Table of Contents
Friendly Fight Janasena TDP.. పొలిటికల్ వ్యూహాలకు సంబంధించి జన సేనాని పవన్ కళ్యాణ్ మీద, జనసైనికుల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అనుమానాలు వస్తూనే వుంటాయ్.
టీడీపీతో 2024 ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఇటు జన సైనికుల్లోనూ, అటు టీడీపీ క్యాడర్‌లోనూ పవన్ కళ్యాణ్ ఒకింత వ్యతిరేకతను ఎదుర్కొన్నమాట వాస్తవం.
ఒంటరిగానే పోటీ చెయ్యాలని జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోకూడదని టీడీపీ కార్యకర్తలు.. నానా యాగీ చేశారు.
సీట్ల పంపకాల విషయంలో జనసేన తగ్గడాన్ని, జనసైనికులు అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోయారు. కానీ, జనసైనికులు, టీడీపీ కార్యకర్తలూ.. 2024 ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నారు.
Friendly Fight Janasena TDP.. గిల్లి కజ్జాలు ముదిరిపోతే..
కలహాల కాపురం.. అనలేం కానీ, టీడీపీ – జన సేన పొత్తుకి సంబంధించి ‘గిల్లి కజ్జాలు’ తరచూ చూస్తూనే వున్నాం. సరిగ్గా ఇదే సమయంలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్, ‘టీడీపీతో స్నేహ పూర్వక పోటీ’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ‘ఫ్రెండ్లీ ఫైట్’ రాజకీయాల్లో సర్వసాధారణం. స్థానిక ఎన్నికల్లో చాలా చాలా కామన్.
పొత్తులతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికల్లో ‘ఫ్రెండ్లీ ఫైట్’ చేయడం కొత్తేమీ కాదు. కానీ, పవన్ కళ్యాణ్ నోటి నుంచి ‘ఫ్రెండ్లీ ఫైట్’ అనే అంశం రావడంతో, టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది.
పవన్ కళ్యాణ్‌కి అన్నీ తెలుసు.! మిత్రపక్షం టీడీపీతో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఆయనకు ఓ క్లారిటీ వుంది. పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ అధినాయకత్వానికి కూడా పూర్తి స్పష్టత వుంది.
ఫ్రెండ్లీ ఫైట్.. అనగా, స్నేహపూర్వక పోటీ..
అయితే, ఈ ఫ్రెండ్లీ ఫైట్ అనేది, ముదిరి పాకన పడితే.. 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే.
వాస్తవానికి, స్థానిక ఎన్నికల్లో క్యాడర్ ఉత్సాహంగా పని చేయాలంటే, ‘ఫ్రెండ్లీ ఫైట్’ టీడీపీతో తప్పనిసరి.. అన్నది జన సేనాని పవన్ కళ్యాణ్ భావన కావొచ్చు. ఇందులో తప్పేమీ లేదు కూడా.
నామినేషన్లు వేశాక కూడా, చివరి నిమిషంలో ఉప సంహరణలుంటాయి. ఉప సంహరణ గడువు తీరాక కూడా, స్నేహ పూర్వక పోటీ.. లేదంటే, పోటీ నుంచి తప్పుకుని, ప్రత్యర్థికి మద్దతివ్వడం.. ఇవన్నీ స్థానిక ఎన్నికల్లో మామూలే.
జన సేన క్యాడర్ దమ్మెంతో..
జన సేన క్యాడర్ ఎంత బలంగా నిలబడుతుంది.? అన్నదానిపై జన సేనానికి కూడా ఈ స్థానిక ఎన్నికల్లో ఇంకాస్త స్పష్టత వస్తుంది.
అదే సమయంలో, క్యాడర్ కూడా తమ బలమెంత.? అన్న అంచనాకి రావడానికి ఈ స్థానిక ఎన్నికల్లో ‘ఫ్రెండ్లీ ఫైట్’ ఉపకరిస్తుంది.
ఏమో, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలాగైనా మారొచ్చు. ఈ స్థానిక ఎన్నికల ప్రభావం, 2029 ఎన్నికలపైనా బలంగా వుండొచ్చు.
అన్నట్టు, ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పూర్తి సైలెంట్ అయిపోయింది. ఆటలో అరటిపండులా మారిపోయింది వైసీపీ, స్థానిక ఎన్నికలకు సంబంధించి.
