Home » సమీక్ష ‘దృఢం’ – నిఖార్సయిన నమ్మకద్రోహం.!

సమీక్ష ‘దృఢం’ – నిఖార్సయిన నమ్మకద్రోహం.!

by hellomudra
0 comments
Dridam Review

Dridam Telugu Review.. కంచే చేను మేస్తే.. అబ్బో, ఈ పాయింటుతో కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేశాయని అంటారా.? అయితే, అది మీ తప్పు కాదు.!

ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్విస్టులతో చాలా సినిమాలు వచ్చాయి.. వస్తూనే వున్నాయి.

మలయాళ సినిమాలు, ఒకింత ఫ్లాట్‌గా మొదలవడం, నెమ్మదిగా సాగుతూ, బీభత్సమైన ట్విస్ట్‌తో ప్రేక్షకులకి షాక్ ఇవ్వడం.. ఇదంతా మామూలే.

అందుకే, మలయాళ సినిమాలు ఓ ఎడిక్షన్‌లా మారిపోతున్నాయ్. ఓటీటీ పుణ్యమా అని, మలయాళ సినిమాల్ని నేరుగా తెలుగులోనూ ఇంటిల్లిపాదీ చూడగలుగుతున్నాం.

అదీ, ఇంట్లోనే కావడంతో.. ఓటీటీలో మలయాళ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలా, ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమా ‘ద‌ృఢం’.

షేన్ నిగమ్ అనే మలయాళ నటుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ ‘దృఢం’. జీతూ జోసెఫ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూసేవారికి సుపరిచితుడే.

ఆ జీతూ జోసెఫ్‌తో కలిసి పని చేసిన మార్టిన్ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమానే ఈ ‘దృఢం’. ఇదొక పోలీస్ స్టోరీ.!

Dridam Telugu Review.. కథలోకి వెళితే..

ఓ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్‌కి కొత్తగా వస్తాడు పోలీస్ అధికారి. నిజానికి, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ఏళ్ళుగా ఎలాంటి క్రైమ్స్ పెద్దగా రిజిస్టర్ అవవు.

అంత ప్రశాంతంగా వున్న ఆ ప్రాంతంలోకి ఈ కొత్త పోలీస్ అధికారి రాగానే, అలజడి.! ఓ బ్యాంక్ దొంగతనం, వరుస హత్యలు.. చివరికి, కొత్త పోలీస్ అధికారిపైన కూడా దాడి జరుగుతుంది.

దాంతో, అసలేం జరుగుతుందో అర్థం కాక, అంతా అయోమయానికి గురవుతారు.

ఓ వైపు, పై అధికారుల నుంచి ఒత్తిడి, ఇంకో వైపు కేసుల్లో ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో, తీవ్ర మనోవేదనకు గురవుతాడు ఆ కొత్త పోలీస్ అధికారి.

ఉద్యోగం పోతుందనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంతకీ, కొద్ది గంటల్లో సస్పెండ్ అవడమో, ట్రాన్స్‌ఫర్ అవడమో తప్పదని తెలుసుకున్న, ఆ కొత్త అధికారి ఏం చేశాడన్నది మిగతా కథ.

ఎవర్నయితే బలంగా నమ్ముతాడో, కుటుంబ సభ్యులని అనుకుంటాడో.. వాళ్ళే, ఆ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ అధికారికి షాక్ ఇస్తారు. ఆ షాక్ ఏంటన్నది తెరపై చూడాల్సిందే.

కొత్త పోలీస్ అధికారి పాత్రలో షేన్ నిగమ్ చాలా బాగా చేశాడు. ఇంకా పవర్ చూపించడేంటి.? అని, అనుకుంటూనే వుంటాం. అతని మీద సింపతీ పెరిగిపోతుంది ఆడియన్స్‌కి.

సరిగ్గా అదే టైమ్‌లో, దమ్ము చూపించాడ్రా.. అనిపిస్తుంది. అదే, మలయాళ సినిమాల మ్యాజిక్. మిగతా పాత్రధారులంతా, ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

సినిమాటోగ్రఫీ అయితే టాప్ క్లాస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాలో ప్రేక్షకులు లీనమైపోయేలా చేస్తుంది. సినిమా కోసం ఎంత ఖర్చు చేయాలో, అంతా ఖర్చు చేశారు.

తెలుగు డబ్బింగ్ బావుంది. తెలుగు సినిమానే చూస్తున్నామనే భావన కలుగుతుంది. చివర్లో ఓ లేడీ పోలీస్ అధికారి చేసే యాక్షన్, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

ట్విస్ట్ రివీల్ అయిపోతే, సినిమా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. అందుకే, ట్విస్ట్ తెలుసుకోకుండానే సినిమా చూడాలి.

దర్శకుడు తాను చెప్పాలనుకున్నదీ, చూపించాలనుకున్నదీ.. అనుకున్నట్టుగానే చేసేశాడు. నటీనటుల నుంచి దర్శకుడికి ఫుల్ సపోర్ట్ లభించింది.

సాంకేతిక నిపుణుల నుంచి తనకు ఎంత కావాలో, అంతా తీసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా దర్శకుడు డీవియేట్ అయ్యింది లేదు. మలయాళ సినిమాల్లో సహజంగానే వుండే ఆ స్లో పేస్, ఇందులో కూడా వుంది.

ఆ స్లో పేస్ అనేది పక్కన పెడితే, థ్రిల్లర్ జోనర్‌లో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టైమ్ పాస్ కోసం ఓ సారి చూసెయ్యొచ్చు నిరభ్యంతరంగా.

మితిమీరిన హింస లేదు.. వల్గారిటీకి ఆస్కారమే ఇవ్వలేదు. ఓవరాల్‌గా, కుటుంబంతో కలిసి చూడొచ్చు. థ్రిల్ ఫీలవ్వొచ్చు.

– yeSBee

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group