Table of Contents
Irumudi OTT Review.. ‘ఇరుముడి’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిసింది ‘ఇరుముడి’ సినిమాకి.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. సాధారణంగా రవితేజ సినిమాలంటే, ఓవర్ హైప్, డ్రమెటిక్‌గా క్రియేట్ చేస్తుంటారు. అదే రవితేజ గత సినిమాల్ని నిండా ముంచేసింది.
కానీ, ‘ఇరుముడి’ వ్యవహారం వేరు. టైటిల్ దగ్గర్నుంచి, సినిమా ప్రమోషన్స్ వరకు.. ఒకింత డిఫరెంట్‌గానే ప్లాన్ చేశారు.
‘ఇరుముడి’ అనగానే, ఇదేదో అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమా అనే భావన కలగడం సహజం. అదే ‘ఇరుముడి’ సక్సెస్ సీక్రెట్ కూడా.
కానీ, ‘ఇరుముడి’ సినిమా కథ, ఓ చిన్న గిరిజన ప్రాంతానికే పరిమితం. రెండు ఊళ్ళ మధ్యన జరుగుతుంది ఈ కథ.!
ఓ ఎమ్మెల్యే, ఓ గురుస్వామి, ట్రాలీ ఆటో నడుపుకునే వ్యక్తి, అతని కూతురు.. వీళ్ళే ప్రధాన పాత్రధారులు ‘ఇరుముడి’ సినిమాలో.
తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో తరచూ వస్తూనే వుంటాయి. వాటితో పోల్చితే, ‘ఇరుముడి’ భిన్నమైన సినిమా ఏమీ కాదు.
నిజానికి, మరీ అంత గ్రిప్పింగ్‌గా కూడా ‘ఇరుముడి’ సినిమా ఏమీ లేదు. పాత్రల స్వభావం అనూహ్యంగా మారిపోయిందని ప్రేక్షకుడు షాక్ అయ్యే పరిస్థితీ లేదు.
Irumudi OTT Review.. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్.. ఓటీటీ ఎక్స్‌పీరియన్స్..
థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వరకూ ‘ఇరుముడి’ అదుర్స్ అంతే. అయ్యప్ప స్వామి మీద పాటలు.. సినిమాకి ఆ రేంజ్ తెచ్చిపెట్టాయన్నది నిర్వివాదాంశం.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోతే, ఆ చావుకి కారణమైనవాళ్ళని హీరో ఎలా అంతమొందించాడు.? ఇదే ఈ సినిమా కథ క్లుప్తంగా.
దానికి, దైవత్వాన్ని అద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ పని మీద భూమ్మీదకు వచ్చాను, వెళ్ళిపోతున్నాను.. అని, చివర్లో హీరో కూతురితో చెప్పించడం ద్వారా, అయ్యప్ప భక్తుల్ని భక్తి సంద్రంలో ముంచేశాడు.
అయ్యప్ప స్వామి.. అనే అంశాన్ని పక్కన పెట్టి చూస్తే, ముందే చెప్పుకున్నట్లు ‘ఇరుముడి’ ఓ సాదా సీదా సినిమా మాత్రమే.!
ఓ ఊరిలో అమ్మాయిలు వరుసగా చనిపోతుంటారు.. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. ఓ ప్రబుత్వ స్కూలు.. అందులో బ్యాడ్ టీచర్.. ఎమ్మెల్యే మేక వన్నె పులి.. ఇలాంటివి ఎన్ని సినిమాల్లో చూడలేదు.
గురుస్వామి పాత్రని ఇంకాస్త బెటర్‌గా మార్చొచ్చు..
గురుస్వామి పాత్ర కూడా అంతే.! ఆ పాత్రని ఇంకా బెటర్‌గా డిజైన్ చేసి వుండొచ్చు. అంత కన్విన్సింగ్‌గా అనిపించదు గురుస్వామి పాత్ర. ట్విస్ట్ కోసం ఆ పాత్రని ఫోర్స్‌డ్‌గా నెగెటివ్ షేడ్‌లోకి మార్చేసిన వైనం బాలేదు.
అయ్యప్ప స్వామి మాల ధారణ.. అంటే, బోల్డన్ని నియమ నిష్టలతో కూడుకుని వుంటుంది. మాల తీసేశాక, సాధారణ జీవితంలోకి వచ్చేస్తారు. కొందరు దురలవాట్లను ఇంకా ఎక్కువగా కొనసాగిస్తారు మాలధారణ తర్వాత.
అయితే, మాలధారణ తర్వాత.. మాల ధారణలో కొనసాగుతున్నట్లే నియమ నిష్టల్ని పాటించేవారూ లేకపోలేదు. హీరోని మరీ అంత తాగుబోతులా చిత్రీకరించడంలో దర్శకుడి ‘ఉద్దేశ్యమేంటి.?’ అన్నది మాత్రం అర్థం కాదు.
వల్గారిటీకి చోటివ్వకుండా.. ‘ఇరుముడి’ సినిమాని పద్ధతిగా నడిపినందుకు దర్శకుడిని అభినందించి తీరాలి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ దర్శకుడికి బాగా సహకరించాయి. కాదు కాదు, ఆ డిపార్ట్‌మెంట్స్‌ని దర్శకుడు చక్కగా వాడుకున్నాడు.
తండ్రికి, కూతురు అన్ని విషయాలూ చెప్పాలి. అప్పుడే, కూతురికి చుట్టూ మంచి వాతావరణాన్ని ఏ తండ్రి అయినా క్రియేట్ చేయగలడు. ఇదీ ఓ మంచి పాయింట్.
‘రుతుస్రావం’ గురించి హీరో మాట్లాడే ఓ సన్నివేశం, తద్వారా ఇచ్చిన సందేశం.. ఇదంతా ఓ లెక్క. దర్శకుడు, హీరోని ఈ సన్నివేశం విషయమై ఎలా కన్విన్స్ చేసి వుంటాడని ఆశ్చర్యపోతాం.
భయం లేకుండా చేయడమే తండ్రి బాధ్యత..
ఆడ పిల్ల తండ్రికి భయం వుండాలి.. భయం లేకపోవడం వల్లే కూతుర్ని పోగొట్టుకున్నావ్.. భయం వుండటం వల్లే కూతుర్ని కాపాడుకున్నానని గురుస్వామి చెప్పిన డైలాగ్.. ఆలోచింపజేస్తుంది.
అది తప్పని హీరోతో చెప్పించి దర్శకుడు మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చాడు. ప్రతి ఆడపిల్లా తన కూతురు లాంటిదేనని ప్రతి తండ్రీ అనుకుంటే, సమాజం బాగుపడుతుందన్నది ‘ఇరుముడి’ ఇచ్చిన మంచి సందేశం.
స్కూల్ టీచర్ విషయమై వివాదం తలెత్తింది.. కానీ, ఇలాంటి టీచర్లు కూడా సమాజంలో వున్నారని హెచ్చరించేలా ఆ పాత్రని డిజైన్ చేసిన దర్శకుడ్ని అభినందించకుండా వుండలేం.
వయసులో చిన్న పిల్లే అయినా, తోటి ఆడపిల్లల్ని కాపాడేందుకు హీరో కూతురు చేసే ప్రయత్నంతోనూ చక్కటి సందేశాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చాడు.
చూస్తే, సాదా సీదా థ్రిల్లర్ మాత్రమే.! అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రం పూనకమొస్తుంది.! ఆడపిల్ల తల్లిదండ్రులు మాత్రమే కాదు, యావత్ సమాజానికి చక్కని సందేశాన్ని ఇచ్చిన దర్శకుడికి హేట్సాఫ్.!
– yeSBee
