Table of Contents
Idupu Kayitham Telangana Bhasha.. తెలుగు అంటే, అది ఒక భాష.! తెలంగాణ అంటే, అదిప్పుడు ఓ రాష్రం. ఆంధ్ర ప్రదేశ్ ఇంకో రాష్ట్రం. ఆంధ్ర అనేది ఓ ప్రాంతం.. తెలంగాణ కూడా ఒకప్పుడు ప్రాంతం.
ప్రాంతాలు, రాష్ట్రాలు.. వీటికి అతీతం భాష అంటే.! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అనేది మాతృభాష. దేశ వ్యాప్తంగా చాలామంది తెలుగువారున్నారు.
ఆ మాటకొస్తే, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు విద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో స్థిరపడ్డారు.
రాష్ట్రం, అందులో మళ్ళీ వేర్వేరు ప్రాంతాలు. ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు.. ఇలా ప్రాంతాలుంటాయ్.
తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ.. ఇలా మాట్లాడుకుంటాం ప్రాంతాల గురించి. ఆయా ప్రాంతాల్లో ‘యాస’ కాస్త ప్రత్యేకంగా వుండొచ్చు.
Idupu Kayitham Telangana Bhasha.. భాష గొప్పదా.? యాస గొప్పదా.? ఏది తెలుగు భాష అంటే.?
భాష కంటే, యాస అందమైనది.. అంటారు కొందరు.! అందులోనూ నిజం లేకపోలేదు. భాష గొప్పదా.? యాస గొప్పదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.
అసలు భాష అనేది ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి. యాస అంటే, ఆయా ప్రజల వాడుక భాష.. అందులోనూ అద్భుతమైన పదాలుంటాయి.
ఇదే స్వచ్ఛమైన తెలుగు భాష.. అని తీర్మానించడానికి కుదరదు. ఎందుకంటే, తెలుగు పదాలని మనం అనుకుంటున్నవి చాలావరకు వివిధ భాషల్లోంచి తీసుకున్నవే.
ఇంతకీ, ‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి.? ఇది తెలుగు భాషలోకి వస్తుందా.? తెలంగాణ భాషలోకి వస్తుందా.? ఆంధ్ర భాషలోకి వస్తుందా.? ఈ రచ్చ జరుగుతోందిప్పుడు.
అచ్చమైన తెలంగాణ పదం ‘ఇడుపు కాయితం’ అంటారు కొందరు. కాదు కాదు, అది రెండు పదాల కలయిక.. అనేవారూ లేకపోలేదు.
అచ్చమైన తెలుగు ‘ఇడుపు కాయితం’
ఇడుపు, విడుపు.. ఇలా చెప్పుకోవచ్చు. విడాకుల పత్రం.. అని అర్థమట. అలాగని చర్చ జరుగుతోంది ఓ సినిమాకి ఈ టైటిల్ పెట్టాక.
బ్యాంకుల్లోంచి డబ్బుల్ని ‘డ్రా’ చేయడానికి ఉపయోగించే కాగితం, ‘విత్‌డ్రాయల్ ఫామ్’ని ఇడుపు కాయితం అంటారు.
అలాగే, కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు ఉపయోగించేది కూడా ఇడుపు కాయితమే. కాగితమే, కాయితం. ఇడుపు అంటే, విడుపు.. విడిపించడం.
పెళ్ళిళ్ళలో, ఇతర శుభ కార్యాల్లో.. ‘చదివింపుల’ గురించి వినే వుంటాం. వాటికి ‘ఈడ్పులు’ అనీ, ఇడుపులు అనీ అంటుంటారు కొన్ని చోట్ల.
చెప్పుకుంటూ పోతే, చాలా సందర్భాల్లో ఈ ‘ఇడుపు కాయితం’ అనే మాటని వాడుతుంటారు. కాదు కాదు, వాడుతుండేవారు. కాలం, ఇలాంటి వ్యవహారికాల్ని తనలో కలిపేసుకుంది.
తెలుగుని మర్చిపోయి.. తెగులుతో కొట్టుమిట్టాడుతున్నాం..
ఎందుకంటే, జనం ఎప్పుడో తెలుగుని మర్చిపోయారు కదా.! అద్గదీ అసలు సంగతి. అందుకే, ఎవడికి తోచిన రీతిలో వాడు ‘ఇడుపు కాయితం’ అనే మాటకి ప్రాంతీయతను అద్దేస్తున్నాడు.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఎవడికీ ఏమీ తెలియడం లేదు ఈ రోజుల్లో. తెలిసినా, ప్రాంతీయత ముసుగులో కొట్టుకు ఛస్తున్నారు.
వచ్చిండన్నా.. వచ్చాడన్నా.. వరాల తెలుగూ మనదేరన్నా.. అని ఓ సినీ కవి చెప్తాడు. ప్రతి పదమూ మనదే, ప్రతి మాటలోనూ అందం వుంటుంది. ఏదీ ఏ ఒక్కడి సొత్తూ కాదు.. అన్నీ మనవే.
తెలుగు భాష అంటే, అమ్మ లాంటిది. అమ్మ అందరికీ సొంతం. ఆ అమ్మలాంటి భాషనీ, అందులో పదాల్నీ, మాటల్ని గౌరవించుకోవడమంటే, మనల్ని మనం గౌరవించుకోవడం.
ఓ సినిమా టైటిల్, తెలుగు గురించిన ఇంత చర్చకు కారణమవడం అభినందనీయం. ఆ టైటిల్ చుట్టూ ప్రాంతీయ విభేదాల్ని అల్లడం మూర్ఖత్వం.!
