి కథలే వుంటాయ్. ఇందులోనూ అలాంటి కథే వుంది. కాకపోతే, కొరియన్ దెయ్యం అంతే.! పైగా, సినిమా అంతా కామెడీ నింపేశారు.
సో, లాజిక్కులు వెతక్కూడదు. కామెడీ పండిందా.? మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా.? హీరో, హీరోయిన్లు ఎలా చేశారు.? మిగతా పాత్రధారులకు ఎంత స్కోప్ దక్కింది.. ఇవే మాట్లాడుకోవాలి.
సంగీతం, ఎడిటింగ్.. వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి మరి. తప్పదు కదా.! సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకూ సూపర్. పాటలు ఓకే బావున్నాయ్. ఇంకా వినసొంపుగా మ్యూజిక్ చేసి వుంటే బావుండేది.
మాటల విషయానికొస్తే, రాయలసీమ స్లాంగ్ అదిరిపోయింది. నటీనటులంతా ఆ స్లాంగ్‌ని బాగా అడాప్ట్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ బావుంది.
చివర్లో వీఎఫ్ఎక్స్ ఓకే. బాగానే వుంది. కానీ, ఇంకా చాలా బాగా చెయ్యొచ్చు. ఎడిటింగ్ క్రిస్పీగానే వుంది. సినిమాకి అవసరమైన మేర బాగానే ఖర్చు చేశారు.
వరుణ్ తేజ్.. పెర్‌ఫెక్ట్..
నటీనటుల నటనా ప్రతిభ విషయానికొస్తే, వరుణ్ తేజ్‌కి ఇది డిఫరెంట్ మూవీ. నటుడిగా ఓ మెట్టు పైకెక్కేశాడు. సినిమా అంతా, కనకరాజు కనిపిస్తాడు తప్ప, వరుణ్ తేజ్ కనిపించడు.
కనకరాజుతోపాటు, కొరియన్ డాన్ కూడా కనిపిస్తాడనుకోండి.. అది వేరే సంగతి. రాయలసీమ డిక్షన్ అదిరిపోయింది. చాలా బాగా ఆ యాసని పట్టేశాడు కనకరాజు. అదేమంత తేలికైన విషయం కాదు.
స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో వరుణ్ తేజ్‌కి నూటికి నూరు మార్కులూ పడతాయి. డాన్సుల కోసం కూడా కొంచెం బానే కష్టపడ్డాడు. బాగా చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ తన మార్క్ చూపించాడు.
సెటిల్డ్, లౌడ్.. ఇలా ఏది కావాలని దర్శకుడు అడిగితే, ఆ సమయానికి ఆ ఎక్స్‌ప్రెషన్ అలా ఇచ్చేశాడంతే. చాన్నాళ్ళ తర్వాత నిండైన పాత్ర దక్కింది వరుణ్ తేజ్‌కి.
హీరోయిన్ రితిక నాయక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలుగమ్మాయి పాత్ర అయినా, కొరియన్ బొమ్మలా కనిపించింది. లవ్లీ స్మైల్.. బ్యూటిఫుల్ డ్రెస్సింగ్.. వాట్ నాట్.. అన్నీ బాగా కుదిరాయి.
చాన్నాళ్ళ తర్వాత సినిమా అంతటా హీరోయిన్ కనిపించింది ‘కొరియన్ కనకరాజు’లోనేనేమో.! ఈ మధ్య హీరోయిన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతోంది తెరపై చాలా సినిమాల్లో.
సత్య చితక్కొట్టేశాడు..
కమెడియన్ సత్యకి చాలా స్క్రీన్ స్పేస్ లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్నాడు సత్య. పంచ్‌లు వేస్తూనే వున్నాడు సినిమా అంతా.
హీరో తర్వాత సక్సెస్ క్రెడిట్‌లో మెజార్టీ షేర్ సత్య పాత్రకే దక్కుతుందంటే, సత్య పాత్రని దర్శకుడు ఎంత స్పెషల్‌గా రాసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
సునీల్ పాత్ర నిడివి ఇంకాస్త వుంటే బావుండేది. మురళీధర్ తనకు దక్కిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మిగతా పాత్రధారులు మమ అనిపిస్తాయి.
శ్రీనివాస్ అవసరాల పాత్ర కన్విన్సింగ్‌గా అనిపించదు.
ముందే చెప్పుకున్నట్లు.. ఇదో కామెడీ యాక్షన్ థ్రిల్లర్. లాజిక్కులు వెతక్కూడదు. జస్ట్ మ్యాజిక్‌ని ఎంజాయ్ చెయ్యాలంతే. స్టార్టింగ్ టు ఎండింగ్.. చాలా వేగంగా నడిచిపోతుంది స్క్రీన్ మీద సమయం.
దర్శకుడు ఏం తెరకెక్కించాలనుకున్నాడో, అది పక్కాగా తెరకెక్కించగలిగాడు. ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు, చేసేశాడు కూడా.!
క్లయిమాక్స్‌లో విలన్ పాత్రని పుసుక్కున ‘ముగించేయడం’ కొంతమందికి మింగుడు పడకపోవచ్చు. కానీ, అదంతే. అంతకన్నా ఏం చేసినా, వ్యవహారం తేడా కొట్టేస్తుంది.
ఓవరాల్‌గా చూస్తే ‘కొరియన్ కనకరాజు’ పైసా వసూల్.! హీరో ఎంట్రీ సాంగ్ దగ్గర్నుంచి, శుభం కార్డు పడేదాకా.. ఎంటర్టైనింగ్ రైడ్ అంతే.! వరుణ్ తేజ్ ఎదురు చూసిన నిఖార్సయిన హిట్ ‘కొరియన్ కనకరాజు’ రూపంలో దక్కేసింది.
అన్నట్టు, ‘అమెచ్యూరిష్ స్ట్రోక్’ అనే డైలాగ్ వివాదాస్పదమవడం, సినిమాకి పబ్లిసిటీ పరంగా అడ్వాంటేజ్. లక్షలు, కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ వచ్చేస్తోంది ఈ వివాదం కారణంగా.
