CM Pawan Kalyan Politics.. ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో అయితే ప్రధాన మంత్రి అవ్వాలనే కోరుకుంటారు.!
ఇందులో వింతేముంది.? అసలు అలా కోరుకోవడంలో తప్పేముంది.? జన సేన పార్టీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలనే కోరుకుంటుంది.
ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారని జన సేన శ్రేణులు భావించడం తప్పెలా అవుతుంది.?
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, తాజాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది తమ కోరిక అంటూ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
CM Pawan Kalyan Politics.. పదిహేనేళ్ళ కూటమి.. అసలు విషయమిదీ..
‘రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే, పదిహేనేళ్ళపాటు కూటమి కలిసికట్టుగా అధికారంలో వుండాలి’ అని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే.
కూటమి అధికారంలో వుండటమంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయాల్సిందే పదిహేనేళ్ళపాటు.. అన్న దుష్ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూనే వుంది.
కూటమి అధికారంలో వుండటమంటే, కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వొచ్చు. ఆ సందర్భాన్ని బట్టి, అప్పటి పరిస్థితుల్ని బట్టి ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయ్.
వాస్తవానికి, రెండున్నరేళ్ళు టీడీపీ, రెండున్నరేళ్ళు జన సేన అధికారంలో వుంటాయనే చర్చ 2024 ఎన్నికల ముందర జరిగాయి. అధికారం కంటే, రాష్ట్రాభివృద్ధికే తన ప్రాధాన్యత అని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు.
అప్పటికి జన సేన పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే వుండేవారు. ఆ ఎమ్మెల్యే కూడా అప్పట్లో వైసీపీలోకి జంప్ చేసేసిన సంగతి తెలిసిందే.
అప్పటికీ ఇప్పటికీ లెక్కలు వేరే వున్నాయ్..
కానీ, ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్ వేరు. జన సేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్సీలు కూడా వున్నారు.
ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, 2029 ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్ జన సేన పార్టీకి మరింత సానుకూలంగా మారుతుంది. జన సేన పోటీ చేసే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది కూటమి కొనసాగితే.
ఒకవేళ కూటమి కొనసాగకుండా, వేర్వేరుగా పోటీ చేయాల్సి వచ్చినా, జన సేన మెరుగైన స్థానంలోనే వుంటుంది సీట్ల పరంగా. అప్పుడు జన సేనకు అధికారం ఇంకాస్త సులువుగా వచ్చే అవకాశమూ వుండొచ్చు.
భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలా వుంటుందన్నది ఇప్పుడే ఓ అంచనాకి రావడం తొందరపాటే అవుతుంది. కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయంగా ఎదగాలనే కదా అనుకుంటుంది.!
సీఎం పవన్ కళ్యాణ్.. ఇది జన సైనికుల బలమైన ఎమోషన్.! డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవడానికి ఒకే ఒక్క మెట్టు ఎక్కాల్సి వుంది జన సేనాని పవన్ కళ్యాణ్.
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. పొలిటికల్ ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి అనూహ్యంగా మారిపోతుంటాయంతే.
