Home » ‘ది ప్యారడైజ్’ రివ్యూ: నరికేస్తేనే.. రక్తంలో ముంచేస్తేనే ‘మాస్’.!?

‘ది ప్యారడైజ్’ రివ్యూ: నరికేస్తేనే.. రక్తంలో ముంచేస్తేనే ‘మాస్’.!?

by Mudra369 Editorial Desk
0 comments
The Paradise Review

The Paradise Review.. సినిమా అంటే, అందులో ఎక్కడో ఓ చోట, హీరో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్‌లో, ఎవరో ఒకరి తలని నరికెయ్యాలి.! ఇదే, ఇప్పుడు సరికొత్త మాస్ ఎలిమెంట్.!

చిన్న హీరో, పెద్ద హీరో.. అన్న తేడాల్లేవిక్కడ.! నరికి పారెయ్యడమే.! డ్రమ్ముల కొద్దీ, ట్యాంకర్ల కొద్దీ.. రక్తపు రంగుని తీసుకొచ్చి, అందులో నటీనటుల్ని ముంచెయ్యడమే మాస్.!

‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్, విలన్ తల నరికొస్తాడు.. ఇంకో సినిమాలోనూ, మరో సినిమాలోనూ.. ఇదొక ‘హిట్టు’ ప్యాటర్న్ అయిపోయింది.

నాని అంటే, పక్కింటి కుర్రాడు ఒకప్పుడు.! కానీ, నాని కూడా మాస్ హీరో అవతారమెత్తేశాడు. ఇదిగో, ‘ది ప్యారడైజ్’ అంటూ ఊర మాస్ క్యారెక్టర్ చేశాడు.

నాని నటించిన ‘దసరా’ సినిమాలో హీరో స్నేహితుడి తలకాయ్ లేచిపోతుంది.. ఆ సీన్‌కి ఒక్కసారిగా థియేటర్లలో జనం ఉలిక్కి పడ్డారు. ఆ ‘దసరా’ దర్శకుడే శ్రీకాంత్ ఓదెల.!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో మోహన్‌బాబు ఓ కీలక పాత్రలో నటించారు. హీరోయిన్ కయాదు లోహార్. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేసింది.

‘బిర్యానీ’ అనే డిఫరెంట్ రోల్‌లో సంపూర్ణేష్ బాబు నటించాడు. భారీ బడ్జెట్.. ‘ఆయా షేర్’ సాంగ్ అదిరిపోయింది.. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్.. ఇంకా అదిరిపోయింది.

The Paradise Review… ది ప్యారడైజ్ కథా కమామిషు..

ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోయినా, ప్రీ రిలీజ్ హైప్.. ఆకాశాన్నంటేసింది ‘ది ప్యారడైజ్’ సినిమాకి. ఇంతకీ, ‘ది ప్యారడైజ్’ కథా కమామిషు ఏంటి.?

ఓ తల్లి, ఓ కొడుకు.. జైలుకెళ్లిన కొడుకు, తిరిగొచ్చాక తల్లిని ద్వేషిస్తాడు.. తన తెగకు చెందినవారిని ఇబ్బంది పెడుతున్న షికంజా మాలిక్ మీద హీరో ‘జడలు’ తిరగబడటమే, ‘ది ప్యారడైజ్’ కథ.

‘జడలు’ పాత్ర కోసం, హీరో నాని మేకోవర్ ఆల్రెడీ ఆశ్చర్యపరిచింది పోస్టర్లతో, ప్రమోషనల్ వీడియోలతో. బిగ్ స్క్రీన్ మీద ఇంకా ఆశ్చర్చపరుస్తాడు నాని.

ప్రతి ఫ్రేమ్‌లోనూ నటుడిగా చెలరేగిపోయాడు హీరో నాని. సహజ నటుడు కదా, ‘జడలు’ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చాలా చాలా కష్టపడ్డాడు.

హీరోయిన్ కయాదు లోహార్‌కి మంచి పాత్రే దక్కింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రోల్ ఆమెది. ‘సుబ్బు’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై హాట అప్పీల్ పండించడంలో సక్సెస్ అయ్యింది.

సీనియర్ నటి కులకర్ణి హీరో తల్లి సమ్మక్క పాత్రలో చాలా బాగా చేసింది. ఈశ్వరీరావు గురించి తెలిసిందే కదా. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

షికంజా మాలిక్ పాత్రలో మోహన్‌బాబు నటించారు. అయితే, ఆ పాత్రకి బిల్డప్ ఇచ్చినట్లే ఇచ్చి, కీలక సన్నివేశాల్లో డైల్యూట్ చేసేశారు. దాంతో, మోహన్‌బాబు స్టామినాకి తగ్గ పాత్ర కాదనే భావన కలుగుతుంది.

రాఘవ్ జుయల్, చాలా బాగా చేశాడు. కాకపోతే, అతని పాత్ర కూడా అసంపూర్ణంగానే వుందనిపిస్తుంది. ‘బిర్యానీ’ పాత్రలో సంపూర్ణేష్ వృధా అయ్యాడు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సెట్స్ అదరగొట్టేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫస్టాఫ్‌లో అదిరిపోయింది. సెకెండాఫ్ సోసో అనిపిస్తుంది.

డైలాగ్స్ కొన్ని బావున్నాయ్.. స్క్రీన్ ప్లే విషయానికొస్తే, సెకెండాఫ్ అంతా గందరగోళం అయిపోయింది. పాటలు తెరపై చూడ్డానికి చాలా బావున్నాయి. థియేటర్లు ఊగిపోయాయ్ పాటలు వచ్చినప్పుడు.

దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోయిన నాని..

దర్శకుడు ఏం చెప్పినా, ‘నో’ చెప్పకుండా, నాని చేసుకుంటూ పోయాడు.. ఇంటర్వ్యూల్లో నాని చెప్పిందిదే. కానీ, దర్శకుడ్ని కొన్ని విషయాల్లో నాని ‘హెచ్చరించి’ వుండాల్సింది.

ఎలివేషన్ సీన్స్.. మాస్‌ని అలరిస్తాయ్. కానీ, అంతా అదే అయితే, బోర్ కొట్టేస్తుంది. చికాకు పుట్టిస్తుంది. అదే జరిగింది ‘ది ప్యారడైజ్’ విషయంలో.

అంత హింస అనవసరం. హింస కాస్తా జుగుప్సాకరమైన స్థాయికి వెళ్లిపోయింది. ఆ హింసనీ, జుగుప్సనీ తగ్గించి వుంటే, ‘యు/ఎ’ సర్టిఫికెట్ వచ్చి వుండేది.

‘ఎ’ సర్టిఫికెట్ వల్ల సినిమాకి ఒనగూడిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. హీరో – విలన్ మధ్య ఫైట్ పోటా పోటీగా వుంటుందని ఆశించిన ప్రేక్షకులకి నిరాశ కలుగుతుందంటే, అది స్క్రీన్ ప్లే లోపం.. రాసుకున్న పాత్రల్లోనూ లోపం.

సినిమా కోసం ఇంకో వారం లేదా రెండు వారాలు సమయం తీసుకుని, ఎడిటింగ్ విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. చివరి నిమిషం వరకూ వర్క్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బందులు స్క్రీన్ మీద తెలుస్తున్నాయి.

సవారీల ప్రపంచంలోకి..

కొన్ని సీన్స్‌లో దర్శకుడు బలమైన ముద్ర వేయగాలిగాడు. సినిమాని ఎత్తుకున్న విధానం, ‘సవారీల ప్రపంచం ప్యారడైజ్’లోకి మనల్ని తీసుకెళ్ళిన వైనాన్ని అభినందించకుండా వుండలేం.

గొప్ప ఛాన్స్.. చాలా అద్భుతమైన ఛాన్స్‌ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మిస్ చేసుకున్నాడు. ఎమోషన్ చాలా చోట్ల కనెక్ట్ కాదు, ప్రేక్షకుడికి. ప్రధానంగా, జుగుప్సాకరమైన యాక్షన్, సినిమాకి ప్రేక్షకుడ్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది.

సంపూర్ణేష్‌బాబుకి ‘బిర్యానీ’ అంటూ ఎట్రాక్టివ్ పేరు పెట్టి, గెటప్ బీభత్సంగా మార్చిన దర్శకుడు, ఆ ‘బిర్యానీ’ పాత్రని సరిగ్గా వాడుకోకపోతే ఎలా.?

మోహన్‌బాబు గురించి కూడా చాలా చాలా చెప్పి, చివరికి పాత్రని తుస్సు మనిపించేశాడు దర్శకుడు. చెప్పుకుంటూ పోతే, మైనస్సులు ఎక్కువగానే వున్నాయ్.

ఓవరాల్‌గా చూస్తే, ‘ది ప్యారడైజ్’.. కొన్ని ఆకట్టుకునే అంశాలున్నా, అసంతృప్తిని కలిగించే సన్నివేశాలే ఎక్కువ.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్‌ని పోలిన పాత్ర నటుడు ప్రియదర్శితో చేయించడం బానే వున్నా.. అది ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. అలానే, స్వర్గీయ ఎన్టీయార్ పాత్ర కూడా.

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఇద్దరూ కష్టపడ్డారు.. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది.. కానీ, దర్శకుడు తన కష్టాన్ని వృధా చేసుకున్నాడు.

బక్కోడు అనిరుధ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. పాటలకి ఆడియన్స్ ఊగిపోాయారు.. కొన్ని సన్నివేశాల్లో లీనమైపోయారు.. ఇదంతా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఘనతే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group