Home » ‘తుడక్కం’ రివ్యూ: తండ్రి మోహన్‌లాల్‌కి తగ్గ తనయ విస్మయ.!

‘తుడక్కం’ రివ్యూ: తండ్రి మోహన్‌లాల్‌కి తగ్గ తనయ విస్మయ.!

by Mudra369 Editorial Desk
0 comments
Thudakkam Review Vismaya

Thudakkam Telugu Review.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమేముంది.? ఆయన కుమార్తె కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టింది నటిగా.!

మోహన్ లాల్ కుమార్తె విస్మయ నటించిన తొలి సినిమా ‘తుడక్కం’ తాజాగా, ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించారు.

‘తుడక్కం’ సినిమాలో మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. నిజానికి, మోహన్ లాల్‌ది జస్ట్ అతిథి పాత్ర మాత్రమే. కుమార్తె కోసం.. ఆయన గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారంతే.

తన కుమార్తె, పరీక్ష రాయడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని వికలాంగుడైన ఓ విలేజ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాడు.

ఆ యువతి మిస్సింగ్ కేసు ఛేదించేందుకు పోలీసులు నడుం బిగిస్తారు. ఆ బృందంలో ఒక వెటకారపు పోలీస్ కూడా వుంటాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆ టీమ్‌ని లీడ్ చేస్తారు.

అయితే, ఆ యువతి క్షేమంగా ఇంటికి చేరుకుంటుంది. అక్కడితో కథ సుఖాంతమయిపోయిందని అంతా అనుకుంటారు. కానీ, ఆ రాత్రే ఆ యువతి ఇంట్లో జరగకూడనిది జరుగుతుంది.

Thudakkam Review Vismaya.. అబల కాదు.. సబల..

ఆ దారుణానికి ఒడిగట్టింది ఎవరు.? ఆడది అంటే అబల కాదు, సబల.. అని, ఆ యువతి తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుని, సభ్య సమాజానికి సందేశం ఇచ్చింది.? అన్నది మిగతా కథ.

కథ నెమ్మదగా మొదలవుతుంది. కొంత సాగతీతగా అనిపిస్తుంది. కానీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాక, కథలో వేగం పెరుగుతుంది.

విలన్ ఎవరన్నదానిపై స్పష్టత వచ్చాక, కథ కొత్త మలుపు తిరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్, వాటిల్లో విస్మయ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటాయి.

టెక్నికల్‌గా చూసుకుంటే, మలయాళ సినిమాలు చాలా స్పెషల్‌గా వుంటాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ బాగా కుదిరాయి. డైలాగ్స్ కూడా బావున్నాయి.

మలయాళ సినిమాల్లో నిడివి, సాగతీత గురించి కంప్లయింట్స్ మామూలే. ఈ సినిమాకీ అవి వున్నాయి. కాకపోతే, తర్వాతేం జరుగుతుందన్నది ముందే అర్థమయిపోయినా, సినిమాలో లీనమయ్యేలా చేయగలిగారు.

కాకపోతే, ఇదే ప్యాటర్న్ ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసేశాం. దాదాపుగా చాలా మలయాళ సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. ఇది కూడా అంతే.

తొలి ప్రయత్నంలోనే నటిగా తానేంతో ప్రూవ్ చేసుకునేందుకు విస్మయ శ్రమించిన తీరు తెరపై కనిపిస్తుంది.

హీరోయిన్ నాజూగ్గా వుండి, ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయ్ మనకి.. అనగా, మన తెలుగు ప్రేక్షకులకి.

ఇక్కడ ఈ ‘తుడక్కమ్’లో హీరోయిన్ బొద్దుగా వుంటుంది. కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసింది. ఈ విషయంలో ఆమెని అభినందించి తీరాలి.

బాధితురాలి పట్ల జాలి, దయ వుండదు సరికదా, సమాజంలోని కొందరికి.. బాధితురాలంటే చులకన భావం ఎక్కువ. ఇదే, ఈ సినిమాలోనూ చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

మార్షల్ ఆర్ట్స్ అకాడమీని నడిపే అమ్మాయి, తనకు కష్టమొస్తేనే ధైర్యంగా ఎదుర్కోలేకపోయిందన్న చిన్న చూపుని తట్టుకోలేక, బలంగా నిలబడిన తీరు.. యువతకు స్ఫూర్తినిస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అదే తెరపై చూపించాడు. ఇతరత్రా డీవియేషన్స్ జోలికి వెళ్లలేదు. మలయాళ సినిమాల్లో డీవియేషన్స్ తక్కువే వుంటాయ్.

ఓటీటీలో ఉచితంగానే చూసెయ్యొచ్చుగనుక, వన్ టైమ్ వాచ్ విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు.! స్లోగా వున్నప్పుడు ‘ఫాస్ట్ ఫార్వార్డ్’ చేసేసుకుని, సినిమాని పూర్తి చేసెయ్యొచ్చు.

నటిగా విస్మయకి మంచి ఫ్యూచర్ వుంది. తండ్రి మోహన్ లాల్ పేరుకి మరింత గౌరవాన్ని తీసుకొచ్చే కేపబిలిటీస్ ఆమెకి వున్నాయి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group