తెలుగు తెరపై ‘మన్మధుడు’ అయినా, ‘కింగ్’ (HBD King Nagarjuna) అయినా అతనొక్కడే. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినీ రంగంలోకి వచ్చిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తొలి సినిమా నుండి ఇప్పటిదాకా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. హిట్లు, ఫ్లాపులు ఆయనకి కొత్త కావు.
తెలుగు సినిమాకి సంబంధించి, దాదాపు రెండు దశాబ్ధాల పాటు, నలుగురు అగ్రహీరోలు రాజ్యమేలితే, అందులో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. ఏదైనా సరే, నాగార్జున ‘కింగ్’ అంతే. రెగ్యులర్, కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాలకీ పెద్ద పీట వేశారు నాగార్జున.
బహుశా నాగార్జున పరిచయం చేసినంతగా యంగ్ టాలెంట్‌ని ఇంకే పెద్ద హీరో ఇప్పటిదాకా ఏ పెద్ద హీరో ఎంకరేజ్ చేసి ఉండరేమో. అదే నాగార్జున ప్రత్యేకత. కొత్త దర్శకులతో ఫ్లాపులు చవి చూసినా, ప్రయోగాల విషయంలో, న్యూ టాలెంట్‌ని వెలికి తీసే విషయంలో నాగార్జున ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
అసలు ప్రయోగాలు చేయకపోతే, ఈ సీనియారిటీ ఎందుకు.? దండగ.. నాకు నేనే బోర్ కొట్టేస్తాను. అంటూ పదే పదే చెబుతుంటారు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల గురించిన ప్రస్థావన వస్తే. నిజమే, యంగ్ టాలెంట్‌ని నాగార్జున ప్రోత్సహించి ఉండకపోతే, ‘శివ’, ‘అన్నమయ్య’, ’ఊపిరి’ లాంటి సినిమాలు ఆయన నుండి ఎందుకొస్తాయి.?
‘శివ’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా సైకిల్ చైన్ తెగ్గొట్టినా, ‘అన్నమయ్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో రెండు దశాబ్ధాలుగా చెరగని ముద్ర వేసినా, అది నాగార్జునకే చెల్లింది. షష్టి పూర్తి చేసుకుంటున్నా ఇప్పటికీ నాగార్జున ‘నవ యువ సామ్రాట్టే’.
మల్టీ స్టారర్ సినిమాలు చేసినా.. బుల్లితెరపై హోస్ట్ అవతారమెత్తి టెలివిజన్ షోలతో అదరగొట్టినా అది నాగార్జునకే చెల్లింది. నటుడిగా, నిర్మాతగా.. నాగార్జున (HBD King Nagarjuna) రూటే సెపరేటు. బాక్సాఫీస్ లెక్కలు తెలిసిన నటుడు, నిర్మాత ఆయన.
వెండితెర ‘మన్మధుడు,’ తెలుగు సినిమా ‘కింగ్’.. ఇలా అభిమానులు పిలుచుకోవడం మామూలే. ఈ వయసులో హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ ముద్దులేంటీ.? అని ప్రశ్నిస్తే, ఏం వయసు మీద పడితే, రొమాంటిక్‌గా ఉండరా.? ముద్దులు పెట్టుకోరా.? అని చిలిపిగా ప్రశ్నించే రీల్ ‘మన్మధుడు’ ఈ అక్కినేని నాగార్జున.
తన కుమారులిద్దరూ హీరోలుగా సెటిలైపోయినా, వాళ్లతోనే గ్లామర్ విషయంలో పోటీ పడుతుండడం నాగార్జున ప్రత్యేకత. నాగార్జున ఫిట్‌నెస్ ఓ పెద్ద సీక్రెట్. అసలు ఈ వయసులో ఇంత ఫిట్‌గా ఆయన ఎలా ఉంటారో ఎవరికీ అర్ధం కాదు.
సినిమా కోసం సిక్స్ ప్యాక్ కావాలా.? అని దర్శకుల్ని అడిగి మరీ, కండలు తిరిగిన శరీరాన్ని స్క్రీన్‌పై చూపించేస్తారు. వెండితెర ‘మన్మధుడు’, తెలుగు సినిమా ‘మన్మధుడు’ అక్కినేని నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.