Ys Jagan Rakshasa Yugam.. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ‘ల్యాండ్ స్లైడ్ విక్టరీ’ అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో అదఃపాతాళానికి ఎందుకు పడిపోయింది.?
ముందుగా, ఈ ప్రశ్నకి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం వెతుక్కోవాలి.! ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎందుకు చావు దెబ్బ తగిలిందో, పోస్టుమార్టమ్ చేసుకోకపోతే, తన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న విషయం వైఎస్ జగన్ తెలుసుకుంటే మంచిది.
Ys Jagan Rakshasa Yugam.. ఏది రాక్షస యుగం.?
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుని బట్టీపట్టేసి.. పార్టీ శ్రేణుల ముందర ‘చదివేస్తే’ ఏం ప్రయోజనం.? ‘వై నాట్ 175’ అనే పాఠం కూడా అలాంటిదే. అది వైసీపీకే గుణపాఠం చెప్పింది.
ఇప్పుడేమో, కలియుగం అంటున్నారు.. రాక్షస యుగం అంటున్నారు.. సినిమా చూపిస్తామంటున్నారు.. వైఎస్ జగన్ ఏం చెబుతున్నా, వైసీపీ కార్యకర్తలే నమ్మలేని పరిస్థితి.
ఈ కలియుగంలో.. ఈ రాక్షస యుగంలో.. ఈ చంద్రబాబు యుగంలో.. రాజకీయాలు చేయాలంటే, కేసులకు ప్రిపేర్ అయిపోవాలంటూ వైఎస్ జగన్, ‘బోడి సలహా’ ఇచ్చేశారు పార్టీ శ్రేణులకి.
అధికారంలో వున్నప్పుడు జగన్ చేసిందేంటి.?
రఘురామ కృష్ణరాజు, కొల్లు రవీంద్ర, కింజరాజు అచ్చెన్నాయుడు.. వీళ్ళే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జైలు పాలయ్యారు.. అంతలా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారు జగన్.
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, పూర్తిస్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడి, పోలీసు వ్యవస్థకు ప్రతిసారీ న్యాయస్థానాల్లో చీవాట్లు పడేలా చేశారు.
పరిపాలన అంటే, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలే.. అని రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
ఇప్పుడేమో, వైసీపీ నేతలు వివిధ కేసుల్లో అరెస్టవుతోంటే, ‘రాక్షస యుగం’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెష్ పార్టీ అధినేత.
నలుగురూ నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అనే మాట ఒకటి వుంది. అలా తయారైంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి.
వైసీపీ పాలనని రాక్షస యుగంగా రాష్ట్ర ప్రజలు భావించబట్టే, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు.. అదఃపాతాళానికి వైసీపీని తొక్కేశారు.