Table of Contents
Viralimalai Murugan Temple.. పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు, దద్దోజనం.. ఇలా చాలా రకాల పిండి వంటలు ప్రసాదంగా చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పించడం తెలిసిందే.
అయితే, ఈ దేవాలయంలో దేవునికి చుట్టలు నైవేధ్యంగా సమర్పించే వింత ఆచారం వుంది.
ఎక్కడా వినలేదు కదా. ఇంతకీ ఈ చిత్రమైన ఆలయం ఎక్కడుంది.? ఆ ఆలయంలోని దేవుడెవరు.? నైవేద్యంగా చుట్టలు సమర్పించడానికి గల కారణాలేంటీ.? తెలుసుకుందాం పదండి.!
తమిళనాడులోని ‘విరాలిమలై మురుగన్ ’ ఆలయంలోనే ఈ వింత ఆచారం చోటు చేసుకుంది. కొన్ని శతాబ్ధాల కాలం నాటి చరిత్ర గలిగిన ఈ దేవాలయానికి సంబంధించి అనేక స్థల పురాణాలు ప్రాచుర్యంలో వున్నాయ్.
Viralimalai Murugan Temple.. తండ్రికే జ్ఞానం బోధించిన కొడుకు.!
సాక్షాత్తూ పరమేశ్వరుడికే జ్ఞాన బోధ చేశాడట మురుగన్ ఈ ప్రదేశంలో. కుమార స్వామిని మురుగన్ అని పిలుస్తుంటారు. అపారమైన జ్ఞానానికి ప్రతీతకగా మురుగన్‌ని కొలుస్తుంటారు.
‘ఓంకారం’ అర్ధాన్ని తండ్రి పరమ శివునికి, మురుగన్ (కుమార స్వామి) బోధించిన పవిత్ర స్థలంగా ఈ స్థలానికి ప్రత్యేకత వుంది.
తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో తిరుచ్చి మధురై జాతీయ రహదారిపై తిరుచ్చికి 30 కిలో మీటర్ల దూరంలో విరాలి మలై అనే కొండపై ఈ దేవాలయం వుంది.
ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో స్వామి వారు కొండపై దర్శనమిస్తారు ఈ ఆలయంలో. కొండపై వున్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 207 మెట్లు ఎక్కాల్సి వుంటుంది.
వందల కొద్దీ నెమళ్లు..
నెమలిని మురుగన్‌కి ఇష్టమైన వాహనంగా చెబుతారు. ఈ కొండపై స్వామి వారు నెమలి వాహనంపై ఆశీనులు కావడమే కాదు.. ఈ ఆలయ పరిసరాల్లో వందల కొద్దీ నెమళ్లు స్వేఛ్చగా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాయ్.
మురుగన్‌కి అత్యంత ఇష్టమైన నెమళ్లను, ప్రత్యక్షంగా అంత పెద్ద సంఖ్యలో చూడడం భక్తులకు ఆహ్లాదమైన అనుభూతినందిస్తుందిక్కడ.
వాటిని స్వామి వారి రక్షకులుగా, దైవ స్వరూపాలుగా భక్తులు కొలుస్తారు. వాటికి ఎటువంటి హింస కలగకుండా, చాలా పవిత్రంగా ప్రేమగా చూస్తారు.
వింత నైవేధ్యం.!
ఇక్కడికొచ్చే భక్తులు స్వామి వారికి ఇష్టంగా అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వాటితో పాటూ చుట్టలు (సిగరెట్స్) కూడా నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఓ వింత ఆచారం.
పూర్వం పుదుక్కొట్టై రాజు రామచంద్ర తొండైమాన్‌కి వచ్చిన అనారోగ్యం స్వామి వారి దయతో నయం కావడంతో అప్పటి నుంచీ ప్రతీ రోజూ చుట్టలను నైవేధ్యంగా సమర్పించే ఆచారం ప్రారంభమైందని అక్కడి స్థానికులు చెబుతుంటారు.
అలా తాము కోరుకున్న బలమైన కోరికలు నెరవేరిన తదుపరి, భక్తులు స్వామి వారికి చుట్టల్ని ప్రత్యేక నైవేధ్యంగా సమర్పిస్తుంటారట.
రహస్య సొరంగాలు
ఈ ఆలయం లోపల అనేక రహస్య సొరంగ మార్గాలున్నాయనీ చెబుతారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు ఇప్పటికే తవ్వకాలు నిర్వహించి పలు సొరంగాల్ని కనిపెట్టారని చెబుతాారు.
వీటిలో కొన్ని చోళుల కాలం నాటివి అని శాస్త్రవేత్తలు గుర్తించారట. ఇలాంటి మరెన్నో సొరంగాలు ఇంకా ఈ దేవాలయం కింద వున్నట్లు గుర్తించారు.
