Table of Contents
Double Decker Living Root Bridge Meghalaya.. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది.? అంటే మేఘాలయలోని ‘చిరపుంజి’ అని ఠక్కున చెప్పేస్తాం.
చిన్నప్పటి నుంచీ పుస్తకాల్లో చదువుకున్న జనరల్ నాలెడ్జ్ మరి అది.
అయితే, అక్కడ వర్షం అలా ఇలా పడుతుందా.? ఏకంగా వంతెనలకు వంతెనలే కొట్టుకుపోతుంటాయ్ రహదారి మార్గాలు చెడిపోతుంటాయ్. దాంతో రాకపోకలకు చాలా ఆటంకం ఏర్పడుతుంటుంది.
అందుకే అక్కడి స్థానిక ప్రజలు రాకపోకలకు అడ్డంకి లేకుండా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అత్యంత తెలివి తేటలనుపయోగించి చేసుకున్నారు.
Double Decker Living Root Bridge Meghalaya.. చెట్టు వేర్లతో ఏర్పాటు చేసిన వంతెనలు..
ఈ వంతెనలు నిర్మించడానికి ఏవో కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టింది కాదు. కొన్ని తరాలే పట్టేది.
రబ్బరు చెట్టను (Ficus Elastica) నదికి ఒక వైపు నాటుతారు. వీటి ద్వారా మొలిచిన వేళ్ల రెండో భాగాన్ని నదికి రెండో వైపు నేలలోకి పాతుకునేలా చేస్తారు.
ఈ అనుసంధానానికి పోక చెట్ల (Aerial Roots) కాండాలను ఉపయోగిస్తారు. నదికి ఇటు వైపు నుంచి అటు వైపు నేలలోకి పోక చెట్ల కాండాల ద్వారా రబ్బరు చెట్ల వేళ్లు బలంగా పాకుతూ నేలలోకి చొచ్చుకుపోతాయ్.
ఇలా నదికి అడ్డంగా చెట్ల వేర్లతో వంతెన ఏర్పడుతుంది. అయితే, ఈ వంతెన ఏర్పడడానికి కొన్ని సంవత్సరాల కాలం (ఇంచుమించుగా ఒక తరం) పట్టొచ్చు.
ఏళ్లు గడిచే కొద్దీ మరింత బలపడే వింతైన వంతెనలు
ఒక తరం వారు నాటిన వేర్లవంతెనపై వారి పిల్లలు, మనవలు నడుస్తారన్న మాట. దట్టమైన కొండలు, ఉధృతంగా ప్రవహించే నదులు వున్న ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఏర్పాటు చేసినవే ఈ లివింగ్ రూట్ వంతెనలు.
సాధారణంగా కాంక్రీట్, ఐరన్ మిశ్రమాలతో కట్టే బ్రిడ్జ్ ఏళ్లు గడిచే కొద్దీ బలహీనపడిపోతుంది. ఈ చెట్టు వేర్ల బ్రిడ్జ్ మాత్రం వేర్లు నేలలోకి పాతుకుపోయేకొద్దీ మరింత బలపడుతుంది.

ఎంత కుండపోత వర్షానికైనా ఈ బ్రిడ్జ్‌లు తట్టుకుని నిలబడతాయ్. మేఘాలయ స్థానిక ఖాసీ గిరిజనులుగా పిలవబడే లోకల్ పీపుల్ మెదడులో మెరిసిన ఆలోచనే ఈ చెట్టు వేర్ల బ్రిడ్జ్ అద్భుత సృష్టి.
పైన నాటిని చెట్లు ఎంతగా ఎదిగితే.. అంతలా నేలలో పాతుకుపోయిన వేర్లు బలంగా విస్తరిస్తాయ్. తద్వారా వాటి వేర్లతో ఏర్పడిన బ్రిడ్జ్ మరింత బలంగా మారుతుంది.
ఈ వంతెన రిపేర్ ఎలా.!
సహజ సిద్ధంగా ఏర్పడిన వంతెనలు కదా. రిపేర్లు కూడా అలాగే వుంటాయ్ మరి. తట్టుకోలేని వర్ష తాకిడికి ఒకవేళ ఏదైనా ఒక చెట్టు వేరు తెగిపోతే.. మిగిలిన చెట్ల వేర్లు సపోర్ట్‌గా వుంటాయ్.
కొంత కాలానికి సహజ సిద్ధంగానే తెగిపోయిన చోట కొత్త వేళ్లు పుట్టుకొచ్చి ఆటోమెటిగ్గా వంతెన మరామత్తు కూడా జరుగుతుంది.
ఒకేసారి 50 మందిని సునాయాసంగా మోయగలవు ఈ వంతెనలు. అన్నట్లు ఇవి ఒకే లైన్ వంతెనలు కాదండోయ్. డబుల్ డెక్కర్ బస్సుల మాదిరి, డబుల్ డెక్కర్ వంతెనలన్నమాట.
నదీ ప్రవాహం ఎక్కువై ఒక లేయర్ వంతెన మునిగిపోతే.. ఆల్టర్‌నేట్‌గా మరో లైన్ వంతెన దానికి పైనే ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల.

మేఘాలయలోని నోంగ్రియాట్ గ్రామంలోని ‘ఉమ్షియాంగ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్’ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.
ఈ వంతెన నిర్మించిన నది నీటి మట్టం పెరిగి మొదటి వంతెన మునిగిపోతే, రాకపోకలకు ఆటంకం కలగకుండా, రెండో అంతస్థు వంతెన ఉపయోగపడుతుంది.
అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే, తద్వారా వచ్చే ప్రకృతి విలయ తాండవాలు.. అవి మిగిల్చిన విషాద సంఘటనలు ఎన్నో ఈ మధ్య చూశాం.
ప్రకృతితో మమేకమై జీవించడం ఎలాగో నేర్చించిన ఈ వంతెనలు అప్పటి మానవ మేథస్సుకు తార్కాణాలు. అలాగే పర్యావరణ పరిరక్షణ పట్ల వారికి వున్న ముందు చూపు, బాధ్యతను తెలియజేస్తాయ్.
