Vote For Note Revanth Reddy.. భారత దేశంలో, పొలిటికల్లీ మోటివేటెడ్ ‘కేసులు’ సాగుతూనే వుంటాయ్. ఎంతలా అంటే, దశాబ్దాలపాటు.! ఎన్నేళ్ళు గడిచినా, కొన్ని కేసులు కొలిక్కి రావు ఎప్పటికీ.
అలాంటి కేసుల్లో, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కూడా ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, తెలంగాణలో జరిగిందీ ఘటన.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ హయాంలో అరెస్టయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తమకు అనుకూలంగా ఓటెయ్యాలంటూ లంచం ఎరచూపారన్నది రేవంత్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణ. రెడ్ హ్యాండెడ్‌గా అప్పట్లో రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు కూడా.
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, (ఆ కేసు జరిగినప్పుడూ ఆయనే ఏపీకి ముఖ్యమంత్రి) మెప్పు కోసమే, రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి..
ఆంగ్లో ఇండియన్ కోటాలో అప్పటికి ఎమ్మెల్సీగా వున్న స్టీఫెన్‌సన్‌కి 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం వెనుక, అప్పటి అధికార పార్టీ కుట్ర వుందన్నదీ తెలిసిన విషయమే.
ముందస్తుగా ఏసీబీకి సమాచారం ఇచ్చి, స్టీఫెన్‌సన్ ఇంట్లో కెమెరాలు పెట్టి.. రేవంత్ రెడ్డిని ఇరికించారు. ఈ కేసులో చంద్రబాబుని ఇరికించాలన్నది అసలు ప్లాన్.
ఓ రకంగా, అప్పటి టీఆర్ఎస్ పన్నిన వ్యూహంలో రేవంత్ రెడ్డి తనంతట తానుగా వెళ్ళి ఇరుక్కుపోయారు. జైలుకు వెళ్ళారు కూడా.!
అదే, ఆ కేసు వల్లనే రేవంత్ రెడ్డి, ఆ తర్వాత రాజకీయంగా బలపడి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారన్నదీ కాదనలేని వాస్తవం.
జైలుకెళితే, ముఖ్యమంత్రి అవుతారని గతంలో వైఎస్ జగన్ ప్రూవ్ చేస్తే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అవడం గమనార్హం.
ఇదే, ఇలా వివిధ కేసుల్లో అరెస్టయి, పొలిటికల్ సింపతీ పొంది, ఆ తర్వాత ముఖ్యమంత్రులవుతోంటే.. అధికార పీఠమెక్కాక, ఆయా కేసులు సాగతీతకు గురికాకుండా వుంటాయా.?
కానీ, ఇలా కేసులు సాగతీత.. ఏళ్ళ తరబడి జరుగుతోంటే, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వసనీయత అనేది వుంటుందా.? అన్నదే అసలు ప్రశ్న.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు కూడా ఏళ్ళ తరబడి సాగతీతకు గురవుతూనే వుంది. వైఎస్ వివేకానంద డెత్ మిస్టరీ సంగతి సరే సరి.
చంద్రబాబు మీద కూడా చాలా కేసులున్నాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి, క్లీన్ చిట్ తెచ్చుకుంటారనే అపవాదు చంద్రబాబు మీద వుండనే వుంది. అది మళ్ళీ వేరే చర్చ.
ఒక చిన్న ట్రాఫిక్ నిబంధన, వాహనదారుడు ఆస్తులమ్మి అయినా చలాన్ కట్టక తప్పని పరిస్థితిని తీసుకొస్తుంది. చిన్న చిన్న దొంగతనాల్లో, నేరస్తులకు కఠిన శిక్షల్నీ చూస్తున్నాం.
కానీ, రాజకీయ వ్యవస్థలో.. వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతి ఆరోపణలున్నా.. కేసులు మాత్రం, నత్తనడకన సాగుతూనే వుంటాయ్. ఇదింతే.!
లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసులు ఎన్నేళ్ళు నడిచాయో చూశాం. తప్పించుకు తిరగడానికి చాలా ఏళ్ళ పాటు నానా రకాల వేషాలూ వేసినా, చివరికి ఆయన జైలు శిక్ష అనుభవించక తప్పలేదనుకోండి.. అది వేరే సంగతి.
తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అదే సమయంలో, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, తీవ్రమైన నేరాభియోగాల్లో ఇరుక్కున్నప్పుడు.. ఆ కేసుల సాగతీత, సభ్య సమాజానికి తప్పుడు సంకేతాల్ని పంపుతుంది.
న్యాయ వ్యవస్థ అంటే గౌరవం వుండదు.. చట్టాలంటే భయం వుండదు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇదీ ఓ కారణం.