Janasena Strikes Again.. 100% స్ట్రైక్ రేట్ మళ్ళీ సాధించింది జనసేన పార్టీ.
మొత్తంగా రెండు కార్పొరేషన్లు, పదిహేను మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయితీల్లో పోటీ చేసి, అన్నిటినీ కైవసం చేసుకుంది జనసేన.
కూటమి పంపకాల నేపథ్యంలో, జన సేన పార్టీలో కొంత అసంతృప్తి చెలరేగింది. ఆ అసంతృప్తితోనే పలువురు రెబల్స్‌గా కూడా పోటీ చేశారు చాలా రోట్ల.
జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే జన సేన పార్టీని రెబల్స్ బెడద వెంటాడిందనుకోండి.. అది వేరే సంగతి.
ఎలాగైతేనేం, స్ట్రైక్ రేట్ మాత్రం తగ్గలేదు. పైగా, పెరిగిందని చెప్పాలేమో. ఎందుకంటే, ఆదోని మునిసిపాలిటీ కూడా జనసేనకి దక్కింది.
Janasena Strikes Again.. రెబల్.. అదనం..
జనసేన రెబల్ అభ్యర్థి ఆదోనిలో విజయం సాధించడం గమనార్హం. గెలిచి, జనసేన పార్టీకే బహుమతిగా ఆ విజయాన్ని అందిస్తానని చెప్పి మరీ, జనసేన నేత మల్లప్ప, తన భార్యను గెలిపించుకున్నారిక్కడ.
స్థానిక ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే. అధికారంలో వున్నవారికి అనుకూలమన్న ప్రచారం ఈనాటిది కాదు. అయితే, జనసేనకు ఈ ఎన్నికల్లో గెలుపు చాలా చాలా ప్రత్యేకం.
కొత్త ప్రాంతాలకు జనసేన విస్తరించింది. చాలా చోట్ల జనసేనకి మిత్రపక్షం నుంచి సరైన మద్దతు లేకపోయినా, చెమటోడ్చి పార్టీని గెలిపించుకున్నాయి జనసేన శ్రేణులు.
ఇంకొన్ని సీట్లు అదనంగా తెచ్చుకోగలిగి వుంటే, గెలుపు మరింత ఘనంగా వుండేదన్న చర్చ జనసేన శ్రేణుల్లో బలంగా జరుగుతోందిప్పుడు.
స్ట్రైక్ రేట్ ముఖ్యమేగానీ..
ఆదోని సీటు గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ‘జనసేన బాహుబహలి’ అంటున్నారు జనసేన రెబల్ మల్లప్ప నాయకర్‌ని.
స్ట్రైక్ రేట్ ముఖ్యమే.. అదే సమయంలో, పోటీ చేయగలిగే స్థానాల్లో ‘బలం సరిపోదేమో’ అన్న కోణంలో, చేతులెత్తేయడం సబబు కాదన్న విషయాన్ని జన సేన అధినాయకత్వం గుర్తెరగాలి.
రాజకీయాల్లో బలం పెంచుుకోవాలంటే, స్ట్రైక్ రేట్ గురించి మరీ అంత ఎక్కువ ఆలోచించి, భయపడిపోకూడదు. ఇదే స్థానిక ఎన్నికలు జన సేన పార్టీకి ఇచ్చిన మెసేజ్.
ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ జన సేన పార్టీకి ఇదే తరహా విజయం దక్కనుందన్నది నిర్వివాదాంశం. ముందే చెప్పుకున్నాం కదా.. స్థానిక ఎన్నికలు అధికారంలో వున్నవారికి అనుకూలంగా వుంటాయని.