పులస పాతిక వేలు.! ఈ ‘చేప’ని తినని జన్మెందుకు.?
Pulasa Fish Godavari Special.. పులస గురించి విన్నారా.? అసలు పులస తిన్నారా.? పులస తినాలంటే, పుస్తెలమ్ముకోవాల్సిందేనన్న మాట ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు గట్టిగా వినిపించేది.
ఇప్పుడేమో, ఎకరాలు అమ్మేసుకోవాలేమో.. అని అనుకుంటున్నారా.? దాని ప్రత్యేకత అలాంటిది. మరీ ఆస్తులమ్మేసుకునేంత ధర కాదుగానీ, బంగార ఉంగరాలు అమ్మేసుకోవాలి పులస తినాలంటే ఇప్పుడు.!
ఇంతకీ, పులస ప్రత్యేకత ఏంటి.? ఈ విషయం పులస అంటే అమితమైన ఇష్టం వున్నవారినే అడగాలి.! రుచి చాలా బావుంటుందనేది ‘పులస ప్రేమికులు’ చెప్పేమాట.
Pulasa Fish Godavari Special.. పులస తిన్లేదా.? నీదీ ఓ బతుకేనా.?
ఎంత రుచిగా వుంటే మాత్రం, పాతిక వేల రూపాయలు వెచ్చించి ‘పులస’ తినాల్సిన అవసరమేముంది.? అదీ, కిలో నుంచి కిలోన్నర చేప కోసమే అంత వెచ్చించాలా.? నాన్సెన్స్.! అనేవారూ లేకపోలేదు.
పులస తిన్లేదా.? నీదీ ఓ బతుకేనా.? అని సరదాగా సెటైర్లేస్తుంటారు ఉభయ గోదావరి జిల్లాల్లో. కిలోల లెక్కన కాదు, ఓ చేప.. జత (రెండు చేపలు).. ఇలా రేటు పలుకుతుంటుంది. రేటు ఎక్కడ ప్రారంభమవుతుందో చెప్పలేం. ఐదారొందలు నుంచి ఒక్కోసారి ప్రారంభమవుతుంది.. అదృష్టం కలిసొస్తో. ఒక్కోసారి అయితే, పది వేలు, పాతిక వేలు.. ఆ పైన వేలం పాటలో ధర ఎక్కడికో వెళ్ళిపోతుంది.
Mudra369
అయినా, ఎవరిష్టం వాళ్ళది. అంబానీ ఇంట పెళ్ళి కోసం ఏకంగా ఐదు వేల కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారం జరుగుతోంది. పెళ్ళి కోసం అంత ఖర్చు అవసరమా.? అంటే ఎలా.! ఎవరి గోల వారిది మరి.!
ఇక, పులస విషయంలోనూ అంతే.! మార్కెట్‌లో ఎంత రేటైనా కొనేసి, ఆ పులస చేపని ఇంటికి తీసుకొచ్చి, పులస వండటంలో ప్రావీణ్యంగల పెద్దవారి చేతికే ఇస్తారు.
అలా పులస, వంటింటికి చేరాక.. దాన్ని శుభ్రం చేసి, అవసరమైనన్ని మసాలాలు దట్టించి వండేస్తారు. ఆ వంటకంలో బెండకాయ అదనంగా వినియోగిస్తారండోయ్.
చదువుతుంటే నోరూరిపోతోంది కదా.! అదే పులస ప్రత్యేకత. పులస చేప కూర.. గిన్నెలో మరుగుతోంటే, ఆ వాసనల్ని ఆస్వాదించడం ఓ కళ.. అంటారు పులస ప్రేమికులు.
పులస ప్రయాణం.. అదో పెద్ద కథ.!
కూర గిన్నెలోంచి, ప్లేట్లో పడ్డాక.. పులస చేప (Pulasa Fish) ముక్క రుచి.. ఆపై, ఆ కూరలోని బెండకాయ రుచి.. వేరే లెవల్ అట.! ఇదండీ సంగతి.!
చేపల్లో పులసలకే ఈ ప్రత్యేకత ఎందుకు.? అంటే, సముద్రంలో సంచరించే ఈ చేప, వర్షాకాలంలో నదుల్లోకి వస్తుంది. మరీ, ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి మాత్రమే ఆ అరుదైన రుచి వుంటుందట.
కొత్త నీరు.. అంటే, ఎర్ర నీరు కదా.! ఆ ఎర్ర నీరులో సంచరించే పులస, ఆ నీటి ప్రభావంతో కొత్త రుచిని సంతరించుకుంటుందని పులస ప్రేమికులు చెబుతుంటారు.
Also Read: ‘రేట్లు’ పెంచితే.. తాగడం, వాగడం మానేస్తారా.!?
గత కొంతకాలంగా పులస పేరుతో, రకరకాల చేపలు తెలుగు రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. వండేసి మరీ, డోర్ డెలివరీ కూడా చేసేస్తున్నారు.
ఇవేవీ కాదు, అచ్చమైన పులస.. గోదార్లో దొరికింది, గోదారి జిల్లాల్లో.. ఆ గోదారి ఆతిథ్యం లభించినప్పుడు తింటే, ఆ కిక్కే వేరప్పా.!