Home » విశ్వక్ సేన్ ‘కల్ట్’ రివ్యూ.! నరుకుడు రోగం జుగుప్సాకరం.!

విశ్వక్ సేన్ ‘కల్ట్’ రివ్యూ.! నరుకుడు రోగం జుగుప్సాకరం.!

by Mudra369 Editorial Desk
0 comments
Vishwak Sen Cult Review

Vishwak Sen Cult Review.. భారత దేశంలో మొట్టమొదటి ‘స్లాషర్ మూవీ’ అట.! సినిమా మొదలెట్టినప్పటినుంచి, ముగిసేదాకా.. తెర నిండా రక్తపాతం తప్ప, ఇంకేమీ కనిపించదు.!

ఇదేం సినిమా.? అని ప్రేక్షకులు థియేటర్లలో హాహాకారాలు చేసే పరిస్థితి.! విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమానే ‘కల్ట్’.!

ఫ్లాపుల మీద ఫ్లాపులతో కెరీర్‌ని పాతాళంలోకి తొక్కేసుకున్న విశ్వక్ సేన్, ఈ ‘కల్ట్’తో బౌన్స్ బ్యాక్ అవుతాననే ధీమా వ్యక్తం చేశాడు, సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో.!

ఈ మధ్య ఏ సినిమా చూసినా సరే, అందులో తలలు తెగి పడే సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి. మొన్నీమధ్యనే వచ్చిన ‘టాక్సిక్’, ‘ది ప్యారడైజ్’ సినిమాల్లో చూపించింది అదే.

మరి, ‘కల్ట్’లో కొత్తగా ఎలా నరికాడబ్బా.? తలలు తెగిపడటం, శరీర భాగాలు తెగిపడటం.. ఇదే దాదాపుగా సినిమా అంతా.! తెర నిండా జుగుప్సాకరమైన రీతిలో రక్తపాతమే.!

సినిమా రిలీజ్‌కి ముందే, సినిమా ప్రమోషన్లలో ఇదే విషయాన్ని చూచాయిగా చెప్పేశారు.

థియేటర్లలో ఆ నరుకుడు వ్యవహారాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళలో చాలామంది, థియేటర్ల నుంచి బయటకు వచ్చాక, ‘వాంతులు’ చేసుకోవాల్సి వచ్చిందంటే, అతిశయోక్తి కాదేమో.

Vishwak Sen Cult Review.. కథేంటంటే..

‘కల్ట్’ పేరుతో ఓ క్లబ్బు.! అందులో ఓ మినిస్టర్ కొడుకు బర్త్ డే పార్టీ.! ఆ పార్టీకి బోల్డంతమంది గెస్టులు.! పబ్ తాళాలు మూతపడతాయి.. రకరకాల ఆటలు మొదలవుతాయి.

ఆ ఆటలన్నీ, అందులోని గెస్టుల్ని నరికి పారేసేలా డిజైన్ చేయబడ్డాయి. బర్త డే పార్టీలో ఎంజాయ్ చేద్దామనుకున్న గెస్టులు, ఒకరొకరుగా దారుణంగా కళ్ళ ముందే చనిపోతుంటే, బెంబేలెత్తిపోతారు.

మినిస్టర్, తన కొడుకు క్షేమం కోసం పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతాడు. పోలీస్ ఉన్నతాధికారులు, ఆ క్లబ్బులోపల, సస్పెండ్ అయిన, పోలీస్ అధికారి వున్నాడని, మంత్రికి చెబుతారు.

ఆ పోలీస్ అధికారి, ఉన్నతాధికారుల సూచనతో లోపల పరిస్థితుల్ని చక్కదిద్దాడా.? లేదా.? గెస్టుల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నదెవరు.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.?

ఇందులో ఎవరైనా చేయడానికి ఏముంటుంది.? లీటర్ల కొద్దీ కాదు, గ్యాలన్ల కొద్దీ రక్తాన్ని నింపేశారు.. రకరకాల ఆయుధాలతో, శరీర భాగాల్ని తెగ నరికేసినట్లు చూపించేశారు.

విశ్వక్ సేన్ షరామామూలుగానే చేసుకుంటూ పోయాడు. దీన్ని స్టైలిష్ యాక్టింగ్ అనాలా.? ఇంకేమన్నా అనాలా.? అంటే, అదంతే.!

హీరోయిన్ గాయత్రీ భరద్వాజ్‌కి నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర దక్కింది. ఆమె గ్లామర్ విషయంలోనూ పెద్దగా చేసిందేమీ లేదు.

తారక్ పొన్నప్ప జస్ట్ ఓకే. మురళీ శర్మ మామూలే. శ్రీకాంత్ అయ్యంగార్ అతి నటన అస్సలు భరించలేం. మిగతా పాత్రధారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

సంగీత దర్శకుడు రవి బాసూర్ కొన్ని సన్నివేశాలకు తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ‘హై’ తెచ్చాడు.! ఇలాంటి సినిమాలకి ఎలాంటి సంగీతం వుండాలో, అలాంటి సంగీతమే ఇచ్చాడు.

ప్రేక్షకుల్ని హింసించి, భయపెట్టిన విశ్వక్ సేన్..

సినిమాటోగ్రఫీ బానే వుంది.! సినిమాలో పాత్రల శరీర భాగాల్ని విచ్చలవిడిగా నరికేశారుగానీ, అసలంటూ నరకాల్సింది చాలా సన్నివేశాల్ని. ఎడిటర్, ఈ విషయంలో కాస్త మొహమాటపడ్డాడు.

హీరో ఎంట్రీ, దాదాపుగా సినిమా ప్రారంభమయిన గంట తర్వాత వస్తుంది. అప్పటిదాకా, ఆ నస భరించడం సగటు ప్రేక్షకుడికి కష్టం.

ఖర్చు బాగానే పెట్టారు. రిచ్‌గానే సినిమా తెరకెక్కించారు. డైలాగుల్లో పెద్దగా పస లేదు. దర్శకత్వం విషయానికొస్తే, కొరియన్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ చూసి, ఇన్‌స్పైర్ అయి, కథ రాసేసుకున్నాడు విశ్వక్ సేన్.

నటుడిగా, తెరపై ఫర్లేదు.. బానే పెర్ఫామ్ చేశాడు విశ్వక్ సేన్. దర్శకుడిగా మాత్రం, ప్చ్.. పెద్దగా క్రియేటివిటీ చూపించిందేం లేదు.

ఓటీటీ ప్రతి ఇంట్లోనూ వుంది కాబట్టి, ఇందులో ఏ సన్నివేశమూ సర్‌ప్రైజింగ్‌గా అనిపించదు.. అన్ని భాషల కంటెంట్ జనాలు చూసేస్తున్నారు మరి.

‘వీక్ హార్టెడ్ పీపుల్ మా సినిమాకి రావొద్దు.. ఫ్యామిలీస్, మా సినిమా గురించి అస్సలు ఆలోచించొద్దు..’ అని పదే పదే చెబుతూ వచ్చాడు సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో విశ్వక్ సేన్.

మిగిలిన ప్రేక్షకులూ, ఈ ‘కల్ట్’ వైపు చూసేందుకే పెద్దగా ఇష్టపడే పరిస్థితి లేదు. అంత దారుణంగా వుంది నరుకుడు వ్యవహారం.

అన్నట్టు, దీనికి కొనసాగింపు కూడా వుంటుందని చివర్లో చెప్పకనే చెప్పేశారు. బాబోయ్, ఇంకోసారి నరుకుడు, రక్తపాతమా.? ఆ ఆలోచన మానుకుంటే మంచిదేమో.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group