Nushrratt Bharuccha Bali Accident.. విహార యాత్ర కాస్తా, విషాద యాత్రగా మారిపోయిందేమో.! బాలీవుడ్ నటి నుష్రత్ భరుచా, వెకేషన్ నిమిత్తం ‘బాలి’కి వెళ్ళి, అక్కడ ప్రమాదానికి గురైంది.
ప్రమాదమెలా సంభవించిందన్నదానిపై స్పష్టత లేదు. వెన్నెముకకి తీవ్ర గాయం కావడంతో, ఇండోనేషియాలోనే తొలుత ఆమెకు వైద్య చికిత్స అందించే ప్రయత్నం చేశారు.
అయితే, పరిస్థితి విషమిస్తుండడతో, వైద్యుల సూచన మేరకు ‘బాలి’ నుంచి ముంబైకి నుష్రత్‌ని ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
సెలబ్రిటీలు, విదేశాలకు విహార యాత్రల నిమిత్తం వెళ్ళడం కొత్తేమీ కాదు. అయితే, అక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్స్ విషయంలో కొందరు సెలబ్రిటీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.
ఇండోనేషియాలోని బాలి.. అంటే, మన సినీ సెలబ్రిటీలకు ఫేవరెట్ వెకేషన్ డెస్టినేషన్. అక్కడి అందాల్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతుంటారు.

మరీ ముఖ్యంగా, సముద్ర తీర అందాలకు బాలి పెట్టింది పేరు. వాటర్ స్పోర్ట్స్, ప్రకృతిలో మమేకమవడం, లోయల అందాల్ని తిలకరించడం.. సినీ ప్రముఖులకి అలవాటే.
అయితే, ప్రమాదం ఎవర్ని ఎప్పుడెలా విషాదంలోకి నెట్టేస్తుందో చెప్పలేం కదా.! నుష్రత్ విషయంలో కూడా అదే జరిగింది.
కాగా, అసలు ప్రమాదం ఎలా జరిగింది.? అన్నదానిపై నుష్రత్ సన్నిహితులు పెదవి విప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం నుష్రత్ స్పృహలోనే వుంది.
వెన్నెముకకు తీవ్ర గాయం అయిన దరిమిలా, సర్జరీ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సర్జరీ అనంతరం కొన్ని వారాల పాటు నుష్రత్ ‘బెడ్ రెస్ట్’కే పరిమితం కావాల్సి వస్తుందట.
నుష్రత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు నుష్రత్ బరుచా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.
