Table of Contents
Rajasthan Ranthambore Ganesh Mandir.. సాక్ష్యాత్తూ ఆ పరమ శివుని త్రినేత్రుడిగా కొలుస్తుంటాం.
కానీ, ఇక్కడ తన తండ్రి మాదిరి గణపతి కూడా మూడు కళ్లతో త్రినేత్రుడిగా దర్శనమిస్తాడు. ఆ క్షేత్రం ఎక్కడుందో తెలుసా.?
రాజస్థాన్లో రణథంబోర్ కోటలో గణనాధుడు ఎక్కడా లేని విధంగా మూడు నేత్రాలతో దర్శనమిస్తాడు. ఈ గణపతి దేవాలయంలో అనేక ప్రత్యేకతలున్నాయ్.
అవేంటీ.? ఎక్కడా లేని విధంగా ఇక్కడ గణపతి ఇక్కడ త్రినేత్రుడిగా ఎందుకు వెలిశాడు.? ఈ దేవాలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి.ై
స్యయంభు గణపతి – స్వప్న వృత్తాంతం..
13వ దశాబ్ధంలో రాజస్థాన్‌లోని రణథంబోెర్ రాజుకీ, ఢిల్లీ రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తుంది.
కొన్ని ఏళ్ల తరబడి సాగిన ఈ యుద్ధంలో రణథంబోర్ రాజు పెద్ద సంఖ్యలో తన సైన్యాన్ని, సామాన్య జనాల్ని కోల్పోతుంటాడు.
అలాగే రాజ్యంలో వున్న ఆహార నిల్వలూ, అపారమైన సంపద కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎలాగైనా తన రాజ్యాన్ని రాజ్య ప్రజల్ని కాపాడాలని తలంచి గణపతిని విశేషమైన పూజలు చేశాడట.
అప్పుడు గణపతి రాజు స్వప్నంలో కనిపించి అభయమిచ్చాడట. తెల్లారి లేచి చూసేసరికి విచిత్రంగా యుద్ధం ఆగిపోయింది. అలాగే ఆహార నిల్వలూ, సంపదతో రాజ్యం సుభిక్షంగా మారిందట.
అంతేకాదు, రాజు కోట పైన మూడు కన్నుల గణపతి స్వయంగా వెలిశాడనీ.. స్థల పురాణం చెబుతోంది. అక్కడే రాజు గణపతికి అతి పెద్ద దేవాలయాన్ని నిర్మించి విశేషమైన పూజలందించాడట.
Rajasthan Ranthambore Ganesh Mandir.. సకుటుంబ సమేతంగా..
ఎక్కడా లేని విధంగా మూడు నేత్రాలతో గణపతి కనిపించడమే కాదు.. వినాయకుడు సకుటుంబ సమేతంగా కొలువై ఇక్కడ భక్తులకి దర్శనమిస్తాడట.
వినాయకుని ఇద్దరు భార్యలు సిద్ది, బుద్ది, అలాగే తన ఇద్దరు కుమారులైన శుభ్, లాభ్, మూషికంతో కూడి ఆశీనులైన వైనం మనకు కనిపిస్తుంది.
రెండు నేత్రాలూ, తొండంతో పాటూ తన తండ్రి శివుని మాదిరి నుదుటి పైన మూడో నేత్రంతో గణపతి ఇక్కడ దర్శనమిస్తాడు.
మొదటి శుభలేఖ గణపతికే.!
ఏ ఇంట్లో శుభకార్యం తలపెట్టాలన్నా.. మొదటి పూజ గణపతికి చేయడం ఆచారం. వివాహాలూ, గృహప్రవేశాలూ.. ఇలా అన్ని శుభకార్యాల్లోనూ తొలి పూజ గణపతిదే మన సనాతన హిందూ ధర్మంలో.
అందుకే కేవలం రాజస్థాన్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు శుభ కార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికలు ఇక్కడికి గణపతి పేరు మీద పెోస్టులో పంపిస్తుంటారు.
అలా మొదటి ఆహ్వాన పత్రిక ఈ త్రినేత్ర గణపతికి పంపడం ద్వారా తమకన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతీ రోజూ కొన్ని వందల కొద్దీ శుభలేఖలు ఈ త్రినేత్ర గణపతి ఆలయానికి పోస్టులో చేరుతుంటాయ్.
వాటిని ఇక్కడి ప్రధాన పూజారులు స్వామి వారి పాదాల చెంత వుంచి, పూజలు జరిపించిన తర్వాత స్వామి వారి ఎదుట చదివి వినిపించడం ఆనవాయితీగా వస్తోంది.
