Table of Contents
Varahi Devi Secret Darshan.. రాక్షసుల బారి నుంచి భూమాతను కాపాడే క్రమంలో శ్రీ మహా విష్ణువు వరాహ రూపం దాల్చుతారు.
ఆ సమయంలో ఆయన శక్తి నుంచి ఆవిర్భవించిన రూపమే వారాహి అమ్మవారు అని పురాణాల్లో ఒక వెర్షన్ చెబుతోంది.
మార్కండేయ పురాణంలో శుంభ, నిశుంభ మరియు రక్త బీజుడు అనే భయంకరమైన క్రూర రాక్షసులను వధించే క్రమంలో దుర్గాదేవి సప్త మాతృకల్ని సృష్టించిందనని ప్రతీతి.
అలాంటి సప్తమాతృకల్లో ఒకరైన వారాహి మాత ఉగ్ర రూపంతో విరుచుకుపడి ఆ రాక్షసుల్ని వధించిందనేది మరో వెర్షన్.
ఇలా వారాహి అమ్మవారి ఆవిర్భావంపై అనేక రకాల పురాణ గాథలున్నాయ్. మంత్ర, తంత్ర శక్తులకు ప్రతీకగా వారాహి అమ్మను ముఖ్యంగా రాత్రి వేళలో ఉపాసిస్తారు.
ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వారాహి అమ్మవారి ప్రాచీన ఆలయాలు
సప్త మాతృకలకు ప్రత్యేకంగా ఆలయాలున్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు. కానీ, వారాహి అమ్మవారు శాస్త్రీయ ఆలయాల్లో రాజ ప్రాసాదాలకు రక్షకురాలుగా వుండేవారని తెలుస్తోంది.
అయితే పరిశోధనల నేపథ్యంలో వారాహి అమ్మవారికి అక్కడక్కడా కొన్ని ప్రాచీన ఆలయాలున్నట్లు తెలుస్తోంది. అందులో కాశీలోని వారాహి అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం నేల మాళిగలో వుంటుంది. పైన వున్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వీలవుతుంది.
Varahi Devi Secret Darshan.. రహస్యంగా మాత్రమే దర్శించుకోవాలి
అంతే కాదు, రాత్రి వేళలో మాత్రమే ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు. మరియు తెల్లవారుజామున కొంత సమయం మాత్రమే దర్శనానికి అనుమతి వుంటుంది.
ఇక్కడి వారాహి అమ్మవారు చాలా శక్తివంతురాలిగా చెబుతారు. దర్శనంతో పాటూ, అమ్మవారికి చేసే కైంకర్యాలన్నీ చాలా రహస్యంగా పద్ధతిగా, నిష్టగా నిర్వహిస్తుంటారు.

నేల మాళిగలోని వారాహి మాత ఉగ్ర రూపం చాలా భయంకరంగా వుంటుందనీ, అందుకే పరిమిత సమయం మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతినిస్తారట.
కేవలం రాత్రి వేళలో మాత్రమే పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారనీ స్థానికులు చెబుతుంటారు.
స్వచ్ఛమైన పసుపుతో అమ్మవారికి పూజ
తమిళనాడులోని ఉత్తిరకోసమంగై అనే ప్రాంతంలో మరో వారాహి అమ్మవారి దేవాలయం వున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3,200 చరిత్ర సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన ఆలయంగా ఈ ఆలయానికి ప్రశస్తి వుంది.
ఈ ఆలయంలో అమ్మవారికి భక్తులు స్వయంగా అక్కడే పసుపు నూరి అభిషేకం చేసే ప్రత్యేకమైన సాంప్రదాయం వుంది.
మొక్కులు మొక్కిన భక్తులు తమ కోరికలు నెరవేరితే ఆలయం వెలుపలే స్వయంగా పసుపు కొమ్ములు దంచి ఆ పసుపుతోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
తాంత్రిక సాధన కోసం
ఒడిశాలో తొమ్మిదో శతాబ్ధానికి చెందిన మరో ప్రసిద్ధ ఆలయం వుంది. ఈ ఆలయంలో అమ్మవారు కూర్చున్న భంగిమలో ఒక చేతిలో మత్స్యం, మరో చేతిలో కపాలం చేతపట్టి ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు.

తాంత్రిక సాధన కోసం మాత్రమే ఈ అమ్మవారిని కొలుస్తుంటారు. సాధారణ భక్తులకు ఈ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం.
తమిళనాడు తిరుచిరాపల్లిలో పై కప్పు లేని వారాహి అమ్మవారి ఆలయం వుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునేవారు ఈ అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారు.
సాధారణ భక్తులు జర జాగ్రత్త
వారాహి అమ్మవారు ఉగ్ర రూప దేవత. కాబట్టి ఇంట్లో పెట్టి పూజించకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు.
కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో వారాహి అమ్మవారికి ప్రాచుర్యం బాగా పెరిగింది.
గుప్త నవరాత్రులు పేరుతో సాధారణ ఆలయాల్లో ప్రత్యేక పూజలూ హోమాలు నిర్వహించడంతో పాటూ, సాధారణ భక్తులు సైతం ఇంట్లోనే అమ్మవారిని పూజిస్తుండడం చూస్తున్నాం.
కానీ, వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజించాలనుకుంటే చాలా నిష్టగా, నిజాయితీగా, పద్ధతి, పడికట్లతో పూజించాలన్నది వేద పండితులు సూచిస్తున్న సలహా.
