Tiruvannamalai Arunachalam Moksha Margam.. తిరువణ్ణామలై.. అరుణాచలం.. పేరు ఏదైతేనేం, శివ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమిది.!
తమిళనాడులోని తిరువణ్ణామలైకి, తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా భక్తులు వెళుతుంటారు. ప్రతి పౌర్ణమికీ తిరువణ్ణామలై.. అదేనండీ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వెరీ వెరీ స్పెషల్.
ఇసకేస్తే రాలనంత జనం.. అనేది నిజానికి చాలా చిన్నమాట. భక్త జన సంద్రం, గిరిప్రదక్షిణ మార్గంలో పోటెత్తుతుంది. ‘అరుణాచల శివ’ అంటూ భక్తులు నినదిస్తూ ముందుకు సాగుతారు.
ఓసారి కాదు, మళ్ళీ మళ్ళీ గిరి ప్రదక్షిణ మొక్కులు మొక్కేసి, వాటిని తీర్చేసుకుంటున్నారు భక్తులు. వేలల్లో కాదు, లక్షల్లో భక్తులు కనిపిస్తారు ప్రతి పౌర్ణమికీ.
Tiruvannamalai Arunachalam Moksha Margam.. గిరి ప్రదక్షిణలోనే ‘మోక్ష మార్గం’.!
అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ‘మోక్ష మార్గం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇంకో రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిస్తే చాలు, గిరి ప్రదక్షిణ ముగుస్తుందన్న సమయంలో ఈ ‘మోక్ష మార్గం’ కనిపిస్తుంది.
ఈ మోక్ష మార్గం ఓ చిన్న గుడిలా కనిపిస్తుంది. చాలా ఇరుకు దారిలో పాక్కుంటూ వెళ్ళాలి. దానికి మళ్ళీ చాలా పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంటుంది.
చిన్నా పెద్దా తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా ఈ మోక్ష మార్గంలో పాకుతుంటారు భక్తులు. ఈ క్రమంలో భారీ కాయంతో వున్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కూడా.
అయినాసరే, అనారోగ్య సమస్యలు తగ్గుతాయనీ, కోరికలు నెరవేరుతాయనీ.. నమ్మకంతో ప్రాణాల్ని పణంగా పెట్టేస్తారు భక్తులు.
ఇరుక్కుపోయి.. ప్రాణాలు పోయి..
తాజాగా, ఓ భక్తుడు ఈ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
మోక్ష మార్గంలో స్పృహ తప్పి పడిపోయిన తెలుగు వ్యక్తి, అందునా ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి, ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇంకో మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది ఇదే మోక్ష మార్గంలో.
దాంతో, అధికారులు చర్యలు చేపట్టారు. భారీ కాయంతో వున్నవారు మోక్ష మార్గంలోకి వెళ్ళొద్దని స్పష్టం చేశారు. పరిమిత సమయం మాత్రమే, ఆ మోక్ష మార్గంలోకి బక్తుల్ని అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి, సుదూరం నడక మార్గంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల్లో కొందరు తీవ్ర అలసటకు గురవుతుంటారు. అలాంటివారికి, మోక్ష మార్గం అనే, ఇరుకైన మార్గం.. ఇబ్బందికరంగా మారుతోంది.
కాబట్టి, భక్తులు తమ ఆరోగ్య పరిస్థితి, తమ శరీర సౌష్టవం.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం మంచిది. మోక్షం అంటే, శివైక్యం.! ఈ విషయంలో భక్తులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం.
లక్షలాది మంది భక్తులు.. మొత్తంగా కోట్లాది మంది భక్తులు ఈ మోక్ష మార్గంలో వెళ్ళి వుంటారు. ఎప్పుడూ ఎదురవని ఇబ్బంది, ఇప్పుడే ఎందుకు ఎదురవుతోందన్నదీ విస్మయం కలిగిస్తున్న అంశమే.
