సమీక్ష: ‘మార్కో’ – సినిమా చూడాలంటే ‘గుండె’ ధైర్యముండాలి.!

Marco Unni Mukundan Review
Marco Telugu Review.. ఓ మనిషిని యాసిడ్‌లో కరిగించేస్తే.! పుట్టబోయే బిడ్డని తల్లి మర్మాంగం నుంచి పైశాచికంగా లాగేస్తే.! విలన్ ఛాతీ మీద కత్తితో పొడిచి, గుండెకాయని బయటకు లాగేసి పిసికేస్తే.!
భయంతోపాటు జుగుప్స కూడా కలుగుతోంది కదా.! రంపంతో చేతిని నరికెయ్యండి.. చాలా చాలా చిన్న విషయంగానే అనిపిస్తుంది.. ‘మార్క’ సినిమా చూస్తే.!
ఏం, వెబ్ సిరీస్‌లు చూడట్లేదా.? వాటితో పోల్చితే, ‘మార్కో’లో వున్న హింస, రక్తపాతం, జుగుప్స.. ఇవేవీ అంత వింతగా అనిపించవ్.! అయినాగానీ, వెండితెరపై ఇంతటి పైశాచికం.. అస్సలు ఊహించలేం.
అంతకు మించి.. జుగుప్స.! అంతకు మించిన హింస.! ‘మార్కో’ సినిమా చూస్తున్నంతసేపూ, అసహ్యం.. అనేది చిన్నమాటే.!
Marco Telugu Review.. రక్తపాతం.. ఓన్లీ రక్తపాతం.!
మొన్నీమధ్యన ‘కిల్’ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అందులో కూడా హీరో, విలన్లని చంపుతోంటే.. ‘ఇంకా దారుణంగా చంపు’ అనాలనిపిస్తుంది. విలన్లు, సామాన్యుల్ని చంపుతోంటే ‘అయ్యోపాపం’ అనిపిస్తుంది.
‘మార్కో’ అలా కాదు.! స్క్రీన్ మీదకు దృష్టి మళ్ళించాలంటేనే జుగుప్స, అసహ్యం కలుగుతుంది. ఎవరు, ఎవర్ని ఎందుకు చంపుతున్నారో అర్థం కాదు. అంత దారుణం.
రక్తం.. తెగిపడ్డ శరీరావయవాలు.. వీటి చుట్టూనే ‘మార్కో’ సినిమా వుంది. ఓ పెద్ద కుటుంబం, ఆ కుటుంబానికి కాపలాగా వుండే ‘మార్కో’.!
కుటుంబంలో విక్టర్ అనే వ్యక్తి చావుకి కారణమైనవారిపై పగతీర్చుకోవాలనుకుంటాడు మార్కో. కుటుంబ పెద్ద కూడా తక్కువోడేం కాదు.. పవర్ వున్నోడే.!
‘మార్కో’ పగ తీర్చుకోవాలనుకుంటే, కుటుంబ పెద్ద మాత్రం, ‘కొంచెం ఆలోచించు.. నీ అవసరం కుటుంబానికి వుంది.. నేను చూసుకుంటాను..’ అంటాడు.
సదరు కుటుంబ పెద్ద కూడా, కొడుకుని చంపినవారిపై పగ తీర్చుకుంటాడుగానీ.. ప్రత్యర్థిని అంచనా వేయడంలో బోల్తా పడతాడు.
విలన్ గ్యాంగ్ విషయానికొస్తే, ఒకడిని మించి ఇంకొకడు కిరాతకుడు. సినిమా అవసరం కోసం.. అన్నట్లు, అసలు సిసలు కిరాతకుడ్ని తీరిగ్గా పరిచయం చేస్తాడు. అందరూ చేసేది ఒకటే.. అదే, రక్తపాతం.
ఓ హత్య జరుగుతుంది.. దానికి సాక్షి ఓ కళ్ళు లేని వ్యక్తి విక్టర్. ఎవరు చంపారన్నదానిపై విక్టర్‌కి అనుమానం వస్తుంది. ఆ అనుమానమే అతని చావుకి కారణమవుతుంది.
కుటుంబానికి కాపలా వుండాల్సిన మార్కో, కుటుంబం మొత్తాన్నీ పణంగా పెట్టి.. కేవలం విక్టర్ కొడుకుని మాత్రమే కాపాడగలుగుతాడు. ఇదేం కథో ఏమో.!
ఆ మాత్రందానికి ‘మార్కో’కి కుటుంబం ఎలివేషన్స్ ఇవ్వడమేంటో.! సినిమా అంతా చూశాక, ఈమాత్రందానికి ఇంత రక్తపాతం అవసరమా.? అనిపిస్తుంది.
మన తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితుడే అయిన ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో హీరో.! యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఇంకా చాలా బాగా చేయగలడు. నటన పరంగా కూడా అంతే.
కుటుంబం మొత్తాన్నీ కోల్పోయాక.. తీవ్రమైన గాయాలతో కూడా, తీరిగ్గా డ్రెస్సింగ్ చేసుకుని, పెర్‌ఫ్యూమ్ కొట్టుకుని, గాగుల్స్ పెట్టుకుని.. విలన్‌ని చంపడానికి స్టైలిష్‌గా వెళతాడు హీరో.!
ఇది చాలు, రక్తపాతానికి స్టైలిష్ లుక్ అద్దడం ద్వారా, జుగుప్సని క్లాస్‌గా చూపించాలని దర్శకుడు అనుకున్నాడని చెప్పడానికి.
ఈ తరహా సినిమాలు ఇటీవలి కాలంలో ‘క్లిక్’ అవడానికి ఒకే ఒక్క కారణం యాక్షన్ బ్లాక్స్, ఆపై హింస, రక్తపాతం, జుగప్స పట్ల ఓ సెక్షన్ ఆడియన్స్‌లో ఆసక్తి పెరగడం.
సమాజంలో జరుగుతున్న చాలా నేరాలకు, ఈ తరహా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంతగానో ఉపయోగపడుతన్నాయి.!
అన్నట్టు, టెక్నికల్ అంశాల విషయానికొస్తే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా.! కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బావున్నాయ్. రక్తపాతం మాత్రం, అత్యంత జుగుప్సాకరం.
