Johnson Baby Powder Cancer.. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తెలుసు కదా.? మీ చిన్నారి మృదువైన శరీరం కోసం.. అంటూ, పెద్దయెత్తున ప్రకటనలు గుప్పించేవారు ఒకప్పుడు.
అప్పట్లో, చిన్న పిల్లల్ని ఈ పౌడర్‌లో తల్లిదండ్రులు ముంచేసేవాళ్ళు. దీన్నొక, ఖరీదైన పసిపిల్లల సౌందర్య సాధనంగానూ ప్రచారంలోకి తీసుకొచ్చారు.
అయితే, ఈ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే ప్రమాదకర పదార్థం వుందనీ, ఇది క్యాన్సర్ కారకమనీ ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలూ వెల్లువెత్తాయి.
దాంతో, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ, ఈ బేబీ టాల్కమ్ పౌడర్ తయారీ, విక్రయాల్ని నిలిపివేసింది. తమ ప్రోడక్ట్‌లో ఎలాంటి హానికారక పదార్థాలూ లేవని వాదిస్తూ వచ్చింది.
కోర్టులో కేసులు నమోదయ్యాయి.. సుదీర్ఘ కాలంగా ఈ కేసుల విచారణ కొనసాగుతూనే వుంది.
ఇంకా ఈ కేసులతో వేగలేం.. అనుకుందో ఏమోగానీ, సంస్థ ఏకంగా 52 వేల కోట్లను నష్టపరిహారంగా చెల్లించేందుకు మందుకొచ్చింది.
‘మేం తప్పుని ఒప్పుకోవడంలేదు. మా వైపు నుంచి తప్పు జరగలేదు.. కానీ, కేసులతో విసిగిపోయాం. ఏళ్ళ తరబడి సాగుతున్న కోర్టు కేసుల కారణంగా, ఇతర అంశాలపై దృష్టిపెట్టలేకపోతున్నాం..’ అని సంస్థ తెలిపింది.
ఇక, ఇక్కడితో ఈ వివాదాన్ని ముగించేందుకే 52 వేల కోట్లను ఇస్తున్నామని ‘సెటిల్మెంట్’ కోసం ముందుకొచ్చింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ.
అయితే, మరిన్ని కేసులు నమోదైతే పరిస్థితి ఏంటి.? అన్న చర్చ అంతటా జరుగుతోంది. ఇంతకీ, ఈ 52 వేల కోట్లు ఎవరికి ఇస్తారు.? ప్రపంచ వ్యాప్తంగా బాధితులు ఎంతమంది వున్నారు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
అన్నట్టు, రెండు దఫాలుగా మొత్తం 52 వేల కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అమెరికా వ్యాప్తంగా 76 వేల పిటిషన్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకి వ్యతిరేకంగా నమోదయ్యాయి.
తొంభై శాతం మంది పిటిషనర్లు గనుక ఈ డీల్ పట్ల సానుకూలంగా స్పందిస్తే, తొలుత మూడు బిలియన్ డాలర్లను చెల్లించనుంది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. ఏం జరుగుతుందో చూడాలిక.
